నవరత్నాలు-పేదలు అందరికీ ఇళ్ల పథకం క్రింద తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం
• రానున్న వర్షాకాలం దృష్ట్యా యుద్ద ప్రాతిపదికన నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు
• లబ్దిదారుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో త్వరలో కాల్ సెంటర్ ఏర్పాటు
• ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ప్రతి నెలా అధికారులతో సమీక్ష
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
అమరావతి,మే 17 (ప్రజా అమరావతి): రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిక అయిన నవరత్నాలు-పేదలు అందరికీ ఇళ్ల పథకం క్రింద తొలి దశలో చేపట్టిన 15 లక్షల 60 వేల ఇళ్ల నిర్మాణ పనుల ప్రక్రియను వేగవంతం చేయడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా వర్షాలు ప్రారంభంలోపే నిర్మాణ పనులను వేగవంతం చేసి అన్ని ఇళ్ల గ్రౌండింగ్ పనులను పూర్తి చేసేవిధంగా మరియు ఇప్పటికే గ్రౌండింగ్ పనులు పూర్తయిన ఇళ్లకు సబందించి రెండో దశ నిర్మాణ పనులను పూర్తి చేసే విధంగా అధికారులను సన్నద్దం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. మంగళవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడమే కాకుండా ఆ స్థలాల్లో దశల వారీగా పక్కా ఇళ్ల నిర్మాణ పనులను చేపట్టే విధంగా ప్రభుత్వం దృడసంకల్పంతో ముందుకు వెళుతున్నదన్నారు. ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అమరావతి సచివాలయంలో నేడు అన్ని జిల్లాలకు చెందిన గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఇళ్ల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించి ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేలా పూర్తి స్థాయిలో అధికారులను సన్నద్దం చేయడం జరిగిందన్నారు. నిరుపేదలకు శాశ్వత ప్రాతిపదికన పక్కా గృహాలు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన 17 వేల జగనన్న కాలనీల నిర్మాణ పనుల్లో అధికారులతోపాటు అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిదులను కూడా బాగస్వామ్యులను చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రత్యేకించి అధికారులు అందరూ తప్పని సరిగా లేఅవుట్లలో పర్యటిస్తూ లబ్దిదారుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
లబ్దిదారుల సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ త్వరలో ఏర్పాటు….
లబ్దిదారులతో పాటు క్షేత్ర స్థాయిలోని చిన్న స్థాయి అధికారులు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో త్వరలోనే ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఆప్షన్-3 క్రింద 3 లక్షల పైగా లబ్దిదారులు ఉన్నారని, వారంతా కూడా త్వరిత గతిన ఇళ్ల నిర్మాణం చేసుకునే విధంగా చర్యలు చేపట్టడమైందన్నారు. ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలనే లక్ష్యంతో లబ్దిదారులకు ముందుగానే ఋణం మంజూరు చేయడమే కాకుండా ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇసుక, ఐరన్ తదితర సామాగ్రిని పూర్తి స్థాయిలో నిల్వలను ఉంచి లబ్దిదారులు అడిగిన వెంటనే వాటిని సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టడమైందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలో గృహ నిర్మాణ పనులు త్వరిత గతిన జరిగే విధంగా అన్ని జిల్లాల గృహ నిర్మాణ శాఖ అధికారులతో ప్రతి నెలా సమీక్షా సమావేశం నిర్వహించి ఇళ్ల నిర్మాణ ప్రగతిని సమీక్షించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
addComments
Post a Comment