ప్రజలలో కోవిడ్-19 పట్ల ఉన్న అపోహలను తగ్గించి వాక్సిన్ పై అవగాహన కల్పించాలని

  Thadepalli  (prajaamaravathi);       ప్రజలలో కోవిడ్-19 పట్ల ఉన్న అపోహలను తగ్గించి వాక్సిన్ పై అవగాహన కల్పించాలని


, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వైరస్ తీవ్రతరం కాకుండా అనేక ముందస్తు చర్యలను చేపడుతూ ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచుతోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్ అన్నారు. 19-4-2021 అంటే సోమవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో యునెసెఫ్, ఐఐహెచ్ పి(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హైదరాబాద్) ఆధ్వర్యంలో జరిగిన 13 జిల్లాల సిఇఒలు, డిపిఓ, ఎంపిడిఒల ఆన్ లైన్ సమావేశంలో అయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌతిక దూరం, మాస్క్, శానిటైజర్ వాడటం పట్ల గ్రామీణ కుటుంబాలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని, అవసరమైతే చాటింపు ద్వారా ప్రచారం చేయాలని అన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో భౌతిక దూరం పాటిస్తూ, సమావేశాలు ఏర్పాటు చేసి కోవిడ్ విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. కోవిడ్ వ్యాప్తి గురించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉద్యోగులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులైన సర్పంచ్ లు, వార్డు సభ్యులు కూడా చొరవ తీసుకుని ప్రజలకు తెలియజేయాలని వారికి అవగాహన కల్పించాలని కమిషనర్ కోరారు. యునెసెఫ్, ఐఐహెచ్ పి అధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖను భాగస్వామ్యం చేయడం గౌరవంగా భావిస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్ అన్నారు. ఈ సమావేశంలో ఒఎస్.డి పి. దుర్గాప్రసాద్, యునెసెఫ్, ఐఐహెచ్.పి ప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 660 మండలాల్లో ప్రతి మండలం నుంచి మూడు కేంద్రాలలో, ప్రతి కేంద్రంలో 50 మందిని మించకుండా శిక్షణ కార్యక్రమాన్ని 22-4-2021 నుంచి ఏర్పాటు చేయనున్నారు. ఈ శిక్షణలో ప్రధానంగా ప్రజలకు వ్యాక్సిన్ వలన కలిగే ప్రయోజనాలు, కోవిడ్ మరింత విస్తరించకుండా చేపట్టాల్సిన చర్యలు, మైక్రో కంటైన్ మెంట్ ల ఏర్పాటు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల బాధ్యతలను తెలియజేయడం తదితర అంశాలను చర్చిస్తారు. అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను సాకారం చేయడానికి అవసరమైన ముమ్మర పారిశుద్ధ్య కార్యక్రమాలు, జగనన్న స్వచ్ఛ సంకల్పంను విజయవంతం చేయడానికి కావల్సిన సన్నాహ కార్యక్రమాలను సోమవారం నుంచి ప్రారంభించారు.

Comments