యుద్ధ ప్రాతిపదికన ఘాట్ రోడ్డు మరమ్మతులు

 యుద్ధ ప్రాతిపదికన ఘాట్ రోడ్డు మరమ్మతులు


– నేటి సాయంత్రానికి ఢిల్లీ
ఐఐటి నిపుణుల రాక

– డౌన్ ఘాట్ రోడ్ ద్వారా రాకపోకలు

ధ్వంసమైన ఘాట్ రోడ్డుప్రాంతాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుమల 1 డిసెంబరు (ప్రజా అమరావతి):  తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే అప్ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి ఘాట్ రోడ్డు భారీగా ధ్వంసమైందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
బుధవారం తెల్లవారుజామున 5 – 40 గంటల సమయంలో భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడి రక్షణ గోడలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈ ప్రాంతాలను పరిశీలించారు. నాలుగు చోట్ల భారీ ప్రమాదం జరిగిందని, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దయవల్ల ఎవరూ గాయపడలేదని అధికారులు వివరించారు. అనంతరం చైర్మన్ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇటీవల కురిసిన వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్ల లో కొండ చరియలు విరిగిపడుతున్నాయని తెలిపారు. ఉదయం 5 – 45 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు తిరుమలకు వెళుతుండగా భారీ శబ్దం, పొగ రావడంతో డ్రైవర్ బస్సు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చైర్మన్ చెప్పారు. అప్ ఘాట్ రోడ్డులో మరో ఐదారు చోట్ల కొండ చరియలు విరిగిపడే ప్రమాదం గుర్తించామన్నారు. వీలైనంత త్వరలో రోడ్డు మరమ్మతులు చేసి, గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని చైర్మన్ చెప్పారు. ఢిల్లీ ఐ ఐ టి నుంచి నిపుణుల బృందం బుధవారం సాయంత్రానికి తిరుపతి కి చేరుకుంటుందన్నారు. టీటీడీ ఇంజినీరింగ్, విజిలెన్స్ అధికారులతో కలిసి వారు ఘాట్ రోడ్ల పరిశీలన చేస్తారన్నారు. కొండ చరియలు విరిగిపడకుండా ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలనే విషయం పై వారు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రెండు, మూడు రోజుల్లో నివేదిక సమర్పిస్తారని ఆయన వివరించారు. ఆ తరువాత భవిష్యత్ లో కూడా ఇలాంటి సంఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తి అయ్యే వరకు డౌన్ ఘాట్ రోడ్డులోనే వాహనాల రాకపోకలు అనుమతిస్తామని అన్నారు.

ఆన్లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకుని వాహనాల ద్వారా తిరుమలకు వచ్చే భక్తులు భారీ వర్షాల దృష్యా తమ ప్రయాణం వాయిదా వేసుకుంటే ఆరు నెలల్లోగా దర్శనం తేదీ మార్పు చేసుకునే అవకాశం ఉందని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. నడకదారిలో తిరుమలకు వెళ్ళే భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు.

జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి,చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు,
ఎస్ఈ శ్రీ జగదీశ్వరరెడ్డి, ఈఈ శ్రీ జగన్మోహన్ రెడ్డి,ఈ ఈ శ్రీ సురేంద్ర రెడ్డి, డి ఎఫ్ ఓ శ్రీ శ్రీనివాసులు రెడ్డి ఇతర అధికారులు ఛైర్మన్ వెంట ఉన్నారు.