నెల్లూరు విద్యార్ధిని త్వరగా కోలుకోవాలి..
- రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
అమరావతి (ప్రజా అమరావతి):
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో చోటుచేసుకున్న దారుణంపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలిక నోట్లో యాసిడ్ పోసిన నిందితుడు ఆపై గొంతు కోసిన చర్య పరమదుర్మార్గమని... ఇలాంటి ఘటనల్ని అందరూ ఖండించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మంగళవారం ఆమె తన కార్యాలయ ఛాంబర్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై స్పందించారు. బాధితురాలిని సకాలంలోనే జిల్లా కలెక్టర్ నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్స అందించారని.. అక్కడ వైద్యుల సూచనమేరకు మెరుగైన వైద్యం నిమిత్తం ఆమెను చెన్నై అపోలో కి తరలించినట్లు వివరించారు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని.. ఆమె వైద్యానికయ్యే ఖర్చంతా ప్రభుత్వం భరిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో నిందితుడికి కఠినశిక్ష పడేలా... బాధిత కుటుంబానికి మహిళా కమిషన్ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని వాసిరెడ్డి పద్మ హామీనిచ్చారు. మీడియా సమావేశం లో ఆమెతో పాటు మహిళా కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి, బూసి వినీత ఉన్నారు.
addComments
Post a Comment