- రాష్ట్రంలో అత్యత పారదర్శకంగా ఇసుక ఆపరేషన్స్
- వినియోగదారులకు అందుబాటు ధరకే ఇసుక విక్రయాలు
- జేపీ పవర్ వెంటర్స్ మాత్రమే ఇసుక ఆపరేషన్స్ నిర్వహిస్తోంది
- సబ్ లీజులు ఇచ్చారనే కథనాలు అవాస్తవం
- నిబంధనలకు అనుగుణంగానే సబ్ కాంట్రాక్ట్ ద్వారా పనులు
- ఇసి అనుమతుల మేరకే నిర్ధిష్ట రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు
- ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు అంటూ చేసిన ఆరోపణలు అసత్యం
- బాట చార్జీలను వసూలు చేస్తే వినియోగదారులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి
- ఇసుక ఆపరేషన్స్‌పై సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు
- ఆన్‌లైన్ బుకింగ్‌పై జేపీ సంస్థ ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నాం
- ఇసుక విక్రయాల కోసం జేపీ సంస్థ 26 బ్యాంక్ ఖాతాలను అందుబాటులో ఉంచింది
- వినియోగదారులు సదరు ఖాతాలకు సొమ్ము జమ చేసి ఇసుక పొందవచ్చు
- జేపీ సంస్థ యుపిఐ పేమెంట్స్‌ను కూడా స్వీకరిస్తోంది
- రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా అందుబాటులోకి తెచ్చాం
- ప్రస్తుతం 100 రీచ్‌లు పనిచేస్తున్నాయి,
- త్వరలోనే 150 రీచ్‌లు వినియోగంలోకి వస్తాయి.
- ఇసుక ధరలపై ప్రతివారం పత్రికల ద్వారా ప్రకటనలు ఇస్తున్నాం
: గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్వివేది, డిఎంజి శ్రీ విజి వెంకటరెడ్డి
విజయవాడ (ప్రజా అమరావతి):
రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ అత్యంత పారదర్శకతతో నిర్వహిస్తున్నామని గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్వివేది, గనులశాఖ సంచాలకులు (డిఎంజి) శ్రీ విజి వెంకటరెడ్డి తెలిపారు. వినియోగదారులకు అందుబాటు ధరలో ఇసుకను విక్రయించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, దాని ప్రకారమే ఇసుక విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడలోని ఎపిఎండిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అవగాహన లేకుండా మీడియాలో ఇసుక ఆపరేషన్స్‌పై కథనాలను ప్రచురిస్తున్నారని అన్నారు.
గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ....
ఇసుక ఆపరేషన్స్‌ను చాలా పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కేంద్రప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్‌టిసి ద్వారా టెండర్ల ప్రక్రియను నిర్వహించింది. ఎంఎస్‌టిసి నిర్వహించిన టెండర్లలో జేపీ పవర్ వెంచర్స్ సంస్థను ఇసుక ఆపరేషన్స్‌ను ఎంపకి చేయడం జరిగింది. సదరు సంస్థతో అగ్రిమెంట్ చేసుకుని ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు ఇసుక విక్రయాలు జరుపుతున్నాం. రెండేళ్ళ కాలపరిమితికి ఇసుక ఆపరేషన్స్ కాంట్రాక్ట్‌ను జేపీ సంస్థకు ఇవ్వడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఎపిఎండిసి గనులను నిర్వహిస్తోంది. అక్కడ ఆపరేషన్స్ కోసం సబ్ కాంట్రాక్ట్‌లకు కొన్ని పనులు అప్పగించాం. అలాగే ఇసుక టెండర్ల నిబంధనల్లో కూడా లీజు అనుమతులు పొందిన సంస్థ సబ్ కాంట్రాక్ట్ కింద కొన్ని పనులు ఇతరులకు ఇవ్వవచ్చు. అయితే మొత్తం ఇసుక ఆపరేషన్స్‌కు జేపీ సంస్థ మాత్రమే బాధ్యత వహిస్తుంది. ఎక్కడైనా నిబంధనలకు విరుద్దంగా జరిగితే దానికి జేపీ సంస్థ పైనే చర్యలు తీసుకుంటాం. మొత్తం రాష్ట్రంలోని అన్ని రీచ్‌లను జేపీ సంస్థ ఇసుక ఆపరేషన్స్ నిర్వహిస్తున్నందున వారు సబ్ కాంట్రాక్ట్ కింద ఇతరుల సేవలను తీసుకోవచ్చు. ఇందులో ఎటువంటి నిబంధనల ఉల్లంఘన లేదు. కొత్తగా ఏర్పాటైన సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్దమంటూ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఇసుకను తీసుకువచ్చే బాటకు కొందరు స్థానికులు డబ్బు వసూలు చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో దానిపై ఎవరైనా సరే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇటువంటివి అటు జేపీ సంస్థ దృష్టికి వచ్చినా, లేదా మా దృష్టికి వచ్చినా సరే పోలీసులకు ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరతాం. వినియోగదారులకు సరైన రేటుకు, నిర్థిష్టమైన నాణ్యతతో కూడిన ఇసుక అందుతుందా లేదా అనేదానిపైనే మేం దృష్టి సారిస్తున్నాం.
