అప్పులపై తప్పుడు ప్రచారంఅప్పులపై తప్పుడు ప్రచారం


అప్పు చేసిన ప్రతి పైసా పూర్తిగా సద్వినియోగం 

అప్పు చేసిన మొత్తంలో ఎక్కడా దుర్వినియోగం లేదు

సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా నేరుగా ప్రజలకు చేరింది

ఈ రెండేళ్లలో దాదాపు లక్ష కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ

సీఎం ప్రత్యేక కార్యదర్శి శ్రీ కృష్ణ దువ్వూరి వెల్లడి


టీడీపీ మితిమీరిన అప్పులతోనే నేడు ఇన్ని తిప్పలు

నాడు ఎక్కడా ఉత్పాదక రంగంలో వ్యయం చేయలేదు

విద్య, వైద్య రంగాలలో ఏ మాత్రం పెట్టుబడి లేదు

వారు వదిలిపెట్టి పోయిన బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించింది

అలాగే ఏ ఒక్క పథకం కూడా ఆపలేదు

ప్రభుత్వం అలా వ్యయం చేయడం వల్లనే ఆర్థిక రంగం నిల్చింది

ప్రజల కొనుగోలు శక్తి తగ్గినప్పుడు ప్రభుత్వ వ్యయం అనివార్యం

ప్రెస్‌మీట్‌లో శ్రీ కృష్ణ దువ్వూరి వివరణ


విజయవాడ (ప్రజా అమరావతి):


రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుందని, ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని ప్రధాన ప్రతిపక్షం విమర్శలు, ఒక వర్గం మీడియాలో విపరీత ప్రచారం నేపథ్యంలో, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి (ఆర్థిక వ్యవహారాలు) శ్రీ కృష్ణ దువ్వూరి అన్నింటికీ స్పష్టంగా సమాధానం చెప్పారు.


ప్రెస్‌మీట్‌లో శ్రీ కృష్ణ దువ్వూరి ఏమేం చెప్పారంటే..:


ముందుగా అది తెలుసుకోవాలి:

‘గత కొన్నాళ్లుగా రాష్ట్ర అప్పుల మీద విపక్షాలు, వారికి సంబంధించిన మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. తద్వారా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. రాష్ట్రానికి అప్పు పుట్టకూడదని ఈ ప్రచారాలు చేస్తున్నారు. రిజర్వ్‌ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థలు, విదేశీ సంస్థల దృష్టిలో ఏపీ బ్రాండ్‌ను దెబ్బ తీయాలన్నదే వీరి వ్యూహంగా కనిపిస్తోంది. చివరకు పార్లమెంటులో కూడా దురుద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు. ప్రజలకు తప్పుడు సమాచారాన్ని పంపిస్తున్నారు. నాడు వారు చేసిన అప్పు ఇప్పుడు ఖజానాను నిప్పులా దహిస్తోంది. నేటి ఆర్థిక సమస్యలకు మూలాలు 2014–19 పరిపాలనలోనే ఉన్నాయి’.

‘ఇవాళ అప్పుల గురించి మాట్లాడాలంటే, గత ఏడేళ్లుగా ఏం జరిగిందన్నది తెలుసుకోవాలి’.

‘2014లో విభజన తర్వాత మనకు హైదరాబాద్‌ లేకుండా పోయింది. దాని వల్ల రెవెన్యూలోటు ఏర్పడుతుందని ఆరోజే స్పష్టమైంది.

2015–16 లో తెలంగాణాలో తలసరి ఆదాయం రూ.15,454 ఉంటే అదే ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం కేవలం రూ.8,979 మాత్రమే. అంటే దాదాపు సగం. రాష్ట్రం పెద్దది. ఖర్చులు ఎక్కువ. కానీ ఆదాయం తక్కువ. ఆదాయ వనరులు కూడా తక్కువ’.

‘ఈ పరిస్థితి వస్తుందని తెలుసు కాబట్టే ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ చాలా వరకు నెరవేరలేదు. దాని వల్ల కష్టాలు పెరిగాయి’.


ఆ 5 ఏళ్లలో ఎంతెంత అప్పు?:

‘2014–19 మధ్య, టీడీపీ హయాంలో రాష్ట్ర అప్పులు చాలా పెరిగాయి. కానీ అవి దేనికి ఉపయోగపడ్డాయన్నది చూడడం ముఖ్యం.

