తిరుచానూరు ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన మహాయాగం_
_తిరుచానూరు (ప్రజా అమరావతి): కరోనా మహమ్మారితో ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ప్రార్థిస్తూ మహాలక్ష్మి అవతారమైన తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) నిర్వహించిన మహాయాగం శాస్త్రోక్తంగా ముగిసింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన జరిపారు. నిత్య హవనం, మహా ప్రాయశ్చిత హోమం, మహా పూర్ణాహూతి, కుంభ ప్రోక్షణ నిర్వహించి ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అమ్మవారిని వేంచేపు చేశారు. అనంతరం ఆలయంలోని ఆశీర్వచన మండపంలో శ్రీపద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు, శ్రీచక్రతాళ్వార్‌కు స్నపన తిరుమంజనం చేశారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. తరువాత గంగాళంలో శ్రీచక్రతాళ్వార్‌కు వేద మంత్రోచ్ఛారణల నడుమ చక్రస్నానం నిర్వహించారు. తితిదే ఈఓ జవహర్ రెడ్డి మహాయాగం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. తొమ్మిది రోజుల పాటు ఉదయం, సాయంత్రం రుత్వికులు యాగం నిర్వహించారని.. కరోనాతో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు యాగ నిర్వహణతో తొలగిపోవాలని ఈవో కాంక్షించారు._
addComments
Post a Comment