జేపీ సంస్థ ఇప్పటి వరకు ఆఫ్‌లైన్ బుకింగ్‌లు చేస్తోంది, దానిని ఆన్‌లైన్ ద్వారా కూడా చేయాలని సదరు సంస్థకు సూచించాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ చేయాలనే దానిపై సదరు సంస్థ రూపొందించిన ఫోన్ యాప్ ను కూడా పరిశీలిస్తున్నాం. గతంలో ఆన్‌లైన్ విధానంలోని లోపాల వల్ల వినియోగదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. అటువంటి పరిస్థితి మరోసారి తలెత్తకుండా సాఫ్ట్ వేర్ ఉండేలా చూస్తాం. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుని, అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. గతంలో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు చేయడం వల్ల నాణ్యత లేదనే ఫిర్యాదులు చాలా వచ్చాయి. వాటికి అనుమతులు రద్దు చేశాం. ప్రస్తుతం వందకు పైగా ఇసుక రీచ్‌లు నడుస్తున్నాయి, గత కొన్ని రోజుల పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరదల వల్ల కొన్ని రీచ్‌లు ప్రారంభించడానికి కొంత జాప్యం జరిగింది. త్వరలోనే దాదాపు 150 రీచ్‌లు ప్రారంభమవుతాయి. ఎక్కడా ఇసుక విక్రయాలకు దీనివల్ల విఘాతం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.
గనుల శాఖ సంచాలకులు (డిఎంజి) శ్రీ విజి వెంకటరెడ్డి మాట్లాడుతూ...
ఇసుక విక్రయాలపై అవగాహన లేకుండా ఒక మీడియా అవాస్తవాలను ప్రచురించింది. గతంలో ఉచిత ఇసుక పాలసీ అమలులో ఉన్న సమయంలో వినియోగదారులకు ఉచితంగా ఇసుక లభించలేదు. ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలివెళ్ళింది. దీనిని నియంత్రించడానికే ఈ ప్రభుత్వం సుస్థిర ఇసుక విధానంను తీసుకువచ్చింది. ఎపిఎండిసి ద్వారా ఇసుక ఆపరేషన్స్ చేశాం. కొత్త ఇసుక విధానం లోని లోటుపాట్లను పరిష్కరించేందుకు మెరుగైన ఇసుక విధానం కోసం సీఎం శ్రీ వైయస్ జగన్ గారు మంత్రుల కమిటీని వేసి ఇసుక విధానంలో కొన్ని మార్పులు తీసుకువచ్చారు. కేంద్రప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టిసి ద్వారా అత్యంత పారదర్శకంగా టెండర్లు నిర్వహించాం. దానిలో జేపీ సంస్థ ఎంపికైంది. జేపీ సంస్థ ఎక్కడా సబ్ లీజులు ఇవ్వలేదు, నిబంధనల ప్రకారమే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. దానినే జేపీ సంస్థ అనుసరిస్తోంది. కొత్తగా పుట్టిన సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు, ఇది నిబంధనలకు విరుద్దం అంటూ ఒక మీడియాలో వచ్చిన కథనంలో వాస్తవం లేదు. జేపీ సంస్థ నగదుతో పాటు యుపిఐ, బ్యాంకు ఖాతాల ద్వారా కూడా సొమ్ము జమ చేసిన వినియోగదారులకు ఇసుకను విక్రయిస్తోంది. అందుకోసం 26 బ్యాంకు ఖాతాలను జేపీ సంస్థ ఆపరేట్ చేస్తోంది. సదరు బ్యాంకు ఖాతాల్లో వినియోగదారులు ఇసుకకు సంబంధించిన సొమ్మును డిపాజిట్ చేసి ఇసుకను తీసుకోవచ్చు. బాట చార్జీల పేరుతో స్థానిక నేతలు డబ్బు వసూలు చేస్తున్నారంటున్న ఆరోపణలు కూడా ఎక్కడా జరుగుతుందో స్పష్టంగా చెప్పకుండా కథనాలు రాస్తున్నారు. దానిపై పోలీసులు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతివారం నియోజకవర్గాల వారీగా ఇసుక రేట్లపై ప్రకటనలు జారీ చేస్తున్నాం. ప్రజలకు అంతకంటే ఎక్కువ రేటును ఎవరైనా డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇసుక వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణం స్టాక్ పాయింట్‌లలో సిద్దంగా ఉంది.
ప్రతి రీచ్‌లోనూ మైనింగ్ ప్లాన్ ను తయారు చేస్తాం. దానికి పర్యావరణ అనుమతులు తీసుకుంటాం. దానికి అనుగుణంగానే సరిహద్దులు గుర్తించి జీయో కోఆర్డినేట్స్ ప్రకారం లీజుదారులకు మైనింగ్ ప్రాంతాన్ని అప్పగిస్తాం. ఈ ప్రాంతం మినహా మరెక్కడైనా ఇసుక ఆపరేషన్స్ చేస్తే చర్యలు తీసుకుంటాం. ఏడాదికి రెండు కోట్ల టన్నుల వరకు ఇసుకను తవ్వాలని జేపీ సంస్థకు నిర్ధేశించాం. ప్రతినెలా ఏ మేరకు ఇసుక తవ్వకాలు, రవాణా, అమ్మకాలు జరుగుతున్నాయో వివరాలను తీసుకుంటున్నాం. దీనిని గనులశాఖ ఎడి, డిడి స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం జేపీ సంస్థ మ్యానువల్‌గానే బిల్లులు ఇస్తోంది. ఆన్‌లైన్ కావాలని వినియోగదారులు కొందరు కోరుతున్నారు. దీనిని కూడా పరిశీలిస్తున్నాం. మీడియాలో కూడా అధికారుల నుంచి నిర్ధిష్టమైన అంశాలపై వివరణ కోరకుండానే కథనాలను ప్రచురించడం తగదు.
అంతిమంగా వినియోగదారులకు ప్రభుత్వం నిర్ధేశించిన రేటుకే ఇసుక అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
addComments
Post a Comment