శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : జెఈవో శ్రీ వీరబ్రహ్మం

    తిరుపతి,  సెప్టెంబ‌రు 12 (ప్రజా అమరావతి);


నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు


శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : జెఈవో శ్రీ వీరబ్రహ్మం


             తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయ‌ని, అధికారులు సమష్టిగా పనిచేసి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని జెఈవో శ్రీ వీరబ్రహ్మం కోరారు. వివిధ విభాగాల అధికారులతో జెఈవో సోమ‌వారం వ‌ర్చువ‌ల్ సమావేశం నిర్వహించారు.


            ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల వాహన సేవలు తిలకించేందుకు విచ్చేసే వేలాది మంది భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, మరుగుదొడ్లు, సూచిక బోర్డులు, అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో ఆర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. పంచ‌మితీర్థానికి ప‌ద్మ‌పుష్క‌రిణిని శుభ్రం చేసి తిరిగి నీటిని నింపాల‌ని ఆదేశించారు. పెద్ద‌సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేసే అవ‌కాశముంద‌ని, ఇందుకనుగుణంగా భ‌ద్ర‌త‌, అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌, తాగునీరు స‌ర‌ఫ‌రా చేయాల‌ని, దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గ‌దులు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. వాహ‌న‌సేవ‌ల కోసం వాహనాలు, రథాల ఫిట్ నెస్‌ను సరి చూసుకోవాలన్నారు. అమ్మవారి ఆలయం, తోళ‌ప్ప గార్డెన్స్, ఫ్రైడే గార్డెన్స్, మాడవీధులు తదితర ప్రాంతాల్లో ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణ చేపట్టాలని, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్య విభాగం ఆధ్వర్యంలో డిస్పెన్స‌రీలు ఏర్పాటు చేయాల‌ని, అంబులెన్సులు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాల‌ని కోరారు. వాహ‌న‌సేవ‌ల్లో వినియోగించే వాహ‌నాల‌కు తండ్ల ప‌టిష్ట‌త‌ను ప‌రిశీలించి, అవసరమైతే కొత్తవి తెప్పించుకోవాల‌ని సూచించారు.


             ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసుకుని తిరుప‌తి నుంచి తిరుచానూరుకు ఎక్కువ బస్సులు నడిపేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. పంచమితీర్థం నాడు ఊరేగింపులో వినియోగించే ఏనుగులకు ముందస్తుగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ఆల‌యం, ఫ్రైడే గార్డెన్స్‌ వ‌ద్ద చ‌క్క‌టి ప‌రిశుభ్ర‌త చర్యలు చేపట్టాలన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వాహన సేవల‌ ముందు ఆక‌ట్టుకునేలా కళాప్రదర్శనలు ఏర్పాటు చేయాలని కోరారు. భద్రత విభాగం అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పంచమీ తీర్థానికి ఎక్కువ మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో,  అన్ని విభాగాలు చెక్ లిస్టు త‌యారు చేసుకుని ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లు చేపట్టాలన్నారు.


            వర్చువల్ సమావేశంలో ఎస్ఇలు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు,  ఈ ఈ లు శ్రీ నరసింహమూర్తి, శ్రీ మనోహర్, డెప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ గుణ‌భూషణ్ రెడ్డి, శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, డిఎఫ్‌వో శ్రీ శ్రీ‌నివాసులు, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.



Comments