మాచర్ల, గుంటూరు జిల్లా (ప్రజా అమరావతి);
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబానికి సీఎం శ్రీ వైఎస్ జగన్ సన్మానం.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట వేడుకలు నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన నేపధ్యంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులకు సన్మానంతో రాష్ట్రంలో ఈ వేడుకలను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ ప్రారంభించారు
వెంకయ్య కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లా మాచర్లలో నివాసం ఉంటున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మాచర్ల వెళ్ళి వారిని సత్కరించారు. మాచర్ల పీడబ్యూడీ కాలనీలో పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి నివాసానికి వెళ్ళి ఆమెను, కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. అంతకుముందు జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి, త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చిత్రపటానికి సీఎం నివాళులు అర్పించారు. వెంకయ్య కుటుంబ సభ్యులందరినీ పేరుపేరునా పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
సీఎం శ్రీ వైఎస్ జగన్‌ను చూసి వెంకయ్య కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. స్వాతంత్ర ఉద్యమ స్పూర్తిని సీఎం శ్రీ జగన్‌తో కలిసి పంచుకున్నారు.
సీఎం శ్రీ వైఎస్ జగన్...పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్రాలను తిలకించారు.
జాతీయ జెండాను గాంధీకి స్వయంగా తన తండ్రి పింగళి వెంకయ్య అందించారని, అలాగే తననూ గాంధీకి పరిచయం చేశారని ఆయన కుమార్తె సీతామహాలక్ష్మి ఆనాటి జ్ఞాపకాలను సీఎంతో పంచుకున్నారు. పింగళి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆమె ముఖ్యమంత్రికి అందజేశారు.
*పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వండి*
పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని శ్రీ నరేంద్రమోదీకి ఆయన లేఖ రాశారు
*పింగళి వెంకయ్య కుమార్తెకు రూ. 75 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం*
పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వం ఆర్ధికసాయం ప్రకటించింది. ఆయన కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మికి రాష్ట్రప్రభుత్వం రూ. 75 లక్షల ఆర్ధికసాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీఅయ్యాయి. ఆర్ధికసాయం తాలూకు ఉత్వర్వుల ప్రతిని సీఎం ఆమెకు అందజేశారు. అనంతరం నగదును ఆమె ఖాతాలో జమచేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, చెరుకువాడ శ్రీరంగనాధ రాజు, అవంతి శ్రీనివాసరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్ధానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment