విశాఖలో మరో ఎంఎస్ఎంఈ పార్కు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 


*విశాఖలో మరో ఎంఎస్ఎంఈ పార్కు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


*


*భూమి వరల్డ్ సంస్థ ప్రతిపాదనపై చర్చించిన పరిశ్రమల శాఖ మంత్రి*


అమరావతి, నవంబర్, 08 (ప్రజా అమరావతి);  విశాఖలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పార్కు అభివృద్ధికి ముందుకొచ్చిన భూమి వరల్డ్ గ్రూప్ ప్రతిపాదనపై ఏపీఐఐసీ ఎండి సుబ్రహ్మణ్యం జవ్వాది సహా ఉన్నతాధికారులతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చర్చించారు. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తో భూమి వరల్డ్ గ్రూప్ సమావేశమైంది. భాగస్వామ్య విధానంలో పార్కును అభివృద్ధి చేయనున్నట్లు ప్రతిపాదనలకు ప్రభుత్వ పరంగా తోడ్పాటును స్థానం అందిస్తామని మంత్రి మేకపాటి వెల్లడించారు.  100 ఎకరాల్లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం ద్వారా 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వానికి అందించిన ప్రతిపాద నల్లో భూమి వరల్డ్ గ్రూప్ పేర్కొంది. అయితే ఈ ప్రతిపాదనను ఒకసారి పరిశీలించి మరోసారి  నివేదిక అందించాలని పరిశ్రమల శాఖ మంత్రి ఏపీఐఐసీ ఎండి సుబ్రహ్మణ్యం జవ్వాదిని ఆదేశించారు. ప్రతిపాదనను కార్యరూపం దాల్చే విధంగా పలు సూచనలతో మంత్రి మేకపాటి గడువు నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది పాల్గొన్నారు.


--------


*పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటిని మరోమారు కలిసిన ఇండో జపాన్ ప్రతినిధులు*


పెట్టుబడులు, ఐ.టీ పార్కులు,సెజ్ లు, టెక్నాలజీ,  నైపుణ్య శిక్షణపై మంత్రితో ప్రధానంగా చర్చ


అమరావతి, నవంబర్,08 (ప్రజా అమరావతి); పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో  ఇండో జపాన్ ప్రతినిధులు మరోసారి సమావేశమయ్యారు. సోమవారం సాయంత్రం మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో మంత్రి మేకపాటిని కలిశారు.   పెట్టుబడులు, ఐ.టీ పార్కులు,సెజ్ లు, టెక్నాలజీ,  నైపుణ్యాభివృద్ధి, శిక్షణ తదితర అంశాలపై సంబంధిత శాఖల కార్యదర్శుల సమక్షంలో  మంత్రి మేకపాటి ప్రధానంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం అవడానికి కొన్ని సూచనలు చేస్తూ మంత్రి మేకపాటి వారికి గడువు నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో  ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ కొండూరు అజయ్ , ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు.

------------