మూడు భాషల" ఫార్ములాతో ప్రజల్లోకి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే రావి

 *- "మూడు భాషల" ఫార్ములాతో ప్రజల్లోకి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే రావి* 


 *- హిందీ, ఇంగ్లీష్, తెలుగులో మాట్లాడుతూ ప్రజలతో మమేకం* 

 *- గుడివాడలో "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" అనూహ్య స్పందన* 

 *- రావికి బ్రహ్మరథం పడుతున్న నియోజకవర్గ ప్రజలు* 


గుడివాడ, డిసెంబర్ 22 (ప్రజా అమరావతి): గుడివాడ నియోజకవర్గంలో మూడు భాషల ఫార్ములా వర్కవుట్ అవుతోంది. వినూత్న తరహాలో ప్రజల్లోకి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అనుకున్న లక్ష్యం నెరవేరుతున్నట్టుగానే కన్పిస్తోంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ ప్రజలతో మమేకమవుతున్న రావి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు రావి నాయకత్వంలో గుడివాడ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న కార్యక్రమం "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" అనూహ్య స్పందన వస్తోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే లక్ష్యంతో రావి నిర్వహిస్తున్న కార్యక్రమాలకు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎంబీఏ వరకు చదువు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్ లో నివశించడం వంటి కారణాలు రావిని పలు భాషల్లో రాణించేలా చేశాయి. మరోవైపు అయన రాజకీయాల్లో కూడా కొనసాగుతుండడం వల్ల ప్రజాసమస్యలను తెలుసుకునే మార్గం సులువైంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలంటే ఎవరికి వచ్చిన భాషలో వారికి అర్ధమయ్యేలా చెబితేనే ప్రయోజనం ఉంటుందని రావి భావించారు. గుడివాడ నియోజకవర్గంలో ఉండే ముస్లిం మైనార్టీలు, ఇతర రాష్ట్రాల నుండి పనుల నిమిత్తం వచ్చి నివశిస్తున్న, స్థిరపడిన వారితో హిందీలో, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు, ఉన్నతాధికారులు, ఇతరులతో ఇంగ్లీష్ లో, స్థానికులతో వారికి తెలిసిన తెలుగులో మాట్లాడుతూ రావి అందరినీ ఆకర్షిస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రావి మాట్లాడుతుండడంతో అన్నివర్గాల ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ముందుకు వస్తున్నారు. అలా ప్రజాసమస్యలన్నీ పూర్తిస్థాయిలో తెలుసుకునే అవకాశం తెలుగుదేశం పార్టీకి లభించింది. ఈ విధంగా గుడివాడ నియోజకవర్గంలోని సమస్యలన్నీ తెలుగుదేశం పార్టీ దృష్టికి వస్తుండడంతో వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించే పనిలో రావి నిమగ్నమయ్యారు. దీనివల్ల రావికి గుడివాడ నియోజకవర్గంపై మంచి పట్టు లభిస్తుండడంతో పాటు ప్రజలతో కూడా మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలను రావి సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ వస్తున్నారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడంతో క్యాడర్ కూడా ఉత్సాహంగా పనిచేస్తోంది. రావి నాయకత్వంలో ఇంతకు ముందు నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను రావి సద్వినియోగం చేసుకుంటూ ప్రజల్లోకి మరింతగా దూసుకువెళ్తున్నారు. తాజాగా నిర్వహిస్తున్న "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమం అంతకు మించిన స్థాయిలో స్పందన వస్తోంది. రావి కూడా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఎంతో కసితో పార్టీని నడిపిస్తున్నారు. నిత్యం చంద్రబాబుపై దుర్భాషలను ఎక్కిపెడుతున్న ఎమ్మెల్యే కొడాలి నానికి చెక్ పెట్టడంపైనే రావి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా ఎమ్మెల్యే కొడాలి నానిపై విమర్శల బాణాలను వదులుతున్నారు. మరోవైపు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూనే ఎంతో సంయమనంతో పార్టీని ముందుకు నడుపుతున్న తీరుకు అధిష్టానం రావికి మంచి మార్కులే వేసిందని టీడీపీలో ప్రచారం జరుగుతోంది.

Comments