నెల్లూరు, ఆగస్టు 15 (ప్రజా అమరావతి): దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను, ఆదర్శాలను, వారి స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు, విధులను సమర్థవంతంగా నిర్వహించి, ఏ దేశంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా మన దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పాలని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు.
76వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం కలెక్టరేట్లోని వంద అడుగుల జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 రోజులుగా జిల్లావ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో జిల్లా ప్రజలందరూ భాగస్వాములై తమలో ఉన్న దేశభక్తిని చాటార
ని, జిల్లాలోని 8 లక్షల ఇళ్ల పై, అన్ని దుకాణాలు, వాహనాలపై జాతీయ జెండాను ప్రజలు రెపరెపలాడించి జాతీయ జెండా గొప్పదనాన్ని, ఐక్యతా భావాన్ని ప్రదర్శించారన్నారు. మువ్వన్నెల జెండాతో దిగిన ఫోటోను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంలో దేశంలోనే మన జిల్లా ముందువరుసలో నిలవడం గర్వకారణమన్నారు. పరాయి పాలన నుంచి విముక్తి పొందిన భారతావని అన్ని రంగాల్లో రాణిస్తూ ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం, గుర్తింపు పొందిందని, ఎంతో ఘన చరిత్ర గల భారతదేశంలో జన్మించడం మన అదృష్టమన్నారు. ప్రజలందరూ కూడా సమాజ హితం కోసం పాటుపడాలని, దేశం పట్ల భక్తి, గౌరవం కలిగి దేశాభివృద్ధిలో తమ వంతు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు.
తొలుత కలెక్టరేట్లోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మనాథ్, డిఆర్ఓ శ్రీమతి వెంకట నారాయణమ్మ, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ శ్రీ ఏ మహేష్, డిఆర్డిఏ పీడీ శ్రీ సాంబశివారెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి శ్రీ వెంకటేశ్వర ప్రసాద్, ఉపాధి కల్పనాధికారి శ్రీ సురేష్, ఏవో శ్రీ షఫీమాలిక్, కలెక్టరేట్లోని అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment