కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశాయని వివరించారు



 నెల్లూరు, మార్చి 4 (ప్రజా అమరావతి):--ఉక్రెయిన్ దేశం లో చదువుతున్న 17 మంది జిల్లాకు చెందిన విద్యార్థులను వారం రోజుల్లోగా సురక్షితంగా జిల్లాకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి ఎన్ చక్రధర బాబు  వెల్లడించారు. 


శుక్రవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఉక్రెయిన్ దేశంలో చదువుతున్న తెలుగువారిని ఆపరేషన్ గంగా అనే పేరుతో క్షేమంగా వారి స్వస్థలాలకు చేర్చేందు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా హెల్ప్  లైన్లు ఏర్పాటు చేశాయని వివరించారు


. తాజాగా అందిన సమాచారం ప్రకారం  ఉక్రెయిన్ దేశం లో జిల్లాకు చెందిన 31 మంది విద్యార్థులు ఉండగా అందులో ముగ్గురు విద్యార్థులు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలవుతుందని ముందుగా గ్రహించి జిల్లాకు చేరుకున్నారన్నారు.  మిగిలిన 28 మందిలో  గురువారం వరకు ఐదు మంది జిల్లాకు చేరుకోగా తాజాగా శుక్రవారం మరో ఆరు మంది సురక్షితంగా జిల్లాకు కు చేరుకున్నారన్నారు.  వారిలో బండి వినీల్ రెడ్డి, షేక్ మొహమ్మద్ అబూబకర్ సిద్దిక్,  గెర్రి ప్రణీత్ సురాజ్, తెనాలి సాయి చంద్, గంగినేని జస్వంత్, షేక్ మహమ్మద్ బష్రి తబస్సుమ్ ఉన్నారు.  దీంతో మొత్తం 14మంది  జిల్లాకు చెందిన విద్యార్థులు స్వస్థలానికి చేరినట్లు అయిందన్నారు. మిగిలిన 17 మంది కూడా సురక్షితంగా ఉన్నారని,  వారిని  ఒక వారం రోజుల్లోగా సురక్షితంగా జిల్లాకు  తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాకు చేరుకున్న విద్యార్థులను సంబంధిత మండలాల తహసీల్దార్లు, వీఆర్వోలు, వాలంటీర్ల బృందం దగ్గరుండి క్షేమంగా వారి ఇంటి వద్దకు చేర్చడం జరుగుతోందన్నారు.  జిల్లాలో  ఉక్రెయిన్ విద్యార్థుల సమాచారం తెలిపేందుకు టోల్ ఫ్రీ  నంబరు 1077 కంట్రోల్ విభాగం నిరంతరం పని చేస్తోందన్నారు.  ప్రతిరోజు హైదరాబాద్, విజయవాడ, చెన్నై ,తిరుపతి విమానాశ్రయాలకు చేరుకునే విద్యార్థుల వివరాలను ప్రాధాన్యతనిచ్చి ఎప్పటికప్పుడు తెలుసు కోవడం జరుగుతోందన్నారు. ఉక్రెయిన్ లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మరోమారు  కోరారు. 

Comments