సమిష్టి కృషితోనే వాయు కాలుష్యం కట్టడి

 

*సమిష్టి కృషితోనే వాయు కాలుష్యం కట్టడి*

రాజ్యసభలో వాయు కాలుష్యంపై శ్రీ విజయసాయి రెడ్డి ప్రసంగం

న్యూఢిల్లీ, డిసెంబర్ 10 (ప్రజా అమరావతి): వాయు కాలుష్యం అరికట్టేందుకు శాస్త్రీయ పరిష్కార మార్గాలు తక్షణమే కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు చేతులు కలిపి సమష్టిగా కృషి చేయవలసిన తరుణమిదని వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అన్నారు. వాయు కాలుష్యంపై శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ సభ్యుల తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

దేశంలో గత రెండు దశాబ్దాలుగా గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతోంది. ఇందుకు దారి తీస్తున్న కారణాలు ఏమిటో విశ్లేషించాలి. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోవడం తద్వారా గ్లోబల్ వార్మింగ్‌ పెరగడానికి ప్రధాన కారణాలలో నియంత్రణలేని పారిశ్రామికీకరణ. దేశ పురోగతికి పారిశ్రామిక వృద్ధి అవసరమే. దానిని కాదనలేం. కానీ నియమ నిబంధనలను ఉల్లంఘించి, అడ్డూ అదుపూ లేకుండా జరిగే నిర్మాణాలు, భారీ ఎత్తున జరుగుతున్న శిలాజ ఇంధనాల వినియోగం వంటి వాలన గాలి నాణ్యత తగ్గిపోయి గ్లోబల్‌ వార్మింగ్‌ పెరగడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి. దీని వలన దేశంపై జబ్బుల భారం గణనీయంగా పెరుగతోంది. కొన్ని గణాంకాల ప్రకారం వాయు కాలుష్యం కారణంగా సగటు జీవిత కాలం 5.9 సంవత్సరాలు తగ్గిపోయింని అన్నారు.

వాయు కాలుష్యం అనేది ఒక రాష్ట్రానికో దేశానికో పరిమితమైనది కాదు. దీనికి ఎల్లలు లేవు. దేశంలో 2070 నాటికి వాతావరణ కాలుష్యాన్నిపూర్తిగా  అరికడతామని ఇటీవల జరిగిన సీవోపీ26 సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేసిన ప్రకటనను ఈ సందర్భంగా శ్రీ విజయసాయి రెడ్డి స్వాగతించారు. వాతావరణానికి పొంచి ఉన్న ముప్పును నివారించే దిశగా కార్యాచరణకు శ్రీకారం చుట్టినందుకు ఆయన ప్రధానమంత్రిని అభినందించారు.

*ఏపీ చర్యలు అభినందనీయం....*

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టణ, నగరాలలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు అనేక బహుముఖ పథకాలను ప్రారంభించిందని ఆయన చెప్పారు. రానున్న అయిదేళ్ళ కాలంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 639 కోట్ల రూపాయలతో క్లీన్‌ ఎయిర్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని అన్నారు. ఈ కార్యాచరణలో భాగంగా యువతను, వివిధ ప్రజా సమూహాలు, వివిధ రంగాలకు చెందిన సంఘాలను భాగస్వాములను చేస్తూ వాతావరణ కాలుష్యంపై అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధులను క్లీన్‌ ఎయిర్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమం కోసం వినియోగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలను కోరినట్లు ఆయన చెప్పారు. అలాగే పరిశ్రమలకు సమీపంలో ఉండే పట్టణాలలో స్వచ్ఛమైన గాలి ఉండే వాతావరణం సృష్టించడానికి ఆయా పరిశ్రమల తోడ్పాటును అభ్యర్ధించినట్లు తెలిపారు. విద్యుత్‌ వాహనాల తయారీ రంగంలో 2024 నాటికి 30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. తద్వారా 60 వేల ఉద్యోగాల కల్పనతోపాటు ఏటా 10 లక్షల విద్యుత్‌ వాహనాలు తయారీకి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసింది. వాహన కాలుష్యాన్ని అరికట్టడంలో విద్యుత్‌ వాహనాల వినియోగం పెద్ద ముందడుగు అవుతుందని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు.

విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వాయిదాల పద్దతిపై విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను ప్రభుత్వమే సమకూర్చుతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కోపరేటివ్‌ సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బంది, పెన్షనర్లకు కూడా విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను వాయిదాల పద్దతిపై ప్రభుత్వం అందచేయనున్నట్లు ఆయన తెలిపారు.


