నెల్లూరు, నవంబర్ 8 (ప్రజా అమరావతి): వెంకటాచలం సమీపంలోని అటవీ ప్రాంతంలో తాత్కాలికంగా ఉన్న శివాలయానికి శాశ్వత ఆలయాన్ని నిర్మించి, ప్రముఖ పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి
చేస్తానని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం వెంకటాచలం సమీపంలోని అడవిలో వెలసిన శ్రీ దుర్గా భవాని సమేత అభయ లింగేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి దర్శించుకుని, ప్రత్యేకంగా అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతో ప్రాశస్త్యం గల ఆలయం ఇప్పుడిప్పుడే ప్రజాదరణ పొందుతోందని, అటవీ ప్రాంతంలో స్వామి వెలసినందున ఇక్కడ అనేక వ్యయ ప్రయాసలకోర్చి కమిటీ సభ్యులు అనేక అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి అన్ని అనుమతులు పొంది ఈ ప్రాంతంలో నూతన ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తొలుత ఆలయానికి విచ్చేసిన మంత్రికి కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మేళ తాళాలు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొని శివయ్యకు తన స్వహస్తాలతో అభిషేకాలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శ్రీ కొట్టే రామమూర్తి, వైస్ చైర్మన్ శీనయ్య, కమిటీ సభ్యులు జగదీశ్వర్ రావు, నాగిరెడ్డి, చిరంజీవి ఆచారి, వెంకట సుమన్, రవికుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment