అక్షర చైతన్య కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులకు విజయవంతంగా పరీక్షలు


నెల్లూరు, జనవరి 8 (ప్రజా అమరావతి) : జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అక్షర చైతన్య కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులకు విజయవంతంగా పరీక్షలు


నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. 


  జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో జిల్లాలో వినూత్నంగా చేపట్టిన అక్షర చైతన్యం కార్యక్రమంలో పాల్గొని అక్షర జ్ఞానం పొందిన నిరక్షరాస్యులకు శనివారం ఉదయం జిల్లా వ్యాప్తంగా 1746 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించగా పొదలకూరు మండల పరిధిలోని ఉలవరపల్లి ప్రాథమిక పాఠశాల, పొదలకూరు దువ్వూరు నారాయణరెడ్డి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాదికా అమృత మహోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలో చేపట్టిన అక్షర చైతన్యం కార్యక్రమంలో భాగంగా గత మూడు నెలల నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రతిరోజు వారి పరిధిలోని నిరక్షరాస్యులకు విద్యాబోధన చేశారని,  జిల్లాలోని 40 మండలాల్లో 8426 అక్షర కేంద్రాలను ఏర్పాటు చేసి 1,33,438 నిరక్షరాస్యులను గుర్తించి విద్యాబోధన చేసి వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేశారన్నారు. జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి, వయోజన విద్యా శాఖ సిబ్బంది, మండల అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణలో 8426 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విజయవంతం కావడంతో అక్షరాస్యత శాతం కూడా బాగా మెరుగుపడుతుందన్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి సహకరించిన జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి, జాయింట్ కలెక్టర్లు శ్రీ గణేష్ కుమార్, శ్రీ హరేంధిరప్రసాద్, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ముందుగా ఆయన పరీక్షా కేంద్రాల్లోని అభ్యర్థులతో మాట్లాడుతూ వారికి విద్యను బోధించిన విధానం, శిక్షణలో వారు నేర్చుకున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. 

 కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి ధనలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ రమేష్, ఎం ఈ ఓ బాలకృష్ణ రెడ్డి, ఇంచార్జ్ ఎంపిడిఓ నారాయణ రెడ్డి, తాసిల్దార్ సుధీర్ తదితరులు ఉన్నారు. 

Comments