*- శిష్ట్లా లోహిత్ ను ప్రోత్సహిస్తున్న తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం
*
*- దూకుడుగా చంద్రన్న భరోసా కార్యక్రమాలు*
*- టీడీపీ కార్యకర్తల సంక్షేమంపై స్టాల్స్ నిర్వహణ*
*- చంద్రబాబు సమక్షంలో ఆత్మీయ సమావేశాల్లో అవగాహన*
గుడివాడ, జూలై 19 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీటును ఆశిస్తున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమం కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ ను తెలుగుదేశం పార్టీ అధిష్టానం పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తున్నట్టుగా తెలుస్తోంది. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా శిష్ట్లా లోహిత్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేష్ లు రాష్ట్రస్థాయిలో కీలక పదవులను అప్పగించారు. దీంతో చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ స్పూర్తి - చంద్రన్న భరోసా కార్యక్రమాల్లో శిష్ట్లా లోహిత్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన చిత్తూరు జిల్లా పర్యటన, అంతకు ముందు జరిగిన ఉత్తరాంధ్ర కార్యక్రమాల్లోనూ శిష్ట్లా లోహిత్ చంద్రబాబు వెన్నంటే ఉన్నారు. ఒంగోలులో జరిగిన మహానాడు దగ్గర నుండి జిల్లాల్లో జరుగుతున్న ఎన్టీఆర్ స్ఫూర్తి - చంద్రన్న భరోసా కార్యక్రమాల్లో శిష్ట్లా లోహిత్ దగ్గరుండి పబ్లిసిటీని హెూరెత్తిస్తున్నారు. కార్యకర్తల సంక్షేమానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాలపై స్టాల్స్ ను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు నిర్వహించే ఆత్మీయ సమావేశాల్లోనూ శిష్ట్లా లోహిత్ స్వయంగా పాల్గొని పార్టీ కార్యకర్తల కోసం అధిష్టానం చేస్తున్న కృషిని వివరిస్తూ వస్తున్నారు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ ల దగ్గర నుండి శిష్ట్లా లోహిత్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నారా లోకేష్ కూడా శిష్ట్లా లోహిత్ కు అవసరమైన సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు. గుడివాడలో పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం, ఫ్లెక్సీల వివాదంపై ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు దృష్టిసారించారు. ఈ వ్యవహారాలపై పార్టీ అధిష్టానం కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్న శిష్ట్లా లోహిత్ కు అవసరమైన ప్రోత్సాహం అందిస్తోందని, ముఖ్యంగా గుడివాడలో పార్టీ కార్యక్రమాలను కూడా విస్తృతం చేయాలని చంద్రబాబు, లోకేష్ లు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దీంతో చంద్రబాబు పర్యటన తర్వాత గుడివాడలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించే దిశగా శిష్ట్లా లోహిత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని ముందుకు వెళ్తున్నారు. అయితే వర్షాల కారణంగా చంద్రబాబు పర్యటన వాయిదా పడడం జరిగింది. త్వరలో జరిగే చంద్రబాబు పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేసేందుకు శిష్ట్లా లోహిత్ సిద్ధమవుతున్నారు. మరోవైపు ఆప్కాబ్ మాజీ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకుడు పిన్నమనేని బాబ్జిలు కూడా శిష్ట్లా లోహిత్ తో కలిసి పనిచేస్తున్నారు. టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు త్వరలో గుడివాడ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంపై శిష్ట్లా లోహిత్ దృష్టి పెట్టనున్నారు. గుడివాడలో నెలకొన్న పరిస్థితులపై శిష్ట్లా లోహిత్ ఎప్పటికప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకు వెళ్తున్నట్టు సమాచారం.
addComments
Post a Comment