మహా పూర్ణాహుతితో ముగిసిన నవకుండాత్మక శ్రీ యాగం

 మహా పూర్ణాహుతితో ముగిసిన నవకుండాత్మక శ్రీ యాగం



తిరుప‌తి,  జ‌న‌వ‌రి 27 (ప్రజా అమరావతి): ప్ర‌పంచ శాంతి, సౌభాగ్యం కోసం శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ప్రార్థిస్తూ జ‌న‌వ‌రి 21 నుండి ఏడు రోజుల పాటు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో నిర్వహించిన నవకుండాత్మక శ్రీ‌యాగం గురువారం మహాపూర్ణాహుతితో ముగిసింది.
కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలోని శ్రీకృష్ణ ముఖ మండ‌పంలో అర్చ‌కులు శ్రీ వేంపల్లి శ్రీ‌నివాస‌న్ ప్ర‌ధానాచార్యులుగా ఏకాంతంగా ఈ యాగం నిర్వహించారు.
ఈ యాగ కార్య‌క్ర‌మాల‌ను శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

ఉద‌యం 6.30 నుండి 8.30 గంట‌ల వ‌రకు చ‌తుష్టానార్చ‌న‌, హోమాలు, మ‌హాప్రాయ‌శ్చిత్త హోమం, మ‌హాశాంతి హోమం నిర్వ‌హించారు. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు మ‌హాపూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం అభిషేకం మ‌రియు అవ‌భృతం నిర్వ‌హించారు.

టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు నిర్వహింపచేసిన ఈ యాగంలో కంచిపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ దంపతులు, డిప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి భాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, అర్చకులు శ్రీ బాబు స్వామి పాల్గొన్నారు.

అనంతరం కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు, పాలక మండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

Comments