తుఫానులో ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు
నాణ్యమైన భోజనాన్ని సహాయ శిబిరాల్లో అందించాలి
వీడియో కాన్ఫరెన్సులో సి.ఎం. ఆదేశాలు
విజయనగరం, డిసెంబరు 3 (ప్రజా అమరావతి); జవాద్ తుఫాను నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తుఫాను సహాయ శిబిరాల్లో అత్యంత నాణ్యమైన భోజనం, తాగునీరు, అత్యంత పరిశుభ్రమైన మరగుదొడ్లు తదితర వసతులను కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు. తుఫాను కారణంగా ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదని, లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తంచేసి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. జవాద్ తుఫాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో సి.ఎం. వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి మాట్లాడుతూ తుఫాను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సన్నద్ధంగా వున్నట్టు వివరించారు. పూరిళ్లలోను, పాత భవనాల్లో నివసిస్తున్న 1708 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికోసం స్కూళ్లు, గ్రామ సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. భోజనం, మరుగుదొడ్లు తదితర వసతులన్నీ వారికి కల్పిస్తున్నట్టు వివరించారు. జిల్లాలో 54 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. రెండు ఎన్.డి.ఆర్.ఎఫ్., ఒక ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాన్ని సిద్ధంగా వుంచామన్నారు. రెండు కోస్టుగార్డు బృందాలు, రెండు మెరైన్ పోలీసు బృందాలు, 6 అగ్నిమాపక దళ బృందాలు సిద్ధంచేశామన్నారు. తుఫాను సహాయక చర్యలు చేపట్టేందుకు 61 మంది స్విమ్మర్లు, 4 బోట్లను సిద్దం చేశామన్నారు.
విద్యుత్ సరఫరా అంతరాయం వల్ల తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడితే ఎదుర్కొనేందుకు 97 తాగునీటి ట్యాంకర్లను సిద్ధంగా వుంచామన్నారు. రోడ్ల పునరుద్దరణ చర్యలు చేపట్టేందుకు 36 జె.సి.బి.లు, 30 పవర్ సాలను సిద్ధం చేశామన్నారు. మరో 60 టిప్పర్లను కూడా సిద్దంగా వుంచినట్లు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరాకోసం 60 జనరేటర్లు సిద్ధంగా వుంచామని చెప్పారు.
తుఫాను సందర్భంగా సరఫరాకోసం నిత్యావసరాలు కూడా సిద్ధంగా వుంచామన్నారు. 11,773 మెట్రిక్ టన్నుల బియ్యం, 690 మెట్రిక్ టన్నుల పప్పు, 386.43 మె.టన్నుల చక్కెర సిద్ధంగా వుంచామన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్‌లు డా.ఆర్.మహేష్ కుమార్, మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
పూసపాటిరేగ తహశీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ పాల్గొన్నారు.
addComments
Post a Comment