టీడీపీ అంటే జగన్‌కు వణుకు

 *టీడీపీ అంటే జగన్‌కు వణుకు



*అందుకే అక్రమ అరెస్టులు*


*టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు*


గుంటూరు (ప్రజా అమరావతి) : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రిమాండ్ కు విశాఖ మెట్రోపాలిటన్ కోర్టు తిరస్కరించిన ఘటనపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. అయ్యన్న రిమాండ్ కు కోర్టు తిరస్కరించడంతో పాటు అక్కడికక్కడే అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేశ్ కు బెయిల్ మంజూరు అయిన విషయంపై చంద్రబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయం గెలిచింది..న్యాయమే గెలుస్తుంది అంటూ చంద్రబాబు అన్నారు. ఈ మేరకు అయ్యన్నతోనే తాము ఉన్నామంటూ ఆయన ఓ హ్యాష్ ట్యాగ్ ను కూడా పెట్టారు. 2 సెంట్ల భూమి ఆక్రమణకు అయ్యన్న, ఆయన ఇద్దరు కుమారులు ఫోర్జరీ పత్రాలను సృష్టించారన్న ఆరోపణల కింద గురువారం తెల్లవారుజామున అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేశ్ ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితులిద్దరీ వైద్య పరీక్షలు నిర్వహించి సాయంత్రానికి విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఈ కేసులో నిందితులపై మోపిన ఐపీసీ 467 సెక్షన్ వర్తించదని తేల్చారు. దీంతో నిందితులకు అక్కడికక్కడే బెయిల్ మంజూరు చేశారు. 


*టీడీపీ అంటే జగన్‌కు వణుకు* 


జలవనరులశాఖ ఈఈని బెదిరించి అయ్యన్న కుటుంబ సభ్యులపై తప్పుడు ఫిర్యాదు ఇప్పించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తారుమారుపై సీఐ శంకరయ్య సీబీఐకి తొలుత వాంగ్మూలం ఇచ్చి ప్రభుత్వం నుంచి పదోన్నతి పొందాక వెనక్కి తీసుకున్న విధంగానే జలవనరులశాఖ అధికారి మల్లిఖార్జున రావుతో అయ్యన్న కుటుంబంపై ఫిర్యాదు ఇప్పించారని దుయ్యబట్టారు. అయ్యన్నపాత్రుడు తాత నుంచీ ఆ కుటుంబానికి మచ్చ లేని 60 ఏళ్ల రాజకీయాల చరిత్ర ఉందని గుర్తు చేశారు. భూ దోపిడీ కుటంబం నుంచి వచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అని మండిపడ్డారు.


*పవన్ కల్యాణ్ ఇంటివద్ద రెక్కీ చేస్తారా... బతకనివ్వరా?*


టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు చింతకాయల రాజేష్ లను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంటివద్ద అనుమానాస్పద వ్యక్తుల సంచారంపైనా ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు స్పందించారు. పవన్ కల్యాణ్ ఎక్కడో ఉంటే ఆయన మీద దాడి చేస్తారంట, రెక్కీ చేస్తారంట! ఎవరిని బెదిరిస్తారు మీరు? రాష్ట్రంలో అందరినీ చంపేస్తారా? అందరినీ జైల్లో పెట్టి కొడతారా? టార్చర్ చేస్తారా మీరు?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా రాజేష్ ను కొట్టారు. దీనిపై మాకు సమాచారం అందింది అని మండిపడ్డారు. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. "ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటివి చూస్తే కంపరం కలుగుతుంది, బాధ, ఆవేశం కలుగుతున్నాయి. కానీ సభ్యత అడ్డం వస్తోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్న అధికారులకు చెబుతున్నా. మీరనుకున్నది జరగదు, జరగనివ్వమని చంద్రబాబు స్పష్టం చేశారు.

Comments