ప్రకృతి వ్యవసాయం ద్వారానే ఒంగోలు జాతి పశువుల మనుగడ సాధ్యం



- ప్రకృతి వ్యవసాయం ద్వారానే ఒంగోలు జాతి పశువుల మనుగడ సాధ్యం


 

- మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి 



గుడివాడ, జనవరి 14 (ప్రజా అమరావతి): ప్రకృతి వ్యవసాయం ద్వారానే ఒంగోలు జాతి పశువుల మనుగడ సాధ్యమని గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి  అభిప్రాయపడ్డారు. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కే. కన్వెన్షన్ లో ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. సేద్య విభాగంలో విజేతలకు బహుమతులను అందజేసిన అనంతరం అడపా బాబ్జి రైతులు, పశు పోషకులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆయన సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) లు గత ఐదేళ్ళుగా జాతీయస్థాయిలో పోటీలను నిర్వహిస్తూ వస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా ఒంగోలు జాతి పశువులకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు అని, ఈ జాతి పశువులను 1863 వ సంవత్సరంలో బ్రెజిల్ దేశం దిగుమతి చేసుకుందన్నారు. ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒంగోలు జాతి పశువుల పైనే ఆధారపడి ఉండడాన్ని బట్టి ఆ పశు సంపద వల్ల చేకూరే ప్రయోజనాలను అర్థం చేసుకోవచ్చని చెప్పారు. పూర్వం వ్యవసాయంలో ఒంగోలు జాతి పశువుల అవసరం ఉండేదని, ఆ దిశగా ఆలోచన చేయాలన్నారు. పశు ఆధారితి వ్యవసాయం ప్రతి రైతు లక్ష్యం కావాలన్నారు. ఒంగోలు జాతి పశు పోషకులను ప్రోత్సహించేందుకు మంత్రి కొడాలి నాని, ఆయన సోదరుడు కొడాలి చిన్నిలు చేస్తున్న కృషిని అడపా బాబ్జి అభినందించారు. వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా రెండు పళ్ళు, నాలుగు పళ్ళు, ఆరు పళ్ళు సేద్య విభాగంలో పోటీలను నిర్వహించారని, సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. రైతులు, ఔత్సాహికులు హర్షద్వానాల మధ్య ఒంగోలు జాతి ఎడ్లు ఉత్సాహభరితంగా బండను లాగుతూ అలరిస్తున్నాయన్నారు. ప్రదర్శన పోటీలను చూసేందుకు పెద్దఎత్తున పశు పోషకులు , రైతులు, ప్రజలు విచ్చేస్తున్నారని తెలిపారు. పోటీల ప్రారంభానికి ముందుగా ఎడ్ల జతల యజమానుల సమక్షంలో డ్రా తీస్తున్నారని తెలిపారు. ప్రతి ఎడ్ల జత యజమానికి ట్రస్ట్ సమకూర్చిన టీ షర్ట్ తో పాటు జ్ఞాపికలను కూడా అందజేస్తున్నారన్నారు. అన్ని విభాగాల్లో జరుగుతున్న పోటీలకు సంబంధించి నియమ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారని, పోటీలు ముగిసిన వెంటనే ఆయా విభాగాల్లో మొదటి తొమ్మిది స్థానాల్లో నిలిచిన విజేతలకు నగదు బహుమతులను అందజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, ఎంపీపీలు పెయ్యల ఆదాం, గద్దె పుష్పరాణి, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్విక్టర్, నాయకులు వల్లూరుపల్లి సుధాకర్, కసుకుర్తి బాబ్జి, పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మేకల సత్యనారాయణ, కొంకితల ఆంజనేయప్రసాద్, గిరిబాబాయ్, మూడెడ్ల ఉమా, దారం ఏడుకొండలు, చింతల భాస్కరరావు, వెంపటి సైమన్, దారం నరసింహా, కొలుసు నరేంద్ర, రేమల్లి పసి, ఆర్విఎల్ నరసింహారావు, షేక్ సయ్యద్, యార్లగడ్డ సత్యభూషణ్, చుండి బాబి, పెద్ది కిషోర్, పొట్లూరి మురళీధర్, తోట రాజేష్, లోయ రాజేష్, ఎస్కే బాజీ, అలీబేగ్, చింతాడ నాగూర్, చిన్ని దుర్గాప్రసాద్, మాదాసు వెంకటలక్ష్మి, గంటా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Comments