పెన్నా నది పొర్లు కట్టల పటిష్ట నిర్మాణానికి రూ. 100 కోట్లు,

 

నెల్లూరు, డిసెంబర్ 3 (ప్రజా అమరావతి): పెన్నా నది పొర్లు కట్టల పటిష్ట నిర్మాణానికి రూ. 100 కోట్లు, సోమశిల


జలాశయం ఆఫ్రాన్ మరమ్మతు పనులకు  120 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన నెల్లూరు శివారు సమీపంలోని ముంపునకు గురైన భగత్ సింగ్ కాలనీని సందర్శించారు. పెన్నా నది ని పరిశీలించిన అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వరద సమయంలో అధికారులు చేపట్టిన చర్యలపై ఆరా తీశామని, భగత్ సింగ్ కాలనీ లో 99 శాతం వరద బాధితులకు 2000 రూపాయల ప్రభుత్వ సాయం, 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను జిల్లా యంత్రాంగం సజావుగా అందజేసిందని పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా సాయం అందని వారు ఉంటే సమీపంలోని సచివాలయంలో ఈనెల 5లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్ వరద సమయంలో చురుగ్గా పని చేశారని వారిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. సంక్రాంతి పండుగ తర్వాత తానే స్వయంగా సంగం బ్యారేజీ, పెన్నా బ్యారేజి నిర్మాణాలను ప్రారంభిస్తానని, ఆ సమయంలోనే పెన్నా పొర్లుకట్టల నిర్మాణానికి, సోమశిల ఆఫ్రాన్ మరమ్మతు పనులకు శంకుస్థాపన చేస్తానని సీఎం వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికైనా అందకుంటే డిసెంబర్, జూన్ నెలల్లో దరఖాస్తు చేసుకుంటే అన్ని విధాలా విచారించి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇంత బాధలో కూడా తనపై ఆత్మీయత, అభిమానం చూపుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ముఖ్యమంత్రి అన్నారు. అంతకుముందు సీఎం స్థానిక ప్రజలతో స్వయంగా మాట్లాడి వరద సమయంలో వారి కష్ట సుఖాలను ఓపిగ్గా విన్నారు. శివయ్య అనే వ్యక్తి మాట్లాడుతూ తన కుమార్తెను డాన్స్ మాస్టర్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని, తనకు ఇంత వరకు న్యాయం చేయలేదని సీఎం ఎదుట వాపోయాడు. స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. అలాగే ఎస్ కె నువుల్లా అనే అంధుడు మాట్లాడుతూ బ్యాక్లాగ్ పోస్టుల్లో మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, పురుషులకు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భగత్ సింగ్ కాలనీ లో అంగన్వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు ముఖ్యమంత్రిని కోరారు. 

  ముందుగా ముఖ్యమంత్రి బుచ్చిరెడ్డిపాలెం మండల పరిధిలోని పెనుబల్లి సమీపంలో కోతకు గురైన పంచాయితీ రహదారిని సీఎం పరిశీలించారు. అనంతరం పెనుబల్లి- బుచ్చిరెడ్డిపాలెం మార్గంలో కోతకు గురైన ఆర్ అండ్ బి రహదారిని ముఖ్యమంత్రి పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా వాకాటి లక్ష్మి మాట్లాడుతూ వరద సమయంలో అధికారులు తమను ఎంతగానో ఆదుకున్నారన్నారు. ఇంత త్వరగా తమకు ఆర్థిక సహాయం అందజేస్తారని ఊహించలేదని అన్నారు. జీవితాంతం మాకు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆమె అన్నారు. అలాగే రైతులు రఘురామయ్య, విజయ్ కుమార్ మాట్లాడుతూ పొలాల్లో ఇసుకమేట వేసిందని, కనీసం పదివేల రూపాయలు సాయం అందించాలని, చేపల చెరువులు ధ్వంసం అయ్యాయని తమను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి దారిపొడవునా వేచి ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ వారిని పరామర్శించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. 

 ఈ  పర్యటనలో రాష్ట్ర మంత్రులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్, శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, ఎస్పి శ్రీ విజయ రావు, జాయింట్ కలెక్టర్లు శ్రీ హరేంధిరప్రసాద్, విదేహ్ ఖరే, గణేష్ కుమార్, నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ శ్రీమతి వెంకటరత్నం, ఎమ్మెల్సీ శ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేయర్ శ్రీమతి స్రవంతి, నుడా చైర్మన్ శ్రీ ముక్కాల ద్వారకానాథ్, డిప్యూటీ మేయర్ లు శ్రీ రూప్ కుమార్ యాదవ్, ఖలీల్ అహ్మద్, వ్యవసాయ శాఖ జెడి శ్రీమతి ఆనంద్ కుమారి, మత్స్యశాఖ జె.డి నాగేశ్వరరావు, ఇరిగేషన్ ఎస్ఇ శ్రీ కృష్ణ మోహన్, పంచాయతీ రాజ్ ఎస్ఇ శ్రీ సుబ్రహ్మణ్యం, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ శ్రీ రమేష్ కుమార్, జడ్పీ సీఈవో శ్రీ శ్రీనివాస రావు ఆర్డివోలు హుస్సేన్ సాహెబ్, శ్రీ శీనా నాయక్, బుచ్చిరెడ్డిపాలెం కమిషనర్ శ్రీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 


ఘనంగా వీడ్కోలు

...................... 

జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకరోజు పర్యటనను ముగించుకున్న ముఖ్యమంత్రికి శుక్రవారం సాయంత్రం నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు ఘనంగా వీడ్కోలు పలికారు. సాయంత్రం 5.02 నిమిషాలకు ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో మంత్రులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్, శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు, ఎస్పి శ్రీ విజయ రావు, ఎమ్మెల్సీలు శ్రీ వాకాటి నారాయణరెడ్డి, శ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి, సులూరుపేట ఎమ్మెల్యే శ్రీ కిలివేటి సంజీవయ్య, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి పొణకా దేవసేనమ్మ, కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్లు శ్రీ హరేంధిరప్రసాద్, విదేహ్ ఖరే, గణేష్ కుమార్, నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ శ్రీమతి వెంకటరత్నం, ఇరిగేషన్ ఎస్ఇ శ్రీ కృష్ణ మోహన్ తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. 


Comments