నెల్లూరు, ఆగస్టు 18 (ప్రజా అమరావతి);
శ్రీవారి 'నేత్ర దర్శనం - తిరుప్పావడసేవ'తో పులకించిన నెల్లూరువాసులు
నెల్లూరులో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం తిరుప్పావడసేవ, స్వామివారి నేత్రదర్శనంతో భక్తులు తన్మయంతో పరవశించిపోయారు.
నెల్లూరులోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, ఉదయం 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించారు. అనంతరం ప్రత్యేక సేవగా తిరుప్పావడ సేవను శాస్త్రోక్తంగా చేపట్టారు.
నేత్రదర్శనం విశిష్టత :
ప్రతి గురువారం ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, మొదటి సహస్రనామార్చన, నైవేద్యం తరువాత మూలమూర్తికి అలంకరించిన ఆభరణాలు, నగలను అర్చకులు తొలగిస్తారు. స్వామివారి నొసటిపై పెద్దగా ఉన్న పచ్చ కర్పూరపు నామాన్ని బాగా తగ్గించడంతో శ్రీవారి నేత్రాలు స్పష్టంగా భక్తులకు దర్శనమవుతాయి. అందువల్లే దీనిని నేత్ర దర్శనం అంటారు.
తిరుప్పావడ సేవ - ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు :
ప్రతి గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి అర్చనానంతరం జరిగే నివేదననే తిరుప్పావడసేవ అని, అన్నకూటోత్సవమని అంటారు. ఈ ఘట్టాన్ని నెల్లూరులోని శ్రీవారి నమూనా ఆలయంలో అర్చకులు భక్తుల ఎదుట ఆవిష్కరించారు.
శ్రీస్వామివారికి ఎదురుగా పెద్దపీఠంపై పులిహోర రాశిని ఏర్పాటుచేశారు. పులిహోరతోపాటు టెంకాయ, ఇతర పూజాసామగ్రితో అలంకరించారు. వీటిని నేరుగా గర్భాలయంలోని స్వామివారికి నివేదించారు. ఆ తరువాత భక్తుల చేత సంకల్పం చెప్పించారు. వేదపండితులు వేద పారాయణంతోపాటు శ్రీనివాస గద్యాన్ని పఠించారు.
అంతకుముందు శ్రీవారి మూలవిరాట్ నొసటన వెడల్పుగా గల నామాన్ని తగ్గించి సన్నగా చేశారు. ఈ మొత్తం కైంకర్యమంతా తెరల వెనకనే చేస్తారు. ''శ్రీవారు నేత్రాలు తెరిచిన తర్వాత తొలి చూపులు ఎంతో తీవ్రంగా ఉంటాయి. వీటిని మానవమాత్రులు ఏమాత్రం తట్టుకోలేరు. ఈ కారణంగానే స్వామివారి తీక్షణమైన చూపులు పులిహోర రాశిపై పడేలా చూస్తారు. దీనివల్ల ఆ ఆహారపదార్థాలు పవిత్రత పొందుతాయి.
దేశ ప్రజలందరూ పాడిపంటలతో సుఖంగా ఉండాలని, ఆహారానికి ఎటువంటి ఇబ్బందీ రాకూడదని, సర్వసౌభాగ్యాలు కలగాలని, పాడిపంటలు అభివృద్ధి పొందాలని, ఎటువంటి ఈతి బాధలు కలుగ కూడదని సంకల్పాన్ని చెప్పి తిరుప్పావడ సేవను ఆచరిస్తారు.
అనంతరం 9.30 నుంచి 10 గంటల వరకు రెండో నివేదన, ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల భక్తులకు సర్వదర్శనం ఉంటుంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, న్యూఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ, ఎవిఎస్వో శ్రీ నారాయణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
addComments
Post a Comment