డిసెంబర్ 24, హైదరాబాద్ (ప్రజా అమరావతి):
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవన సాఫల్య పురస్కారం జర్నలిజం రంగంలో సీనియర్ పాత్రికేయులు శ్రీ ఎబికె ప్రసాద్ కు నేడు అందజేశారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు శ్రీ దేవులపల్లి అమర్ ఈ పురస్కారాన్ని అందజేశారు.
గత నవంబర్ 1 వ తేదీన విజయవాడలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన డాక్టర్ వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం కార్యక్రమానికి అనివార్య కారణాల వల్ల హాజరు కాలేక పోయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసి పురస్కారాన్ని నాకు ఈ రోజు అందజేయడం ఆనందంగా ఉన్నదని పురస్కార గ్రహీత శ్రీ ఏబికె ప్రసాద్ అన్నారు.
పత్రికా రంగంలో పనిచేసిన, చేస్తున్న నా సహచరులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అని మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, కమిటీ సభ్యులకు శ్రీ ఎబికె ప్రసాద్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ పురస్కారం నా చేతుల మీదుగా శ్రీ ఎబికె ప్రసాద్ కు అందించడం నా అదృష్టంగా భావిస్తున్నానని దేవులపల్లి అమర్ అన్నారు. ఒక ప్రశంసా పత్రం, పది లక్షల రూపాయల నగదు, వైఎస్ఆర్ జ్ఞాపికలు ఈ జీవన సాఫల్య పురస్కారం లో ఉన్నాయి అని అమర్ తెలిపారు.
సభకు సీనియర్ పాత్రికేయులు శ్రీ కె. రామచంద్ర మూర్తి అధ్యక్షత వహించగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ దాసరి శ్రీనివాసులు, విశాలాంధ్ర సంపాదకులు శ్రీ ఆర్వీ రామారావు, పలువురు సీనియర్ పాత్రికేయులు ఈ కార్యక్రమానికి హాజరై శ్రీ ఎబికె ప్రసాద్ ను అభినందించారు.
addComments
Post a Comment