*రైల్వే జోన్‌ కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తాం*

వైఎస్సార్సీపీ నాయకులకు రైల్వే మంత్రి హామీ

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 10: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామని రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌ హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు శ్రీ వి.విజయసాయి రెడ్డి, పార్టీ లోక్‌సభాపక్ష నాయకులు శ్రీ పీవీ మిధున్‌ రెడ్డి శుక్రవారం పార్లమెంట్‌లోని మంత్రి కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు.

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా కార్యకలాపాలను ప్రారంభించడంలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని వారు శ్రీ అశ్వినీ వైష్ణవ్‌  దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి వెంటనే విశాఖ రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పొందుపరచిన హామీలను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసేలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధితో కృషిని కొనసాగిస్తుందని శ్రీ విజయసాయి రెడ్డి, శ్రీ మిధున్‌ రెడ్డి పేర్కొన్నారు.


*పీఎంకేఎంవై కింద ఏపీలో 31 వేల రైతులు*

రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ప్రధాన మంత్రి కిసాన్‌ మన్‌ధన్‌ యోజన (పీఎంకేఎంవై) పథకం కింద ఈనెల 7న నాటికి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 31 వేల 887 మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్‌ సదుపాయం కల్పించి వారిని సామాజిక భద్రత పరిధిలోనికి తీసుకువచ్చేందుకు 2019 సెప్టెంబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.

దేశవ్యాప్తంగా పీఎంకేఎంవై పథకం కింద ఇప్పటి వరకు 21 లక్షల మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇది పూర్తిగా స్వచ్ఛంగ పథకం. పీఎం కిసాన్‌ పథకం కింద ఆయా రాష్ట్రాలలోని నోడల్‌ ఏజెన్సీలలో రైతులు పీఎంకేఎంవైలో తమ పేర్లను నమోదు చేసుకునే సౌలభ్యం ఉందని ఆయన చెప్పారు. స్వచ్ఛంద పథకం అయినందున రాష్ట్రాల వారీగా ప్రతి ఏటా  ఈ పథకం కింద ఇంతమంది రైతులు రైతులను చేర్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించలేదని తెలిపారు. ఈ పథకం కింద అర్హతలకు లోబడి నమోదయ్యో రైతులకు 60 ఏళ్ళు వచ్చే సరికి నెలకు 3 వేల రూపాయలు చొప్పున పెన్షన్‌ చెల్లిస్తారు. 18 నుంచి 40 ఏళ్ళ మధ్య వయస్సుగల రైతులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. పథకంలో చేరిన ప్రతి సభ్యుడు నెలకు 100 రూపాయలు చొప్పున చెల్లిస్తే అంతే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం వారి పెన్షన్‌ ఫండ్‌ అకౌంట్‌లో  జమ చేస్తుంది. ఎల్‌ఐసీ సంస్థ నిర్వహణలో కొనసాగే ఈ పెన్షన్‌ ఫండ్‌ ద్వారా ఆ సంస్థే అర్హులకు పెన్షన్‌ మొత్తాన్ని చెల్లిస్తుందని మంత్రి వివరించారు.

*ఏపీలో పామాయిల్‌ ఉత్పత్తి తగ్గుముఖం*

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 10: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన నాలుగేళ్ళలో క్రూడ్‌ పామాయిల్‌ ఉత్పత్తి తగ్గుముఖం పట్టినట్లు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర తోమర్‌ తెలిపారు. క్రూడ్‌ పామాయిల్‌ సాగు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో నంబర్‌ వన్‌ స్థానంలోనే ఉన్నప్పటికీ గడచిన నాలుగేళ్ళుగా ఉత్పత్తి క్షీణిస్తూ వస్తోందని గణాంకాల ద్వారా ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభలో శుక్రవారం శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ వరి, అరటి, చెరుకు పంటలతో పోలిస్తే పామాయిల్‌ సాగుకు నీటి అవసరం తక్కువగానే ఉంటుందని చెప్పారు. దేశంలో పామాయిల్‌ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్ - ఆయిల్ పామ్ కార్యక్రమం కింద పామ్ ఆయిల్ సాగులో సూక్ష్మ సేద్యం, నీటి పరిరక్షణ, సాగు నీటి యాజమాన్య పద్దతులను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.