పులివెందుల, వైఎస్‌ఆర్ జిల్లా (ప్రజా అమరావతి);
*వైఎస్‌ఆర్ జిల్లాలో సీఎం శ్రీ వైయస్.జగన్ రెండో రోజు పర్యటన.*
*వైఎస్‌ఆర్ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన సీఎం.*
*పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం.*
*నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ బస్టాండును ప్రారంభించిన సీఎం.*
*అనంతరం ప్రజలనుద్దేశించి బహిరంగసభలో మాట్లాడిన సీఎం.*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...:*
*అభివృద్ధి బాటలో పులివెందుల...*
ఈ రోజు పులివెందులను ఆదర్శ నియోజకవర్గంగా చేయడంలో భాగంగా దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో పులివెందులను అభివృద్ధి బాటలో నడిపించే కార్యక్రమంలో భాగంగా అడుగులు పడ్డాయి. వాటికి సంబంధించి గతంలో మనం వేసిన శంకుస్ధాపనలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ రోజు ప్రారంభించడానికి సిద్దం అవుతున్నాయి.
*నెగిటివ్ మీడియా ప్రచారం....*
ఈ ప్రక్రియలో భాగంగానే అత్యాధునిక వసతులతో కూడిన వైయస్సార్ బస్ టెర్మినల్‌ని కూడా ప్రారంభించాం. ఆశ్చర్యాన్ని కలిగించే విషయమేమిటంటే... ఇక్కడ కట్టిన బస్ టెర్మినల్ చాలా చక్కగా మిగిలిన బస్‌టెర్మినల్స్ అన్నింటికీ ఇదొక రోల్‌మోడల్‌గా ఉండేటట్టుగా కట్టాం.
ఒకవైపు ఇక్కడ వేగంగా పనులు జరుగుతున్నాయని తెలిసినప్పటికీ కూడా.. ఈ బస్ టెర్మినల్‌కి సంబంధించి రకరకాల మాటలు విన్నాం. కొద్ది రోజుల కిందట నేను సోషల్ మీడియాలో ఒక మాట విన్నాను. గతంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పులివెందులలో బస్‌టెర్మినల్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నామని చెప్పాడు. వేగంగా ఇక్కడ పనులు జరుగుతుంటే.. అవి కనిపిస్తున్నా కూడా ఇటువంటి పెద్ద మనుషులు, వీరికి తోడు ఒక నెగిటివ్ మీడియా ఇలాంటి మాటలు చెప్పారు. మన ఖర్మ ఏమిటంటే... ఇవాళ మనం యుద్ధం చేస్తున్నది ఒక తెలుగుదేశం పార్టీతోనే, చంద్రబాబు నాయుడుగారుతోనే కాదు. మనం ఈరోజు ఒక చెడిపోయిన వ్యవస్ధతో యుద్ధం చేస్తున్నాం. ఆ వ్యవస్ధ ఏమిటంటే... ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీళ్లతో పాటు ఒక దత్తపుత్రుడు.
వీళ్లందరూ కూడా ఎలా తయారు అయ్యారంటే.. ఒక గ్లాసులో మూడు వంతులు నీళ్లుంటాయి. అటువంటి గ్లాసుని చూపించినప్పుడు ఇంకా పావలా భాగం పైన ఇంకా నీళ్లు నిండని భాగం చూపించి.. గ్లాసంతా నిండలేదు. నీళ్లే లేవు అని చూపించే కార్యక్రమం ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది. అంతే తప్ప మూడువంతులు నిండిందని చూపించరు.
*వై నాట్ 175....*
ఇటువంటి దిగజారిన ఈ వ్యవస్ధలో మీ బిడ్డ ఈ రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు కూడా చెబుతున్నాడు... గతంలో 151 వచ్చాయి. రేపు జరగబోయే ఎన్నికల్లో వై నాట్ 175 అని చెప్పి ఈరోజు మీ బిడ్డ పిలుపునిచ్చే పరిస్థితిలో ఉన్నాడు అంటే...దానికి కారణం మీ బిడ్డకు మీరు తోడుగా ఉండి.. రాష్ట్రంవైపు నువ్వు చూడు, ఈ ప్రాంతం మేం చూసుకుంటాం అని మీరు ఇచ్చిన భరోసాయే. అందుకే ఈ రోజు మీ బిడ్డ ఈ రాష్ట్రం వైపు చూడగలుగుతున్నాడు.
*పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకూ....*
నిన్ననే కమలాపురంలో మాట్లాడుతూ... నేరుగా బటన్ నొక్కి ఎంత సొమ్ము మనం ప్రతి ఇంటికి చేర్చగలిగాం ? నేరుగా బటన్ నొక్కి లంచాలు, వివక్షకు తావులేకుండా ప్రతి ఇంటికి ఇవ్వగలిగాం అన్నది కమలాపురం నియోజకవర్గంలో వివరిస్తూ చెప్పాను. నేను కమలాపురంలో చెప్పిన మాట రాష్ట్రంలో ప్రతిఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. పులివెందుల నుంచి మొదలుపెడితే ఇచ్చాపురం వరకు కూడా అందరూ ఆలోచన చేయాలి. మరి గతంలోనూ ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రానికి ఒక బడ్జెట్. మరి ఇప్పుడు అదే రాష్ట్రం, అదే బడ్జెట్. అప్పుల పెరుగుదల చూస్తే.. అప్పటికన్నా ఇప్పుడు అప్పుల్లో పెరుగుదల శాతం తక్కువ.
మరి అప్పుల పెరుగుదల కూడా అప్పుడే ఎక్కువ. మరి అప్పుడు గత పాలకులు ఇవాళ మీ బిడ్డ చేస్తున్నట్టుగా ఇన్ని స్కీంలు ఎందుకు ఇవ్వలేకపోయారు. ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం ఎందుకు చేయలేకపోయారు. దీని గురించి పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకూ ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. అప్పుడే అదే రాష్ట్రం, అదే బడ్జెట్. ఇప్పుడూ అదే రాష్ట్రం అదే బడ్జెట్. మార్పు ఏమిటంటే... కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. కేవలం ముఖ్యమంత్రి మారడంతో ఈ రోజు పేదల తలరాతలన్నీ మారుతున్నాయి. రైతుల తలరాతలు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతల తలరాతలు, చదువుకుంటున్న పిల్లల తలరాతలూ మారుతున్నాయి. కారణమేమిటన్నది ప్రతి ఒక్కరూ కూడా లోతుగా ఆలోచన చేయాలి.
కారణం ఈ రోజు వ్యవస్ధలో ఎక్కడా వివక్ష లేదు. ఎక్కడా లంచాలు లేవు. చివరకు మనకు ఓటు వేయని వారికి కూడా ఈ రోజు అర్హత ఉంటే వారికి కూడా మంచి చేసే పరిస్థతి ఈ ప్రభుత్వంలో కనిపిస్తోంది.
ఈ రోజు రూ. 3 లక్షల కోట్లకు పైగా డీబీటీ, నాన్ డీబీటీ విధానంలో ప్రతి ఇంటికి చేరుస్తున్నాం. రూ.1.71 లక్షల కోట్లు కేవలం బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే పరిíస్ధితి ఉంది. ప్రతి అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరుగుతుందన్నది ఆలోచన చేయాలని పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకూ ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నాను.
*రూ.125 కోట్లతో పులివెందులలో అభివృద్ధి పనులు.....*
ఇక ఈ రోజు పులివెందులలో దాదాపుగా రూ.125 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశాను. పులివెందుల రింగ్‌రోడ్డులో ఐదు జంక్షన్‌ల సుందరీకరణ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేశాం. విజయ హోమ్స్‌లో ఉన్న జంక్షన్‌లో ఆరోగ్యపథం పేరుతో ప్రారంభోత్సవం చేశాం. పులివెందుల కదిరి జంక్షన్‌లో ప్రజా పథం థీమ్‌తో ప్రారంభోత్సవం చేశాం. బొగ్గుడుపల్లె సర్కిల్‌లో పల్లె పథం కాన్సెప్ట్‌తోనూ చేశాం. ఇలా ఐదు జంక్షన్‌లలో ప్రతి జంక్షన్ కూడా పులివెందులకు వచ్చి.. పులివెందులలో నాలుగు కూడలి జంక్షన్ ఈ మాదిరిగా ఉందని రాష్ట్రం, దేశమంతా చూడగలిగేలా ఆ రోడ్లను చూపించగలుగుతున్నాం.
అన్ని హంగులతో విస్తరించిన 100 అడుగులు కదిరి రోడ్డును కూడా ప్రారంభించాం. నేను ఆ రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్లి చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా మనం పులివెందులలోనే ఉన్నామా ? లేదా ఏదైనా పెద్ద నగరంలో ఉన్నమా ? అన్నట్టు ఆ రోడ్డు చాలా బాగుంది. ఈ రోడ్డు చాలా బాగా చేసారు. దీన్ని ఆదర్శంగా చేసుకుని పులివెందులలోని అన్ని పెద్ద రోడ్లు అదే మాదిరిగా తయారు కావాలని అధికారులకి చెప్పాను.
పట్టణ ప్రజలకు ఆధునాతన కూరగాయల మార్కెట్ కూడా ప్రారంభించాం. ప్రజలు మానసిక ఉల్లాసం పొందేందుకు డాక్టర్ వైయస్సార్ మెమోరియల్ పార్క్‌ను కూడా ఇప్పుడే ప్రారంభించాం. మరోవైపు ప్రజల చిరకాల కోరిక అయిన రాయలాపురం బ్రిడ్జిని కూడా అధునాతన హంగులతో ప్రారంభించుకున్నాం.
దీని తర్వాత నాడు–నేడులో పులివెందుల పట్టణంలో అహోబిలపురంలో ఉన్న స్కూల్ కూడా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఆ స్కూల్ చూస్తే.. ఈ మాదిరిగా స్కూళ్లు అన్నీ ఉండాలన్నరీతిలో రూపుదిద్దుకుంది. నాడు నేడు అన్నది ఏ మాదిరిగా మార్పు చేస్తుందన్నది ఈ స్కూళ్లను చూస్తే... నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దడాని కోసం గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను కూడా ప్రారంభించుకుంటున్నాం. అదే విధంగా యూజీడీ పనుల్లో భాగంగా 10 ఎంఎల్‌డి ఎస్టీపీని కూడా ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు జరుగుతున్న ప్రారంభోత్సవాలే కాకుండా.. 2019, 2020, 2021 ఈ మూడు సంవత్సరాలుగా మనం చేస్తున్న శంకుస్ధాపనలన్నీ కూడా శరవేగంగా అడుగులు మందుకు పడుతున్నాయి.
*ఇందులో కొన్ని ముఖ్యమైన పనులకు సంబంధించి.*.
వాటి పురోగతికి సంబంధించిన కాస్త సమాచారం ఇస్తాను.
పక్కనే వైయస్సార్ మెడికల్ కాలేజీ కనిపిస్తోంది. రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిర్మాణంలో భాగంగా మెడికల్ కాలేజీ టీచింగ్ ఆసుపత్రి మరో ఆరు నెలల్లో జూలై 2023 నాటికి ప్రారంభించడం జరుగుతుంది. అదే విధంగా డిసెంబరు 2023 నాటికి ఏకంగా మెడికల్ కాలేజీని కూడా ప్రారంభిస్తాం.
