జిల్లాలో ప్ర‌తి కౌలుదారునికి త‌ప్ప‌నిస‌రిగా పంట సాగుదారు హ‌క్కు కార్డు (సీసీఆర్‌సీ) అందించాల‌ని

 

కాకినాడ‌, జూన్ 10 (ప్రజా అమరావతి);


జిల్లాలో ప్ర‌తి కౌలుదారునికి త‌ప్ప‌నిస‌రిగా పంట సాగుదారు హ‌క్కు కార్డు (సీసీఆర్‌సీ) అందించాల‌ని


, ఈ కార్డుల జారీకి రైతు భ‌రోసా కేంద్రం స్థాయిలో శుక్ర‌వారం నుంచి 15 రోజుల పాటు ప్ర‌త్యేక స‌ద‌స్సులు నిర్వ‌హించాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. సీసీఆర్‌సీ కార్డుల‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌, 100 శాతం కార్డుల జారీ ప్ర‌క్రియ‌కు సంబంధించి గురువారం జాయింట్ క‌లెక్ట‌ర్.. మండ‌ల‌, డివిజ‌న‌ల్‌, జిల్లాస్థాయి వ్య‌వ‌సాయ‌, రెవెన్యూ అధికారుల‌తో వర్చువ‌ల్ విధానంలో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జేసీ మాట్లాడుతూ రైతుల‌తో పాటు కౌలు రైతుల సంక్షేమానికి ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంద‌ని.. గౌర‌వ ముఖ్య‌మంత్రి, వ్య‌వ‌సాయ శాఖా మంత్రి మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు అర్హ‌త ఉన్న ప్ర‌తి కౌలుదారునికీ సాగుదారు కార్డు అందించి, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు స‌క్ర‌మంగా అందేలా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించి అమ‌లుచేస్తున్న‌ట్లు తెలిపారు. గ‌తంలో 1,10,000 కార్డులు జారీచేశామ‌ని.. ఇప్పుడు అద‌నంగా మ‌రో రెండు ల‌క్ష‌ల కార్డులను జారీచేయాల‌ని లక్ష్యంగా నిర్దేశించిన‌ట్లు వెల్ల‌డించారు. గ్రామ‌స్థాయిలోని వీఆర్వో, వీఏఏ మొద‌లు జిల్లాస్థాయిలోని జేడీ వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి, ప్ర‌జాప్ర‌తినిధుల భాగ‌స్వామ్యంతో కార్డుల జారీ ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. ఆర్‌బీకే స్థాయిలో జ‌రిగే స‌ద‌స్సుకు మండ‌ల వ్య‌వ‌సాయ అధికారి (ఎంఏవో), త‌హ‌సీల్దార్ త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రుకావాల‌న్నారు. కౌలుదారునికి కార్డు అందించ‌డం ఎంత ముఖ్య‌మో భూ య‌జ‌మానికి ఎలాంటి ఇబ్బంది త‌లెత్త‌ద‌నే విష‌యంపై అవగాహ‌న క‌ల్పించ‌డం కూడా అంతే ముఖ్య‌మ‌ని, ఈ దిశ‌గా జ‌రిగే స‌ద‌స్సుల్లో రైతులు, కౌలు రైతుల సందేహాల‌ను నివృత్తి చేయాల‌ని సూచించారు. కార్డుల జారీలో పురోగ‌తిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తామ‌ని, నిర్ల‌క్ష్యం వ‌హించే సిబ్బందిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. క్షేత్ర‌స్థాయిలో సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసి, జిల్లాను ముందు వ‌రుస‌లో నిలిపేందుకు కృషిచేయాల‌న్నారు. పంట వైవిధ్యంపైనా సీసీఆర్‌సీ స‌ద‌స్సుల్లో రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, కేవ‌లం వ‌రికే ప‌రిమితం కాకుండా ఆవ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను దృష్టిలో ఉంచుకొని నీటి ల‌భ్య‌త స‌రిగా లేని ప్రాంతాల్లో లాభ‌సాటి ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌పై దృష్టిసారించేలా అవగాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. రైతులు ఏయే వ‌రి ర‌కాల‌ను సాగుచేయాల‌నే అంశంపైనా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, వినియోగం, లాభ‌దాయ‌క‌త‌, డిమాండ్‌, మార్కెటింగ్ సౌక‌ర్యాలు త‌దిత‌రాల ఆధారంగా వ్య‌వ‌సాయ అధికారులు సూచించిన ర‌కాల‌ను వేసేలా చూడాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జేడీ (ఏ) ఎన్‌.విజ‌య్‌కుమార్‌, డీడీ(ఏ) ఎస్‌.మాధ‌వ‌రావు, స‌బ్ క‌లెక్ట‌ర్లు, ఆర్‌డీవోలు, త‌హ‌సీల్దార్లు, ఎంఏవోలు త‌దిత‌రులు పాల్గొన్నారు.