రాష్ట్ర విభజనతో మనకు (ఏపీ ప్రభుత్వానికి) వచ్చిన అప్పు రూ.97,123 కోట్లు రాగా, ప్రజాపద్దులతో వచ్చే అప్పులు కూడా పరిగణలోకి తీసుకుంటే, అప్పటికి మొత్తం అప్పు రూ.1,20,556 కోట్లు. ఆ మొత్తం అప్పుతో రాష్ట్ర ప్రయాణం మొదలు కాగా, అది 5 ఏళ్లలో ఏకంగా రూ.2,68,225 కోట్లకు పెరిగింది. అయితే అది అక్కడితో ఆగిపోలేదు.

2019లో గత ప్రభుత్వం వదిలిపెట్టి పోయిన బకాయిలన్నింటినీ ఈ ప్రభుత్వం చెల్లించింది’.

‘రాష్ట్రం ఏర్పడే నాటికి, అంటే 2014 నాటికి ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ కార్పొరేషన్లు చేసిన అప్పు రూ.14 వేల కోట్లు కాగా, అది 2019 నాటికి రూ.58 వేల కోట్లకు పెరిగింది. అదే విధంగా విద్యుత్‌ రంగంలో 2014 మార్చి 31 నాటికి వివిధ కార్పొరేషన్లకు రూ.33,587 కోట్ల అప్పు ఉంటే, అది 5 ఏళ్లలో రూ.70 వేల కోట్లకు చేరింది’.


దయనీయంగా విద్యుత్‌ రంగం:

‘విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కమ్‌) బకాయిలు 2014, మార్చి 31 నాటికి కేవలం రూ.2,800 కోట్లు ఉండగా, అవి ఆ 5 ఏళ్లలో రూ.21 వేల కోట్లకు పెరిగాయి. ఇవాళ పవర్‌ సెక్టర్‌ దారుణంగా ఉంది. ఏటా డిస్కమ్‌లు 6 వేల కోట్ల యూనిట్ల విద్యుత్‌ సరఫరా చేస్తుండగా, ఆ సంస్థలపై ఉన్న అప్పులకే దాదాపు రూ.7 వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నాం. అంటే ఒక్కో యూనిట్‌పై సుమారు రూ.1.20 వడ్డీ కింద కడుతున్నాం’.


నాడు కేంద్రం కంటే ఎక్కువ:

‘అప్పులు అందరూ చేస్తారు. కేంద్రం కూడా అప్పులు చేస్తోంది.

2014–19 మధ్య కేంద్రం చేసిన అప్పుల పెరుగుదల ఏటా 9.78 శాతం ఉంటే, మన రాష్ట్రంలో ఆ పెరుగుదల 17.33 «శాతం. అంటే ఆ స్థాయిలో అప్పులు చేశారు. అంత భారీగా అప్పులు చేసినా, అవి ఉత్పాదక రంగాలపై ఖర్చు చేయలేదు. ఏ రంగం కూడా బాగు పడలేదు. వారు అలా కేటాయించి ఉంటే, ఇప్పుడు ఆ భారం ఈ ప్రభుత్వంపై పడేది కాదు’.


మాట నిలబెట్టుకోలేదు:

‘రైతులకు రుణ మాఫీ చేస్తామన్నారు. ఆ అప్పులు దాదాపు రూ.85 వేల కోట్లు కాగా, రూ.15 వేల కోట్లు కూడా మాఫీ చేయలేదు. 2016–17 నాబార్డు రూరల్‌ ఫైనాన్షియల్‌ సర్వే ప్రకారం, దేశంలో సగటు అప్పు భారం 47 శాతం ఉంటే, అదే మన రాష్ట్రంలో ఆనాదు సగటు అప్పు భారం 77 శాతంగా ఉంది’.


దారుణంగా జీఈఆర్‌:

‘విద్యా రంగం గురించి మాట్లాడితే, 9వ తరగతి వరకు ఉచిత విద్య అన్నది చట్టం. కేంద్రం నిధులు కూడా విడుదల చేస్తుంది. అలాగే ఎంత మంది పిల్లలు బడికి వెళ్తున్నారన్నది జీఈఆర్‌ (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో) ద్వారా చూస్తారు. ఆ 5 ఏళ్లలో దేశంలో జీఈఆర్‌ సగటు 99 శాతం ఉంటే, మన దగ్గర 84.48 శాతం మాత్రమే ఉంది’.


