జిల్లాకు పీఎం కిసాన్ జాతీయ అవార్డు.
*ఈ నెల 24న ఢిల్లీలో అవార్డు తీసుకోనున్న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు*
ఫిబ్రవరి 19, అనంతపురము (ప్రజా అమరావతి);
ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో అనంతపురము జిల్లా ముందు వరుసలో ఉంటుందని మరోసారి రుజువైంది. తాజాగా కేంద్రం ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ అవార్డు సొంతం చేసుకుని జిల్లా సత్తా చాటింది. పీఎం కిసాన్ పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవంతో పాటు పథకం అమలులో ముందు వరుసలో ఉన్న జిల్లాలకు అవార్డులు ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పీఎం కిసాన్ లో లబ్ధిదారుల ఫిజికల్ వెరిఫికేషన్ విభాగంలో జిల్లాకు అవార్డు వరించింది.
పీఎం కిసాన్ పథకానికి అర్హులైన వారిలో 28,505 మంది రైతుల వెరైఫికేషన్ ను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. జాతీయ స్థాయిలో మరే జిల్లాలోనూ లేని విధంగా 99.60 శాతం రైతుల వెరిఫికేషన్ పూర్తి చేయడంతో జిల్లాకు అవార్డు దక్కింది.
జిల్లాకు అవార్డు రావడంపై జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆనందం వ్యక్తం చేశారు. అక్షర క్రమంలో ముందు వరుసలో ఉన్న అనంతపురము జిల్లా అభివృద్ధి, సంక్షేమంలోనూ ముందు వరుసలో ఉంటుందని మరోసారి నిరూపితమైందన్నారు. గతంలో కిసాన్ రైలు వంటి కార్యక్రమానికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు దక్కిందని, ఇప్పుడు వ్యవసాయ రంగంలోనే మరో అవార్డు దక్కడం ద్వారా రైతుల కోసం జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి దేశ వ్యాప్త గుర్తింపు దక్కినట్టయిందన్నారు.
ఫిబ్రవరి 24న న్యూఢిల్లీ పుసా భవనంలో నిర్వహించనున్న పీఎం కిసాన్ వార్షికోత్సవ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులతో కలిసి కలెక్టరు అవార్డు స్వీకరించనున్నారు.
addComments
Post a Comment