నేడే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం
- పేదల ఆస్తికి భరోసా
- ప్రభుత్వం నుంచి రుణాలు పొంది నిర్మించిన ఇళ్ల పై పూర్తి హక్కులు
- రూ. 10 కే రిజిస్ట్రేషన్
...................................................
పేదలకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం నేడు (21.12.2021) ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి సోమవారం ఉదయం నెల్లూరు శ్రీ వేంకటేశ్వర కస్తూర్భా కళాక్షేత్రంలో జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు చకచక ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేయనుండగా జిల్లా స్థాయిలో నెల్లూరు కస్తూర్భా కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు ఎప్పటికప్పుడు జిల్లాలోని సచివాలయాలను తనిఖీ చేసి ఈ పథకంపై ప్రత్యేకంగా అవగాహన కల్పించడంతో లబ్ధిదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జిల్లాలో ఈ పథకంపై లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు సంయుక్త కలెక్టర్లతో పాటు జిల్లా అధికారులు ముమ్మరంగా పర్యటించారు. జిల్లాలోని గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది, సచివాలయంలోని వాలంటీర్లు, డిజిటల్ అసిస్టెంట్లు ఎప్పటికప్పుడు ఈ పథకం ప్రయోజనాలను లబ్ధిదారులకు వివరిస్తూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా కృషి చేశారు. నెల్లూరు శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాశాల మంగళవారం నిర్వహించనున్న కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి, జలవనరుల శాఖ మంత్రి శ్రీ అనిల్ కుమార్ యాదవ్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి, శాసన మండలి, శాసనసభ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులు హాజరుకానున్నారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఉద్దేశం
................................................
గృహ నిర్మాణ సంస్థ ద్వారా 1983 నుంచి 2011 వరకు రుణాలు పొంది ఇల్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంతో భారీ ఊరట కల్పించింది. రుణాలు తిరిగి చెల్లించని వారందరూ ప్రభుత్వం నిర్ణయించిన నామమాత్రపు రుసుమును చెల్లిస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఆ ఇళ్లపై పూర్తి హక్కులను ప్రభుత్వం కల్పించనుంది. అలాగే 70,089 మంది లబ్ధిదారులు ఎటువంటి రుణం పొందకుండా ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకుని ఉన్నారు. వీరు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వేల రూపాయల్లో ఖర్చవుతుంది. వీరికి కూడా కేవలం పది రూపాయలకే రిజిస్ట్రేషన్ చేసి పూర్తి హక్కులు కల్పిస్తూ పత్రాలు అందజేస్తారు.
జిల్లాలో లబ్ధిదారుల వివరాలు
.........................................
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించి జిల్లాలో 3.39 లక్షల మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. వీరిలో ప్రభుత్వం నుంచి రుణాలు పొందిన వారు 2,68,965 కాగా, రుణం పొందకుండా ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న వారు 70,089 మంది ఉన్నారు. ఇప్పటివరకు 1,46,546 మందికి అధికారుల నుంచి వివిధ దశల్లో అనుమతి లభించగా ఈనెల 20వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు 56,866 మంది లబ్ధిదారులు సుమారు రూ. 18.06 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరందరికీ నేటి నుంచి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించి పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేసేందుకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
చెల్లించాల్సిన రుసుము వివరాలు
..................... ...... ........
ఈ ఇళ్లకు సంబంధించి రుణ గ్రహీతలు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రూ. 10 వేలు, మున్సిపాలిటీలో రూ. 15 వేలు, కార్పొరేషన్ల పరిధిలో రూ. 20 వేలు చెల్లిస్తే ప్రభుత్వం స్థలాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ ధ్రువ పత్రం జారీ చేస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కన్నా వాస్తవ లబ్ధిదారులు గృహ నిర్మాణ సంస్థకు బకాయి ఉన్న రుణం తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. వాస్తవ లబ్ధిదారుడు నుంచి ఇల్లు కొనుగోలు చేసిన వారు, వారి వారసులు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 20 వేలు, మున్సిపాలిటీల్లో రూ 30 వేలు, కార్పొరేషన్ పరిధిలో రూ. 40 వేలు చెల్లిస్తే పూర్తి హక్కులు దక్కుతాయి.
తొలిసారిగా సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు
.............. .......... ..............
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి అర్హులైన లబ్ధిదారులకు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఇంటిని అమ్మేవారి స్థానంలో తాసిల్దార్, కొనే వారి స్థానంలో లబ్ధిదారు ఉంటారు. తొలిసారిగా సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో పంచాయితీ కార్యదర్శి, వార్డ్ ఎమినిటీస్ సెక్రెటరీలకే రిజిస్ట్రార్ హోదా కల్పించి వారికి అవసరమైన శిక్షణ కూడా ఇచ్చారు. జిల్లాకు అవసరమైన డాక్యుమెంట్లను అమరావతి నుంచి పంపించారు.
రిజిస్ట్రేషన్లకు అవసరమైన పత్రాలు
...........................
రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వెళ్లే లబ్ధిదారుడు తన వెంట ఆధార్ కార్డు, ఆదాయపన్ను పత్రం, మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, గుర్తింపు కార్డులతో పాటుగా ఒకరిని సాక్షిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.
addComments
Post a Comment