నెల్లూరు, జూలై 5 (ప్రజా అమరావతి) : రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదని
, విద్యార్థులందరూ బాగా చదువుకుని ఉన్నతంగా స్థిరపడాలని ఆలోచన చేస్తూ అనేక సంక్షేమ పథకాల ద్వారా విద్యాభివృద్ధికి శ్రీకారం చుట్టిన శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం విద్యార్థులకు ఓ వరం లాంటిదని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం పొదలకూరు డిఎన్ఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో నాడు నేడు పథకం పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు, మూడో విడత జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాలకు మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
తొలుత పొదలకూరు కు విచ్చేసిన మంత్రికి విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు పూలజల్లులతో ఘన స్వాగతం పలుకగా, రూ. 4.38 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను మంత్రి ఆవిష్కరించారు. తదుపరి పాఠశాలలోని సరస్వతి దేవి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
అనంతరం జగనన్న విద్యా కానుక మూడో విడత పంపిణీ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చిన్నచిన్న సమస్యలతో విద్యార్థులు విద్యకు దూరం కాకూడదని, గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రులు చాలా బిజీగా ఉంటారని, అంత బిజీ అయినా కూడా మన ముఖ్యమంత్రి విద్యార్థుల బాగోగుల కోసం ఆలోచిస్తూ ఉంటారని చెప్పారు. తల్లిదండ్రులకు విద్యార్థుల పుస్తక సామగ్రి కొనుగోలు చేయడం భారం కాకూడదనే గొప్ప ఉద్దేశంతో జగనన్న విద్యా కానుక ప్రవేశపెట్టారని, ఈ విద్య కానుక కిట్ లో మూడు జతల యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బూట్లు, రెండు జత సాక్స్ లు,బెల్ట్, డిక్షనరీలు ఉంటాయని, ఇవి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఇప్పటికే రెండు విడతలు విజయవంతంగా జగనన్న విద్యా కానుక కిట్లు అందజేశామని, జిల్లాలో మూడో విడత 42 కోట్ల రూపాయల వ్యయంతో 262436 మంది విద్యార్థులకు నేటి నుంచి పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో 2368 కోట్ల రూపాయలను ఒక విద్యా కానుక పథకానికి ముఖ్యమంత్రి ఖర్చు చేశారన్నారు. విద్యావ్యవస్థలో ముఖ్యమంత్రి అమలు చేస్తున్న అమ్మ ఒడి, నాడు నేడు, జగనన్న విద్యా కానుక వంటి అనేక సంక్షేమ పథకాలతో 2020-21 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 42 లక్షలు ఉన్న విద్యార్థుల సంఖ్య, ప్రస్తుతం 47 లక్షల 40 వేలకు చేరిందని, అంటే సుమారు 5 లక్షల పైగా విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిందన్నారు. రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గతంకంటే గణనీయంగా పెరుగుతోందని, ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను పారదర్శకంగా, ఎటువంటి అవినీతికి తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్తికర స్థాయిలో అందజేస్తున్నారని చెప్పారు. విదేశీ విద్య తమ ప్రభుత్వం అందించడం లేదని, బైజుస్ తో ఒప్పందం చేసుకోవడంపై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. వాస్తవంగా విచారిస్తే గత ప్రభుత్వం అమలు చేసిన విదేశీ విద్య ఓ బూటకమని, గతంలో విదేశీ విద్య అభ్యసించినట్లు జాబితాలో ఉన్న విద్యార్థులు అసలు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియడం లేదని, దొంగ పేర్లతో ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇలా కొంతమందికే పరిమితం కాకుండా విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల్లో ఎవరైతే ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులై, చదువుకునేందుకు ఆసక్తి చూపుతారు వారందరికీ విదేశీ విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి ముందుకు వచ్చినట్లు చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంతోనే బైజుస్ తో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని కొనియాడారు. త్వరలోనే మండలానికి 2 జూనియర్ కళాశాలలు, ఒక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని, ఈ క్రమంలో పొదలకూరు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను జూనియర్ కళాశాల గా, పొదలకూరు జూనియర్ కళాశాలను డిగ్రీ కళాశాల గా అప్ గ్రేడ్ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
అనంతరం విద్యార్థులకు విద్యా కానుక కిట్లను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
తొలుత విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించగా, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు మంత్రిని ఘనంగా సత్కరించారు. చివరిగా పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రి జ్ఞాపిక అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,డి ఆర్ ఓ శ్రీమతి వెంకట నారాయణమ్మ, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పి రమేష్, సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీమతి ఉషారాణి, ఆర్డిఓ పి కొండయ్య, ఎంపీడీవో నగేష్ కుమారి, ఎంఈఓ సుధీర్ బాబు, జడ్పిటిసి తెనాలి నిర్మలమ్మ, కందుకూరు సుబ్బరాయుడు, సర్పంచ్ మల్లికా చిట్టెమ్మ, జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ సనత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల అభిప్రాయాలు
..............................
1). నక్కాకరుణమ్మ భర్త తిరుపతయ్య
- నాకు ఇద్దరు ఆడ పిల్లలు. నేను పొదలకూరు పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిని. నా భర్త కూలి పనులు చేస్తుంటాడు. మేము మాకు వచ్చే చాలీచాలని డబ్బులతో గతంలో మా పిల్లల చదువులకు అనేక ఇబ్బందులు పడేవారిమి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మేము మా ఇద్దరి ఆడపిల్లలను బాగా చదివించుకుంటున్నాము. మాకు జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక ఎంతో ఉపయోగపడుతున్నాయి.
2). కేశాని రజిని భర్త వెంకటేశ్వర్లు
- మాకు ఒకే ఒక పాప. నా భర్త వ్యవసాయ పనులు చేస్తుంటాడు. మాకు జగనన్న దయవల్ల అమ్మ ఒడి, విద్యా కానుక ప్రతి సంవత్సరం వస్తున్నాయి. దీంతో మాకు కాస్త భరోసాగా ఉంది. ఎటువంటి ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా పుస్తకాలు, బ్యాగు, యూనిఫామ్ అందించి మంచి చదువు చెబుతున్నారు. పాఠశాలలు కూడా చాలా పరిశుభ్రంగా ఉన్నాయి.
addComments
Post a Comment