వైద్య రంగంలో..:

‘నాడు కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్నా, ఒక్క ప్రభుత్వ ఆస్పత్రి కూడా ఏర్పాటు కాలేదు. కానీ ఇవాళ మూడు ఆస్పత్రులకు కేంద్రం నుంచి అనుమతి తీసుకువచ్చి, మరో 13 ఆస్పత్రులను కూడా ఏర్పాటు చేస్తున్నాం. నాడు–నేడు కింద పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు సమూలంగా మారుస్తున్నాం’.


పత్రిక దుష్ప్రచారం:

‘2020–21లో రాష్ట్రం అదనంగా రూ.4,872 కోట్లు అప్పు చేసిందని ఇవాళ ఒక పత్రిక రాసింది. కొత్తగా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చినట్లు, గతంలో ఏనాడూ అలా జరగనట్లు, దాని వల్ల రాష్ట్రంపై భారం పెరిగినట్లు రాశారు. నిజానికి ఆర్టికిల్‌–293. 3 ప్రకారం మనం ఎంత అప్పు చేయవచ్చన్నది కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయిస్తుంది. అన్ని అంశాలు పరిగణించి ఆ మొత్తం ఖరారు చేస్తారు’.


నాడు పరిమితిని మించారు:

‘అయితే ఆ పరిమితిని మించి గత ప్రభుత్వం 2016–19 మధ్య దాదాపు రూ.16,418 కోట్లు ఎక్కువ అప్పులు చేసింది. 2016–17లో అదనంగా రూ.4,800 కోట్లు, 2017–18లో రూ.1,040 కోట్లు, 2018–19లో మరో రూ.10,574 కోట్లు అదనంగా రుణం సేకరించారు. వాటినే ఇప్పుడు మనకు వచ్చే రుణంలో తగ్గిస్తామని ఇటీవల కేంద్రం ప్రకటించింది. టీడీపీ హయాంలో ఆ విధంగా ఎక్కువ అప్పులు చేశారు. అదే ఇప్పుడు సమస్యలకు ప్రధాన కారణం’.

‘టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఏటా దాదాపు రూ.8 వేల కోట్ల వడ్డీ కడితే, ఈ ప్రభుత్వం వచ్చే నాటికి వడ్డీల భారం ఏకంగా రూ.25 వేల కోట్లకు చేరింది’.


కోవిడ్‌కు ముందే మారిన స్థితి:

‘కోవిడ్‌ వల్ల ఆర్థిక రంగం తలకిందులైంది. కానీ అంత కంటే ముందు కూడా ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదు. మిలీనియం తర్వాత రెండు దశాబ్ధాలలో చూస్తే.. అంతకు ముందు ఏడాది ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు. అంటే 2019–20లో పన్నుల ఆదాయం మైనస్‌ 3.38 శాతంగా నమోదైంది’.

‘ఆ విధంగా 2019–20లో ఈ సమస్య ఉంటే, కోవిడ్‌తో 2020–21లో మొత్తం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఎందరికో జీవనోపాధి పోయింది. ప్రభుత్వ, వ్యక్తిగత ఆదాయాలు పూర్తిగా పడిపోయాయి. దీంతో ప్రభుత్వ వ్యయం గణనీయంగా పెరిగింది. అది అనివార్యమైంది’.


జీడీపీ–కాంపోనెంట్స్‌:

‘స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో మూడు అంశాలు ఉంటాయి.

మొదటిది మనందరం (ప్రజలు) చేసే ఖర్చు ప్రైవేటు ఖర్చు. రెండోది ప్రభుత్వం చేసే ఖర్చు. గ్రాస్‌ ఫిక్స్‌డ్‌ క్యాపిటల్స్‌ ఫర్మేషన్‌ మూడో అంశం’.

‘ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు, ఆర్థిక రంగాన్ని నిలబెట్టాలంటే ప్రభుత్వం ఖుర్చు చేయక తప్పదు. అందుకోసం అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పు చేసి ఖర్చు పెట్టడం వల్లనే ఆర్థిక వ్యవస్థ నిలబడింది’.


