ఆయన్ను నమ్ముకున్నోళ్లంతా జైలుకే: చంద్రబాబు

 *ఆయన్ను నమ్ముకున్నోళ్లంతా జైలుకే: చంద్రబాబు


*

తప్పులు చేస్తే మీ పరిస్థితీ అదే..

*అధికారులకు తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరిక*

మచిలీపట్నం (ప్రజా అమరావతి): కరోనా నియంత్రణలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని.. తెదేపా అధికారంలో ఉంటే కొవిడ్‌ను కట్టడి చేసేవాళ్లమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నో సంక్షోభాలు వచ్చినా వాటిని సవాలుగా తీసుకుని పనిచేశామని చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇటీవల మృతిచెందిన మాజీ మంత్రి నరసింహారావు (కొల్లు రవీంద్ర మామ) కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లి నరసింహారావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం తెదేపా శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.

పండించిన ధాన్యం కొని రైతులకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని చంద్రబాబు ఆరోపించారు. ఎవరైనా డబ్బు అడిగితే ఎమ్మెల్యేలు, మంత్రులు దౌర్జన్యం చేస్తున్నారని ఆక్షేపించారు. తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని కొంత వరకే పాలించగలరని.. రైతులు తిరగబడితే పారిపోతారని హెచ్చరించారు. కేసులకు తాము భయపడే పరిస్థితే లేదన్నారు. ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదని.. పోలీసులు కూడా హుందాగా ప్రవర్తిస్తూ పద్ధతి ప్రకారం పనిచేయాలన్నారు. ఆయన్ను నమ్ముకున్నోళ్లంతా జైలుకు పోయారని సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తప్పులు చేస్తే మీ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారవుతుందని అధికారులను హెచ్చరించారు. 

మాస్కు పెట్టుకోకుంటే ప్రభుత్వం రూ.100 జరిమానా విధిస్తోందని.. అలాంటప్పుడు మాస్కు పెట్టుకోని జగన్‌కు ఎంతమేర జరిమానా విధించాలని చంద్రబాబు ప్రశ్నించారు. ఆత్మలతో కాదు.. మనుషులతో మాట్లాడేవాళ్లు కావాలని వ్యాఖ్యానించారు. చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వమిదని మండిపడ్డారు. వైకాపా నేతలు దిల్లీ మెడలు వంచుతామని.. దిల్లీ మెడలు వంచుతున్నారన్నారు. పోలవరం ముంపు బాధితులకు పునరావాసం కల్పించకుండా గిరిజనులను గోదావరిలో ముంచుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వారికి న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు.