2 కోట్లు దాటిన కరోనా టెస్టులు



2 కోట్లు దాటిన కరోనా టెస్టులు


రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్

జాతీయస్థాయిలో కంటే ఏపీలోనే అత్యధికంగా టెస్టుల నిర్వహణ

జాతీయ స్థాయిలో మిలియన్ జనాభాకు 2.67 లక్షల టెస్టులు

ఏపీలో మిలియన్ జనాభాకు 3.75 లక్షల శాంపిళ్ల పరీక్షలు

12వ విడత జ్వర పీడుతుల గుర్తింపు సర్వే ప్రారంభం : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి

అమరావతి, జూన్ 9 (ప్రజా అమరావతి):  రాష్ట్ర వ్యాప్తంగా 12వ విడత జర్వ పీడుతుల గుర్తింపు సర్వే ప్రారంభమైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కరోనా ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్లకు పైగా శాంపిళ్లు పరీక్షించామన్నారు. జాతీయ స్థాయిలో కంటే ఏపీలో అత్యదికంగా కరోనా టెస్టులు నిర్వహించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోందన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 93,511 శాంపిళ్లు టెస్టు చేయగా, 8,766 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 67 మంది మృతి చెందారని తెలిపారు. కరోనా ప్రారంభమైన తరువాత ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 2,00,39,764 శాంపిళ్లు టెస్టు చేశామని తెలిపారు. దేశ వ్యాప్తంగా చూస్తే ఏపీలోనే అధికంగా టెస్టులు నిర్వహించామన్నారు. మిలియన్ కు ఏపీలో 3.75 లక్షల పరీక్షలు చేయగా, దేశ వ్యాప్తంగా 2.67 లక్షల టెస్టులు చేశారన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా చూస్తే 17,79,773 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 16,64,082 మంది రికవరీ అయ్యారని, 11,696 మంది మృతి చెందారని తెలిపారు. మే 17వ తేదీ నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతూ వచ్చాయన్నారు. మే 17 నాటికి 2,11,554 కరోనా కేసులు ఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలో 1,03,995 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. వివిధ ఆసుపత్రుల్లో 18,716 మంది, 9,707 మంది కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్సపొందుతున్నారన్నారు. 75,572 మంది హోం ఐసోలేషన్ లో వైద్య సేవలు పొందుతున్నారన్నారు. 104 కాల్ సెంటర్ కు కూడా వస్తున్న ఫోన్ కాల్స్ తగ్గుతూ వస్తున్నాయన్నారు. మే మూడో తేదీన ఒకే రోజు 19,175 ఫోన్ కాల్స్ రాగా, గడిచిన 24 గంటల్లో 2,482 మంది కాల్ సెంటర్ కు ఫోన్ చేశారన్నారు. 104 కాల్ సెంటర్ ద్వారా వైద్య సేవలు అందించడానికి పలువురు వైద్యులు ముందుకొస్తున్నారన్నారు. ఇప్పటి వరకూ 5,012 మంది వైద్యులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోగా, వారిలో స్పెషలిస్టులు 951 మంది ఉన్నారన్నారు. వారంతా హోం ఐలోసేషన్లలో ఉన్నవారితో ఫోన్లో మాట్లాడి, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని మందులు వినియోగంపై సలహాలు సూచనలు అందజేస్తున్నారన్నారు. గత మూడు రోజుల నుంచి పది వేల లోపు కరోనా కేసులు నమోదవుతున్నాయన్నారు. 

తగ్గుతున్న కరోనా పాజిటివిటీ రేటు...

మే 16వ తేదీ నాటికి కరోనా పాజిటివిటీ రేట్ 25.56 శాతంగా ఉండగా, ప్రస్తుతం 9.37 శాతానికి పడిపోయిందన్నారు. మంగళవారం(జూన్ 8) ఇంకా తక్కువగా 8.69 శాతం కరోనా పాజిటివిటీ రేట్ నమోదయ్యిందన్నారు. మే ఏడో తేదీకి రికవరీ రేటు 84.32 శాతంగా ఉండగా, ప్రస్తుతం 93.05 శాతానికి పెరిగిందన్నారు. విశాఖ జిల్లాలో 5.87 శాతం, విజయనగరంలో 6.06, కర్నూల్ లో 5.09, గుంటూరులో 6.01... ఇలా పలు జిల్లాల్లో 5 నుంచి 6 శాతంగా కరోనా పాజిటివిటీ రేటు నమోదవుతోందన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం రోజువారీగా 590 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ కేటాయింపు చేయగా, గడిచిన 24 గంటల్లో 497 మెట్రిక్ టన్నులను డ్రా చేసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,955 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా, 114 మంది మృతి చెందారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,301 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పొసకొనజోల్ ఇంజక్షన్లు, మాత్రలు సరిపడా అన్ని జిల్లాలోనూ ఉన్నాయన్నారు. అవసరమైన వారికి 11 వేల ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లను అందజేశామన్నారు. మంగళవారం(జూన్ 8)న ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం 7 వేల ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లను అందజేసిందని, వాటిని అన్ని జిల్లాలకూ అందజేశామని తెలిపారు. 

12వ విడత జ్వరపీడితుల గుర్తింపు సర్వే ప్రారంభం....

బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 12 వ విడత జ్వర పీడుతుల గుర్తింపు సర్వే కార్యక్రమం ప్రారంభమైందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ సర్వేకు సంబంధించిన జర్వ పీడితుల వివరాలను ఈనెల 11 వ తేదీ సాయంత్రానికి పూర్తి స్థాయిలో రానున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 6 నుంచి 11 విడతల జర్వ పీడితుల గుర్తింపు సర్వేల్లో 2,72,240 మంది బాధితులను గుర్తించామన్నారు. వారి శాంపిళ్లు పరీక్షించగా 33,262 కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసిన 4,20,000 కొవిషీల్డ్ డోసులు మంగళవారం (జూన్ 8)న రాష్ట్రానికి చేరాయన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,09,69,000 డోసులను పంపిణీ చేశామన్నారు. వాటిలో ఒక డోసు మాత్రమే వేసుకున్నవారు 58 లక్షలు మంది ఉండగా, 25,87,000 మంది రెండు డోసులు తీసుకున్నారన్నారు. వివిధ కంపెనీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసిన వ్యాక్సిన్లలో ఇంకా 16.54,000 డోసులు రావల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ కోటా కింద జూన్ నెల వరకూ 51,40,000 డోసులు రావాల్సి ఉందన్నారు. 


Comments