కేంద్రానికీ తప్పని పరిస్థితి:

‘అప్పుల గురించి చూస్తే.. కేంద్రానికి కూడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటాల్సిన పరిస్థితి వచ్చింది. దాని ప్రకారం జీడీపీలో 3 శాతానికి మించి అప్పు చేయకూడదు. అలాగే ఏ ఏడాది కూడా మొత్తం జీడీపీలో 40 శాతానికి మించి అప్పు చేయకూడదు. కానీ కోవిడ్‌ సమయంలో అంటే 2020–21లో కేంద్రం దాదాపు రూ.21 లక్షల కోట్ల అప్పు చేసింది. ఇది జీడీపీలో 11.1 శాతం. నిజానికి అది 3 శాతానికి మించకూడదు. అలాగే ఏడాదిలో చూసుకుంటే, అది మొత్తం జీడీపీలో 40 శాతం మించకూడదు. కానీ అది 59.72 శాతానికి పెరిగింది. గతంలో ఏనాడూ ఈ స్థాయిలో అప్పు చేయాల్సిన పరిస్థితి రాలేదు’.


ఆ ఖర్చు అనివార్యం. లేకపోతే..:

‘అయితే ఆ విధంగా అప్పులు చేసి పారదర్శకంగా ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయడం వల్లనే మనం అందరం బయట పడ్డాం. కేంద్రం, రాష్ట్రం రెండూ పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాయి. ఉచితంగా బియ్యం, పప్పులు, నిత్యావసరాలు అందించాయి. అయితే కేంద్రం తమ లెక్కల ప్రకారమే 89 లక్షల కార్డులకు ఆ సరుకులు ఇవ్వగా, మన దగ్గర 1.40 కోట్ల కార్డులు ఉండగా.. అదనంగా 50 లక్షల కార్డులకు ఇవ్వాల్సి వచ్చింది’.


ఆదాయం పడిపోయింది:

‘2019–20లో రాష్ట్ర ఆదాయం తగ్గింది. ఆ ఏడాది రాష్ట్రానికి కేంద్రం నుంచి పన్నుల ఆదాయంలో (4.305 శాతం వాటా) రాష్ట్ర వాటాగా రూ.34,833 కోట్ల ఆదాయం వస్తుందనుకుంటే, చేతికి వచ్చింది కేవలం రూ.28,242 కోట్లు మాత్రమే. అంటే దాదాపు రూ.6 వేల కోట్లు తగ్గాయి. 2020–21లో కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాలో రూ.7,780 వేల కోట్లు తగ్గగా, రాష్ట్ర ఆదాయం కూడా మరో రూ.7 వేల కోట్లు తగ్గింది. మరోవైపు కోవిడ్‌ కోసం మరో రూ.8 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. అంటే దాదాపు రూ.25 వేల కోట్లు రాష్ట్రంపై భారం పడింది’.


పథకాలు–డీబీటీ:

‘ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ఒక్కటే ఆర్థిక పురోగతికి మార్గమని ఆర్థిక వేత్తలు చెప్పారు. 2014–19 మధ్య అప్పులు బాగా పెరిగాయి. కానీ ఆదాయం పెరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. కోవిడ్‌తో ఆదాయం తగ్గినా ఏ పథకం ఆగలేదు. ప్రజల ఖాతాల్లో నేరుగా నగదు జమ అయింది. అలాగే ఏ పథకమూ, కార్యక్రమం కూడా ఆపలేదు. నాడు–నేడు కింద పనులు. వీటన్నింటి వల్ల అప్పులు పెరిగాయి. కేంద్రం కూడా అప్పులు చేసింది. అందుకే విపత్తు నుంచి దేశం బయట పడింది. మన దగ్గర కూడా అంతే’.


కేంద్రం కంటే మనమే తక్కువ:

‘దేశం అప్పు పెరిగిన తీరు, మన రాష్ట్ర అప్పు చూస్తే.. ఈ రెండేళ్లలో అంటే 2019 మార్చి 31 నుంచి 2021 మార్చి 31 నాటికి వరకు కేంద్రం అప్పు (సీఏజీఆర్‌) 17.15 శాతం అయితే, మన రాష్ట్రం అప్పు కేవలం 15.26 శాతమే పెరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం కంటే మనం తక్కువగా అప్పులు చేశాం’.


