*21న పాలకొండలో జాబ్ మేళా
*
పార్వతీపురం, అక్టోబర్ 17 (ప్రజా అమరావతి) : జాబ్ మేళాను ఈ నెల 21న పాలకొండలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. సోమ వారం స్పందన కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాబ్ మేళా జరుగుతుందన్నారు. 12 కంపెనీలు వస్తున్నాయని 1140 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేస్తున్నాయని తెలిపారు. నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జాబ్ మేళా పోస్టర్ ను విడుదల చేశారు.
*నాడు నేడు పనులకు ఏపిఎంలు*
జిల్లాలో చేపడుతున్న నాడు నేడు పనుల కార్యనిర్వహణ బాధ్యతలు పేదరిక నిర్మూలన సంస్థ సహాయ ప్రాజెక్టు మేనేజర్లు (ఏపిఎంలు) చేపడుతున్నారని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఏపిఎంలకు నాడు నేడు పనులపై మంగళ వారం ఉదయం 9 గంటల నుండి శిక్షణా తరగతులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. నాడు నేడు పనుల కార్యనిర్వహణ వివరాలు పూర్తిగా అందించాలని ఆయన స్పష్టం చేశారు. పనులు పురోగతికి మరింత ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి పూర్తి స్థాయి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారని జిల్లా కలెక్టర్ చెప్పారు.
జిల్లాలో ప్రాదాన్యత మేరకు చేస్తున్న పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. గృహ నిర్మాణాలు, రీ సర్వే, ఇ క్రాప్ వేగవంతం కావాలని ఆయన అన్నారు. స్పందనలో అందిన విజ్ఞాపనలకు నాణ్యమైన పరిష్కారం ఉండాలని చెప్పారు. ఉపాధి హామీలో వేతనదారుల సంఖ్య పెంచాలని అన్నారు. జగనన్న తోడు పథకం క్రింద గ్రౌండింగ్ చేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు - పాఠశాలల విద్యార్థుల అనుసంధానం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అందిన పనులకు తక్షణ మంజూరు జరగాలని ఆయన స్పష్టం చేశారు. సికిల్ సెల్ ఎనీమియా తో బాధపడుతున్న చిన్నారులకు వైద్య పరీక్షలు చేయించి ధృవీకరణ పత్రాలు పొందాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావును ఆదేశించారు.
*సమగ్ర రహదారుల అభివృద్ధి ప్రణాళిక*
జిల్లాలో ముఖ్యంగా ఐటిడిఎ ప్రాంతాల్లో సమగ్ర రహదారుల అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగం అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆయన చెప్పారు. పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులు ఈ నెల 25వ తేదీ నాటికి తుది ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఈ ప్రణాళికలో వాగులు, వంకలుతో సహా వంతెనలు నిర్మించి అనుసంధానం చేయుటకు ఉన్న అన్ని ప్రదేశాలను గుర్తించి పొందుపరచాలని ఆయన చెప్పారు.
addComments
Post a Comment