రూ.460 కోట్లతో రైల్వే మూడవ లైను*రూ.460 కోట్లతో రైల్వే మూడవ లైను


*


పార్వతీపురం, డిసెంబర్ 24 (ప్రజా అమరావతి): విజయనగరం - టిట్లఘర్ మధ్య నిర్మిస్తున్న రైల్వే మూడవ లైను ప్రాజెక్టులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.460 కోట్ల పనులను చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మూడవ లైను రైల్వే పనులను ఆర్వి ఎన్ఎల్ సహాయ జనరల్ మేనేజర్ సిహెచ్.విష్ణుమూర్తి తో కలిసి జిల్లా కలెక్టర్ సీతానగరం నుండి కొమరాడ మండలం విక్రం పురం, కోటిపాం, పార్వతీపురం బెలగామ్ రైల్వే స్టేషన్ వరకు శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మూడవ లైన్ నిర్మాణంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 44 కిలోమీటర్ల మేర మూడవ లైను వస్తుందని పేర్కొన్నారు. పార్వతీపురం రైల్వే స్టేషన్ ఫ్రంట్ ఎలివేషన్ స్థానిక సంస్కృతి సంప్రదాయాలు పరిగణలోకి తీసుకొని చేపట్టాలని సూచించారు. జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో రైల్వే స్టేషన్ చూడ ముచ్చటగా ఉండాలని ఆయన సూచించారు. మూడవ లైను పనులు రావడం వలన మరికొన్ని పాసింజర్ లు,  ఎక్స్ప్రెస్ ట్రైన్లు వచ్చే అవకాశం ఉంటుందని కలెక్టర్ అన్నారు. తద్వారా జిల్లాకు రైల్వే కనెక్టివిటీ బాగా పెరుగుతుందని,  ఒడిశా, ఛత్తీస్ ఘడ్ ప్రాంతాలతో పాటు విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో ప్రయాణీకులు రైలు ప్రయాణాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. సీతానగరం రైల్వే స్టేషన్ పనులు ఫిబ్రవరి నాటికి పూర్తి చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారని, పార్వతిపురం రైల్వే స్టేషన్ ఎలివేషన్ పనులు వచ్చే ఐదు నెలల్లో పూర్తి కాగలవని చెప్పారు. 2023 జూన్ నాటికి పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులో రాగలదని ఆయన పేర్కొన్నారు.


 ఆర్ వి ఎన్ ఎల్ సహాయ జనరల్ మేనేజర్ సిహెచ్. విష్ణుమూర్తి మాట్లాడుతూ మూడవ లైను రైల్వే పనులు పక్కా ప్రణాళికతో చేపడుతున్నట్లు చెప్పారు. ఈ పనులను మన్యం జిల్లాలో చేపట్టకు జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయని ఆయన చెప్పారు.


విజయనగరం - టిట్లఘర్ మధ్య నిర్మిస్తున్న రైల్వే మూడవ లైను పనులను 265 కిలో మీటర్లు మేర రూ.2335.68 కోట్లతో చేపట్టడం జరుగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 44 కిలో మీటర్లు చేపడుతున్నారు. ఇందులో మేజర్ మూడు బ్రిడ్జిలు, ఆరు ఆర్.యు.బిలు, 135 మైనర్ బ్రిడ్జిలు నిర్మాణం జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో కూనేరు నుండి సీతానగరం వరకు పనులు చేపడుతుందని అన్నారు. పార్వతీపురంలో అదనపు కాలినడక వంతెన, బుకింగ్ కార్యాలయం,  కూనేరు, గుమడ, పార్వతీపుం, సీతానగరం లలో మెరుగైన సౌకర్యాలతో కొత్త స్టేషన్ భవనాలు, రానున్నాయి 


ఈ కార్యక్రమంలో రైల్వే సీనియర్ డిజిఎం ఇ.వి. గురునాధరావు, తాహాసిల్దార్లు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.

Comments