నెల్లూరు, నవంబర్ 13 (ప్రజా అమరావతి): గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, యువకులు స్వయంశక్తితో సాధికారత
సాధించాలనే సేవా భావంతో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించినట్లు భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ లో గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రం నూతన భవనం “కౌసల్య సదనం” ను శనివారం ఉదయం భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి శ్రీమతి ఉషమ్మ, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ తన అత్తగారు శ్రీమతి కౌసల్యమ్మ జ్ఞాపకార్ధంగా ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వాలు అందించే ఉచిత పథకాల కోసం ఎదురు చూడకుండా స్వయంశక్తితో వివిధ వృత్తుల పట్ల నైపుణ్యాభివృద్ధి సాధించి సమాజంలో ఆర్థిక అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో వివిధ కారణాలతో చదువును మధ్యలోనే మానేసిన యువతను గుర్తించి వారికి ఈ శిక్షణ కేంద్రంలో నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ, వ్యవసాయ రంగానికి సంబంధించి నూతన పద్ధతులు, శాస్త్ర సాంకేతిక విధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ శిక్షణ కేంద్రంలో శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేయడం, వారికి అవసరమైన నైపుణ్యం పట్ల శిక్షణ ఇచ్చే అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. మహిళల సాధికారత లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా GMR వరలక్ష్మి ఫౌండేషన్, యూనియన్ బ్యాంక్ సోషల్ ఫౌండేషన్ ట్రస్ట్‌తో కలిసి 2003లో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (RSETI)ను స్వర్ణ భారతి ట్రస్ట్ లో స్థాపించగా ఈ సంస్థ కోసం ప్రత్యేకంగా కౌసల్య సదనం పేరిట అన్ని సౌకర్యాలతో నూతన భవనాన్ని ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ముప్పవరపు ఫౌండేషన్ సహకారం అందించినట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ కేంద్రంలో యువతీ యువకులకు వేరువేరుగా బోధన తరగతులు, వసతి సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఈ కేంద్రం ద్వారా వివిధ పూర్తి కోర్సుల్లో నైపుణ్య అభివృద్ధి సాధించి సమాజంలో తమకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆకాంక్షించారు.
ముందుగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తన అత్తగారు శ్రీమతి అల్లూరు కౌసల్యమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తదుపరి కౌసల్య సదన్ లోని గదులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, స్వర్ణ భారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి దీపా వెంకట్, మాజీ మంత్రి శ్రీ కామినేని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్, ట్రైనీ కలెక్టర్ శ్రీ ఫర్హాన్ అహ్మద్ ఖాన్, లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ మేనేజర్ శ్రీ రాం ప్రసాద్ రెడ్డి, నాబార్డు డిడిఎం శ్రీ రవి సింగ్, ఆర్డివోలు చైత్ర వర్షిని, శీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment