బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ కొనసాగేలా చూడాలని మంత్రి కొడాలి నానికి వినతి

 


- బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ కొనసాగేలా చూడాలని మంత్రి కొడాలి నానికి వినతి




గుడివాడ, డిసెంబర్ 29 (ప్రజా అమరావతి): బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం కొనసాగేలా చూడాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను  కోరారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం కింద కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 2008వ సంవత్సరంలో ప్రారంభించారని తెలిపారు. ప్రతి జిల్లాలో 100 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను  ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ స్కూల్స్ లో చదివించాలనే మంచి ఉద్దేశంతో ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టారని చెప్పారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులు కార్పొరేట్ స్కూల్స్ లో 1 నుండి 10వ తరగతి వరకు చదువుకుంటున్నారని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ స్కీమ్ నిలిచిపోయిందని, ఫీజులు చెల్లించి కార్పొరేట్ స్కూల్స్ లో తమ పిల్లలను చదివించే స్తోమత లేదన్నారు. దీంతో పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. 2008 వ  సంవత్సరం నుండి కార్పొరేట్ పాఠశాలల్లో చేరి ఇప్పటివరకు చదువుకుంటున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీంను కొనసాగించేలా చూడాలని కోరారు. లేకుంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి కార్పొరేట్ పాఠశాలలకు చెల్లించే రూ. 20 వేలను తాము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ కింద విద్యార్థులను కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించుకుని ఇప్పటివరకు చదువులు చెబుతున్న ఆయా పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు బొడ్డు విల్సన్ బాబు, మట్టా జాన్ విక్టర్, దారా రమేష్, ముత్యాల నాగేశ్వరరావు, దాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments