జిల్లాలో మరో మూడు రైతు ఉత్పత్తి సంఘాలు
కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో ఏర్పాటు
జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీలో ప్రతిపాదన
విజయగనరం, జనవరి 15 (ప్రజా అమరావతి); జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కింద ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2021-22)లో కొత్తగా మూడు రైతు ఉత్పత్తి సంఘాలు(Farmer Produce Organizations-FPOs) కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీ సమావేశంలో నిర్ణయించారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న నబార్డు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదిస్తూ తీర్మానం చేశారు. బొబ్బిలి, గజపతినగరం, విజయనగరం గ్రామీణ ప్రాంతాల్లో మూడు కొత్త రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసేందుకు ఈ సమావేశంలో ఆమోదించారు. ఒక్కో సంఘానికి ఐదేళ్ల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం రూ.43 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందిస్తుందని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో ఇప్పటికే ఈ పథకంలో చీపురుపల్లి, నెల్లిమర్ల లో రెండు సంఘాలు వున్నాయని పేర్కొన్నారు.
బొబ్బిలి క్లస్టర్‌లో రామభద్రపురం, బొబ్బిలి, బాడంగి, బలిజిపేట, సీతానగరం మండలాలు వుంటాయని నబార్డు ఏ.జి.ఎం. హరీష్ తెలిపారు. మొక్కజొన్న, అపరాలు, కూరగాయలు, పళ్లు తదితర వ్యవసయ ఉత్పత్తుల విక్రయాలు ఈ సంఘం ద్వారా చేపడతామని పేర్కొన్నారు.
గజపతినగరం క్లస్టర్‌లో గజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ మండలాలు భాగంగా వుంటాయని మొక్కజొన్న, అపరాలు, కూరగాయలు, పళ్లు తదితర వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు ఈ సంఘం ద్వారా చేపడతామని పేర్కొన్నారు.
విజయనగరం రూరల్ క్లస్టర్‌లో విజయనగరం రూరల్, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం తదితర మండలాలు వుంటాయని, ఈ సంఘం ద్వారా పళ్లు, కూరగాయలు, పూలు, కొబ్బరి తదితర ఉత్పత్తుల విక్రయాలను చేపట్టడం జరుగుతుందన్నారు.
ఇప్పటివరకూ ఏ రైతు ఉత్పత్తి సంఘంలో లేని మండలాలను ఈ కొత్త క్లస్టర్లలో భాగంగా చేసినట్లు ఏజిఎం తెలిపారు. బ్రెడ్స్ ఎన్.జి.ఓ. ఈ ఉత్పత్తి సంఘాల ఏర్పాటు, అందులోని సభ్యులకు శిక్షణ ఇవ్వడం, వాటి కార్యకలాపాల నిర్వహణలో సహకరించడం వంటి అంశాల్లో సహకరిస్తుంద న్నారు.
జిల్లాలో మత్స్యకార ఉత్పత్తుల విక్రయానికి కూడా తగిన మార్కెటింగ్ వసతులు కల్పించడంపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు.
addComments
Post a Comment