తూఫాను ప్రభావం నుండి జిల్లా గట్టెక్కినట్లే

 


తూఫాను ప్రభావం నుండి జిల్లా గట్టెక్కినట్లే


శ్రీకాకుళం, డిసెంబర్ 4 (prajaamaravati): జవాద్ తుఫాను నుండి శ్రీకాకుళం జిల్లా దాదాపు బయటపడింది. పెద్దగా నష్ట పరచకుండా జిల్లాను దాటడం ప్రజలు ముఖ్యంగా రైతులు ఊపిరి పీల్చుకున్నారు.  శుక్రవారం మధ్యాహ్నం నుంచి అడపాదడపా ప్రారంభం అయిన వర్షం సాయంకాలం నాటికీ తీవ్రత పెరుగుతూ రాత్రి భారీ నుండి అతి భారీ  వర్షాలు కొన్ని చోట్ల నమోదయ్యాయి. శుక్రవారం జిల్లాలో మొత్తం 1069 మిల్లీమీటర్ల వర్షం నమోదయింది. సరాసరిన 28.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధిక వర్షపాతం కవిటి మండలంలో 57.4 మిల్లీమీటర్లు, సంతబొమ్మాళి మండలంలో 52.8 మిల్లీమీటర్లు, సోంపేట మండలంలో 50.2 మిల్లీ  మీటర్లు, జలుమూరు మండలం 44.6 మిల్లీమీటర్లు నమోదు కాగా కనిష్టంగా వీరఘట్టం మండలం లో 9.8 మిల్లీమీటర్లు నమోదయింది. శని వారం ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు మూడు, నాలుగు మండలాలు మినహా వర్షపాతం నమోదు కాలేదు. 


ఇప్పటి వరకు ఆస్తి నష్టం జరిగినట్లు వివరాలు  అందలేదు. వజ్రపుకొత్తూరు మండలం మెలియాపుట్టి గ్రామంలో కొబ్బరి చెట్టు కూలి దురదష్టవశాత్తూ ఒక బాలిక మృతి చెందినట్లు తెలియవచ్చింది. అయితే ఆ సమయంలో గాలులు లేకపోవడం వంటి కారణాల రీత్యా అధికారులు పరిశీలిస్తున్నారు.


 శనివారం ఉదయం నుండి ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేశారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు పలాస మండలంలో వివిధ ప్రాంతాల్లో నష్టాలను, పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వ్యవసాయ ప్రత్యేక కమిషనర్ మరియు జిల్లా ప్రత్యేక అధికారి హెచ్. అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. పునరావాస కేంద్రాలను తనిఖీ చేశారు. భోజన సౌకర్యాలు పరిశీలించారు. ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు, ఇతర శాఖలు చేపడుతున్న పనులు పరిశీలించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలను సూచించారు. తుఫాను సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొనుటకు లేదా తెలియజేయుటకు జిల్లా, మండల కంట్రోల్ రూమ్ లకు ఫోన్ చేయాలని కోరారు. అన్ని పరిస్థితులు ప్రస్తుతం కంట్రోల్ లో

 ఉన్నాయని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ శనివారం సాయంత్రం తెలిపారు.  ఇప్పటికీ జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని ఆయన పేర్కొన్నారు. వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని  సూచన ఉన్నాయని ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండి బయటికి వెళ్ళరాదని కోరారు. తడిచిన గోడలు, చెట్ల వద్ద ఉండరాదని సూచించారు. శ్రీకాకుళం నగరం గుండా ప్రవహిస్తున్న నాగావళి పై నిర్మిస్తున్న డైక్ వద్ద గట్టు కోతకు గురి కావడంతో శని వారం పరిశీలించారు. నగరానికి భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Comments