మొబైల్ పోలింగ్ స్టేషన్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియ


నెల్లూరు, జూన్ 15 (ప్రజా అమరావతి):

80 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులు పోలింగ్ సమయంలో క్యూలో నిలబడి ఓటు వేసేందుకు ఇబ్బందులు పడకుండా  పోలింగ్ స్టేషన్ ను వారి ఇంటి వద్దకే తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకొనుటకు ప్రత్యేక బృందాలతో మొబైల్ పోలింగ్ స్టేషన్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియ


చేపట్టినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు వెల్లడించారు. 

 బుధవారం ఉదయం అనుమసముద్రంపేట, దువ్వూరు గ్రామాల్లో మొబైల్ పోలింగ్ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను కలెక్టర్ ప్రారంభించారు. తొలుత ఏఎస్ పేట లో 80 ఏళ్లు పైబడిన ఓ వృద్ధుడు కలెక్టర్ సమక్షంలో ఓటు హక్కును వినియోగించుకోగా, అనంతరం దువ్వూరులో మరో వృద్ధుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. 

 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులకు క్యూలైన్లలో ఇబ్బందులు లేకుండా మొబైల్ బృందాలతో అత్యంత పారదర్శకంగా, గోప్యంగా వారి ఓట్లను పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునేలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 80 ఏళ్లు పైబడిన వృద్ధులు 155 మంది, వికలాంగులు 68మంది మొత్తం 223 మంది ఉన్నారని, వీరందరు ఓటు హక్కు వినియోగించుకునేలా మొబైల్ బృందాలు సమర్థవంతంగా పని చేస్తాయన్నారు. ఈ మొబైల్ పోలీస్ స్టేషన్లో ఒక మైక్రో అబ్జర్వర్, పోలింగ్ అధికారి, సిబ్బంది ఉంటారని చెప్పారు. వీరంతా  వృద్ధులు, వికలాంగులకు ఓటు వేసే విధానాన్ని విశదీకరించి గోప్యంగా వారు ఓటు హక్కు వినియోగించుకునేలా చూస్తారని, ఈ ప్రక్రియను వీడియోగ్రఫీ కూడా తీస్తున్నట్లు చెప్పారు. ఏ రోజుకారోజు నమోదైన పోస్టల్ బ్యాలెట్ వివరాలను అభ్యర్థులకు, ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని చెప్పారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు అనుసరించి పోలింగ్ సమయంలో క్యూలైన్లు, పటిష్ట భద్రత, పోలింగ్ బూత్ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు రాకుండా జిల్లా సరిహద్దుల్లో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్కు ముందు 48గంటల సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎన్నికల కోడ్ ను పక్కాగా అమలు చేసేందుకు సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. పోటీ చేసే అభ్యర్థులు కూడా తమ ప్రచార కార్యక్రమాలు, ఖర్చుల వివరాలను తెలియజేసి ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. 

 కలెక్టర్ వెంట పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి శ్రీమతి ధనలక్ష్మి, ఏఎస్ పేట తహసిల్దార్ శ్రీ సీతా రామయ్య, బూత్ లెవెల్ ఆఫీసర్లు, సిబ్బంది ఉన్నారు.

Comments