అప్పులపై విమర్శలు వద్దు:

‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందరూ అర్ధం చేసుకోవాలి. విపక్షాలు. మీడియా ప్రభుత్వానికి అండగా నిలవాలి. సంక్షోభ సమయంలో అప్పు తప్పదు. అప్పు చేయడం తప్పు కాదు. కానీ అది దుర్వినియోగం చేయకూడదు. దారి మళ్లొద్దు. ఎవరికి ఆ డబ్బు ఇచ్చామన్నది ఆధార్‌ కార్డు వివరాలతో సహా ఉన్నాయి. అందుకే అక్కడ ఏ ఆరోపణలు, విమర్శలు లేవు. కేవలం అప్పు మీదే ఎక్కువ విమర్శలు చేస్తున్నారు’.

‘ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు లక్ష కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం. అవసరం ఉన్న ప్రతి చోటా, అర్హులకు అందాయి. దానిపై ఎక్కడా విమర్శలు, ఆరోపణలు లేవు. అందరి విమర్శలు కేవలం అప్పుల మీదే. కానీ అది అనివార్యమైంది. పరిస్థితి అలాంటిది’.


అవినీతి. దుర్వినియోగం లేదు:

‘ఏ రంగానికి ఎంత ఖర్చు చేయాలన్నది ప్రాధాన్యతలను బట్టి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇక్కడ ప్రతి పైసా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా ప్రజలకు చేరింది. ఎక్కడా అవినీతికి తావు లేదు. కానీ అనివార్య పరిస్థితుల వల్లనే అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. కాబట్టే ప్రజలను ప్రభుత్వం ఆదుకోగలిగింది. లేకపోతే మొత్తం వ్యవస్థ కుప్పకూలి పోయేది’.


ప్రతిదీ కేంద్రం దృష్టికి:

‘ప్రతి ఇష్యూను కేంద్రం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్లడం జరిగింది. డిఫరెంట్‌ టైమ్‌లో వారికి అన్నీ వివరించాం. గత ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేయడం వల్లనే రూ.17 వేల కోట్లకు సంబంధించిన పరిస్థితి. గత రెండేళ్లుగా ప్రైవేటు ఖర్చు తగ్గడంతో, ప్రభుత్వం అనివార్యంగా ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇంకా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు. నాడు–నేడు వంటి అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి’.


నాడు అప్పులే పెరిగాయి:

‘2014–19 మధ్య అప్పులు రూ.1.20 లక్షల కోట్ల నుంచి రూ.2.68 లక్షల కోట్లకు పెరిగాయి. కానీ అదే సమయంలో ప్రభుత్వ ఆస్తులు పెరగలేదు. అంటే ఆ అప్పులు ఉత్పాదక రంగంలో ఖర్చు చేయలేదు. ఏ రాష్ట్రంలో అయినా అప్పు చేయాల్సిన పరిస్థితి. అందుకే ఇక్కడ కూడా అలాగే అప్పు చేయాల్సి వచ్చింది’.


తనఖా మాత్రమే:

‘కేంద్రం ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంటే, తెలంగాణ ప్రభుత్వం భూముల అమ్మకం ద్వారా రూ.15 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ విషయాన్ని బడ్జెట్‌లో కూడా చూపారు. ఇప్పటికే వారు భూముల అమ్మకం ద్వారా దాదాపు రూ.3 వేల కోట్ల ఆదాయం పొందారు’.

అయితే భూములపై ప్రభుత్వానికి హక్కు ఉంటుందా అన్న ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ప్రభుత్వ భూములను తనఖా పెట్టడం కొత్త కాదని, గతంలో కూడా అలా చేశారని, ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే పని చేస్తోందని అన్నారు.

పరిమితికి లోబడే అన్నీ..:

‘ఇక్కడ అనవసరంగా అప్పులు చేయడం లేదు. అలాగే పరిస్థితి కూడా చేయి దాటి పోవడం లేదు. కానీ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ పరిమితులకు లోబడే అప్పులు చేస్తున్నాం. వాటిని పూర్తి ఉత్పాదకంగానే (మోస్ట్‌ కన్సర్వేటివ్‌ మోడ్‌) వినియోగిస్తున్నాం’.. అంటూ శ్రీ దువ్వూరి కృష్ణ ప్రెస్‌మీట్‌ ముగించారు.