జిల్లాలో 2.26 లక్షల మంది విద్యార్ధులకు విద్యాకానుక
రూ.34.94 కోట్ల విలువైన జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ నేడు ప్రారంభం
2817 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని విద్యార్ధులకు ప్రయోజనం
ఒక్కో విద్యార్ధికి రూ.1545 విలువ చేసే కిట్
డెంకాడ మండలం రఘుమండలో ప్రారంభించనున్న మంత్రులు
తొలి విడత నాడు - నేడు పనులు చేపట్టిన స్కూళ్ల ప్రారంభం నేడే
రూ.278 కోట్లతో జిల్లాలో తొలివిడత పాఠశాలల్లో నాడు - నేడు పనులు
1060 ప్రభుత్వ పాఠశాలల్లో సమకూరిన అదనపు వసతులు
విజయనగరం, ఆగష్టు 16 (ప్రజా అమరావతి); దేశ ప్రజలంతా ఆగష్టు 15న స్వాతంత్య్ర వేడుకల రూపంంలో జాతీయ పండుగ జరుపుకుంటే, మన రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు మాత్రం ఆగష్టు 16న కూడా పండుగరోజుగా చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మనబడి నాడు - నేడు కింద తొలివిడతగా ఆధునీకరణ పనులు చేపట్టి, అదనపు వసతులు సమకూర్చిన ఆయా పాఠశాలల్ని ఆగష్టు 16 నుంచి విద్యార్ధులకు అందుబాటులోకి తెస్తున్నారు. దీనితోపాటు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకోసం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని కూడా ఆగష్టు 16న సోమవారం నాడే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు. కరోనా కారణంగా కొన్ని నెలలపాటు విద్యకు దూరమైన పిల్లలందరి భవిష్యత్తును దృష్టిలో వుంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలన్నింటినీ మళ్లీ ఆరోజునే తెరుస్తున్నారు. అందుకే రాష్ట్రంలో పాఠశాల విద్య చదువుతున్న విద్యార్ధులకు ఆగష్టు 16ను ప్రత్యకమైనదిగా చెప్పుకోవచ్చు.
సకల వసతులతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా కొత్తరూపు దాల్చిన ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఆరోజు నిజమైన పండుగరోజుగానే భావించాలి. జిల్లాలో మనబడి నాడు - నేడు కింద 1060 పాఠశాలల్ని తొలివిడతలో ఆధునికీకరించి, అదనపు వసతులు కల్పించేందుకు రూ.278.05 కోట్లతో ఏడాది క్రితం ఆరు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో 7,889 పనులు చేపట్టారు. పాఠశాలలకు నిరంతర నీటిసరఫరాతో కూడిన టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్ల ఏర్పాటు, తాగునీటి సరఫరా, విద్యార్ధులకు బోధనా సిబ్బందికి అవసరమైన ఫర్నిచర్ సమకూర్చడం, పాఠశాల గోడలకు అందంగా పెయింటింగ్ చేయడం, పాఠశాల భవనాలకు ఏవైనా మరమ్మత్తులు చేయాల్సి వుంటే వాటిని చేపట్టడం, గ్రీన్ చాక్ బోర్డులు ఏర్పాటు, పట్టణాల్లో పాఠశాలలకు కాంపౌండ్‌వాల్స్ నిర్మాణం, ఇంగ్లీష్ ల్యాబ్‌ల ఏర్పాటు, నబార్డు నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణం వంటి పది రకాల పనులు నాడు - నేడు కింద చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఈ పనులను పూర్తిచేసి ఆగష్టు 16న ప్రారంభించేందుకు విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సమగ్రశిక్ష, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థ, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్, పురపాలక, పట్టణాభివృద్ది శాఖల ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. ఆయా పాఠశాలల్లో చేపట్టిన వసతులన్నీ పాఠశాలలు తెరిచే నాటికి అందుబాటులోకి రావడంతో ఆయా పాఠశాలల విద్యార్ధులకు విద్యాభ్యాసం ఇక మరింత సౌకర్యవంతంగా రూపొందుతుంది.
రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులందరికీ కార్పొరేట్ విద్యార్ధులతో సమానంగా సదుపాయాలు కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి విద్యార్ధులందరికీ ప్రతి ఏటా జగనన్న విద్యాకానుక పేరుతో విద్యా కిట్‌లను అందజేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫాంలు, ఒక జత షూస్, రెండు జతల సాక్సులు, బెల్టు, నోటుబుక్స్, టెక్ట్స్ బుక్స్, డిక్షనరీ తదితర వస్తువులన్నీ కలసి రూ.1545 విలువ చేసే ఒక కిట్‌ను ప్రతి విద్యార్ధికీ అందజేస్తున్నారు. ఈ విద్యాకానుక కిట్‌లను జిల్లాలో 2,817 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న 2,26,157 మంది విద్యార్ధులకు రూ.34.94 కోట్లతో అందించే కార్యక్రమాన్ని స్కూళ్లు తెరిచే రోజైన ఆగష్టు 16నే అందజేస్తున్నారు.
ఇక కరోనాతో ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేక పాఠశాలలకు దూరమైన లక్షలాది విద్యార్ధులు స్వేచ్ఛా విహంగాల్లా సోమవారం నుంచి మళ్లీ పాఠశాలల్లోకి అడుగుపెట్టనున్నారు. కరోనా కారణంగా పాఠశాలలు మూసివేయడంతో అందుబాటులో వున్న ఆన్ లైన్ విద్యతో సరిపెట్టుకొంటూ వస్తున్న ఎందరో విద్యార్ధులకు పాఠశాలలు తెరవడం వల్ల మళ్లీ విద్యావకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఇన్ని కారణాలు వున్నందునే రాష్ట్రంలోని విద్యార్ధులకు ఆగష్టు 16 పండుగరోజు అనడం సబబుగానే వుంటుంది.
డెంకాడ మండలం రఘుమండలో సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ, నాడు - నేడు తొలివిడతగా పూర్తిచేసిన పాఠశాలల్ని ప్రారంభిస్తారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి, ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, శాసనసభ్యులు బడుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు తదితరులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
addComments
Post a Comment