విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
విద్యార్థులకు మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపు
ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం ప్రారంభం
మెరకముడిదాం (విజయనగరం), ఫిబ్రవరి 26 (ప్రజా అమరావతి) ః
ప్రభుత్వం కల్పిస్తున్న విద్యావకాశాలను సద్వినియోగం చేసుకొని, వృద్దిలోకి రావాలని విద్యార్థులకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. మెరకముడిదాం మండలం సోమలింగాపురంలో, అరబిందోఫార్మా అందజేసిన సిఎస్ఆర్ నిధులు రూ.3.30 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని, శనివారం మంత్రి ప్రారంభించారు. కళాశాల ప్రాంగణంలో సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి బొత్స మాట్లాడుతూ, విద్యార్థులకోసం ప్రభుత్వం అన్నిరకాల సదుపాయాలను కల్పించడం జరుగుతోందని అన్నారు. అరబిందో ఫార్మా సహకారంతో పూర్తిస్థాయిలో అన్నిరకాల వసతులతో ఈ జూనియర్ కళాశాలను నిర్మించడం జరిగిందని చెప్పారు. దీనిని మోడల్ కళాశాలగా తీర్చిదిద్దాలని అధ్యాపకులను కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని, పదోతరగతి తరువాత చదువు మానేయకుండా, ఉన్నత చదువులు చదవాలని సూచించారు. భవిష్యత్తులో హాస్టల్‌ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కళాశాల నిర్మాణానికి సిఎస్ఆర్ క్రింద నిధులను విడుదల చేసిన అరబిందో ఫార్మాను అభినందిస్తూ, జిల్లాలో వారి సహకారం మరువలేదని పేర్కొన్నారు. అరబిందో ఫార్మా ఒకవైపు యువతకు ఉద్యోగాలను కల్పిస్తూ, మరోవైపు విద్యాభివృద్దికి కూడా కృషి చేస్తుండటం అభినందనీయమని అన్నారు. కళాశాల నిర్మాణానికి సుమారు ఎకరన్నర స్థలాన్ని విరాళంగా ఇచ్చిన పెదబాబును మంత్రి కొనియాడారు. వారి త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు. మెరకముడిదాం మండలాన్ని అన్నివిధాలా అభివృద్ది చేసేందుకు కట్టుబడి ఉన్నామని, త్వరలో మొక్కజొన్న ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. అతిథి అధ్యాపకుల పెండింగ్ జీతాలను విడుదల చేసేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ కళాశాల నిర్మాణానికి స్థలం ఇచ్చిన పెదబాబును ఎంతగానో అభినందించారు. విద్య ఆవశ్యకతను గుర్తించే, ఆ కుటుంబం విలువైన స్థలాన్ని కళాశాలకు విరాళంగా ఇచ్చిందని అన్నారు. మెరకముడిదాం వెనుకబడిన మండలం అయినప్పటికీ, విద్యతో వెనుకబాటుతనాన్ని పారద్రోలవచ్చని సూచించారు. అరబిందో ఫార్మా యాజమాన్యం, కళాశాలను మంచి నాణ్యతతో నిర్మించడమే కాకుండా, చక్కని ఫర్మీచర్‌ను, ఇతర వసతులను కల్పించారని కలెక్టర్ అభినందించారు.
అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్, ఎండి కె.నిత్యానందరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు. కళాశాలలో ల్యాబ్ ఏర్పాటు చేయడానికి రూ.24లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రెండేళ్లపాటు కళాశాల సిబ్బంది జీతభత్యాలు భరించేందుకు ఆయన ముందుకు వచ్చారు. తమ కంపెనీ అభివృద్దిలో మంత్రి బొత్స సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫార్మా కంపెనీ స్థిరపడటానికి, పరిశ్రమలశాఖా మంత్రిగా ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ నిర్ణయాలే కారణమని ప్రశంసించారు.
జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, 2019లో ఎన్నికల స్టంటుగా, అప్పటి టిడిపి ప్రభుత్వం జూనియర్ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు జీవో ఇచ్చేసి చేతులు దులుపుకుందని విమర్శించారు. వైఎస్ జగన్ మోహనరెడ్డి ప్రభుత్వ హాయంలో, మంత్రి బొత్స సత్యనారాయణ ఏడాది కూడా గడవకముందే, మెరకముడిదాం పాఠశాలలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారని, మరో ఏడాదికల్లా సొంత భవనాన్ని నిర్మించారని చెప్పారు. కళాశాలతోపాటు, గ్రామస్తులు కూడా వినియోగించుకొనేలా ఆర్ఓ ప్లాంటును కూడా ఏర్పాటు చేసిన, అరబిందో ఫార్మా కంపెనీని కొనియాడారు. ఈ జూనియర్ కళాశాల భవిష్యత్తులో డిగ్రీ కళాశాలగా కూడా అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉందన్నారు. వెనుకబడిన మెరకముడిదాం మండలానికి సాగునీటిని తీసుకువచ్చి, సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. విజయనగరం రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకులో రక్తాన్ని నిల్వ ఉంచేందుకు విలువైన పరికరాలను కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించాలని, చీపురుపల్లిలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్‌బ్యాంకును ఏర్పాటు చేసేందుకు సహకారం అందించాలని అరబిందో ఫార్మాకు, జెడ్‌పి ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు.
ఎంపి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, విద్య, వైద్యం, వ్యవసాయం రాష్ట్రప్రభుత్వానికి ప్రాధాన్యతాంశాలని పేర్కొన్నారు. ఈ మూడు రంగాలకు పెద్దపీట వేస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ ద్వారా, విద్యాభివృద్దికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి మరింత ముందడుగు వేస్తూ, విద్యారంగంలో విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. తోటపల్లి నీటిని తెచ్చి, మండల రైతులను ఆదుకొనేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ కృషి చేస్తున్నారని ఎంపి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, మెరకముడిదాం మండల ఎంపిపి తాడ్డి కృష్ణవేణి, తాశీల్దార్ రత్నకుమార్, ఎంపిడిఓ ఇందిరారమణి, ఎంఇఓ రామారావు, కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పెదబాబు, కెవి సూర్యనారాయణరాజు, తాడ్డి వేణుగోపాలరావు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
addComments
Post a Comment