*సాగు నీటి పనులూ సాకారం దిశగా......*
జీఎన్‌ఎస్‌ఎస్ ప్రధాన కాలువ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువకు నీటి ఎత్తిపోతల పధకం డిసెంబరు 2023 నాటి కల్లా కాలేటి వాగు రిజర్వాయరులో నీటిని నింపి, చక్రాయపేట మండలంలోని 43 చెరువులకు నీటిని ఇస్తాం. అటునుంచి రాయచోటి, తంబల్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో కూడా నీళ్లందించే కార్యక్రమానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి.
చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు నుంచి ఎర్రబల్లి చెరువుకు, అక్కడ నుంచి యూసీఐఎల్ పరిధిలోని గ్రామాలకు నీటి ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి జూన్ 2023 నాటికి ఎర్రబల్లి చెరువుకు, మార్చి 2024 నాటికి గిడ్డంగివారి పల్లె ట్యాంకుకు, మరియూ యూసీఐఎల్ పరిధిలోని గ్రామాలకు నీటి సరఫరా చేసే కార్యక్రమం కచ్చితంగా జరుగుంది.
అల్వలపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి నవంబరు 2023 నాటికి పనులు పూర్తి చేసి వేముల మరియు వేంపల్లె మండలాలలో కల పీబీసీ కెనాల్ టెయిల్ ఎండ్ గ్రామాలకు పూర్తిగా ఆయుకట్టు మొత్తం స్థీరీకరణ జరుగుతుంది.
*పులివెందుల నియోజకవర్గం– సమగ్ర నీటి సరఫరా..*
అదే విధంగా పులివెందుల నియోజకవర్గంలో సమగ్ర నీటిసరఫరా కొరకు దాదాపు రూ.480 కోట్లతో చేపడుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. అక్టోబరు 2023 నాటికి నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా ఇది అందుబాటులోకి వస్తుంది.
పులివెందుల మరియు వేంపల్లె అండర్‌గ్రౌండ్ పనులు(యూజీడీ నిర్మాణాలు) కూడా రూ.192 కోట్లతో జరుగుతున్నాయి. పులివెందుల యూజీడీ పనులు మార్చి 2023 నాటికి, వేంపల్లె యూజీడీ పనులు అక్టోబరు 2023 నాటికి పూర్తవుతాయి.
పులివెందుల పట్టణంలో సమగ్ర నీటి సరఫరా పథకం... దీనికి సంబంధించి పులివెందుల టౌన్‌కు జూన్ 2023 నాటికి ప్రజలందరికీ పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ప్రతి ఇంటికి కుళాయితో పాటు నీళ్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది.
వేంపల్లెలో ప్రధాన రహదారుల విస్తరణ... దీనికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. రోడ్ల విస్తరణ మరియు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ప్రారంభించి డిసెంబరు 2023 నాటికి ఇది కూడా పూర్తవుతుంది.
*ఇంటిగ్రేడెట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్..*
పులివెందులలో క్రీడా సముదాయాలకు సంబంధించిన ఇంటిగ్రేడెట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇది మార్చి 2023 నాటికి క్రీడాకారులకు ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. పులివెందులో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మరియు వేంపల్లెలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సంబంధించి.. ఈ విద్యా సంవత్సరం నుంచే పులివెందులలో మహిళా డిగ్రీ కళాశాల ఇప్పటికే ప్రారంభించాం. రూ.20 కోట్లతో వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల పనులు కూడా డిసెంబరు 2023 నాటికి పూర్తి చేస్తాం.
*స్కిల్ ట్రైనింగ్ అకాడమీ....*
నైపుణ్య అభివృద్ధి కేంద్రానికి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మార్చి 2023 నాటికి పూర్తవుతుంది.
ఇక సిటీ సెంట్రల్... పులివెందులలో ఒక మాల్. సిటీలలో మాదిరిగానే... ఇక్కడ కూడా ఒక మాల్ కట్టే కార్యక్రమం జరుగుతుంది. రూ.87 కోట్లతో పనులు జరుగుతున్న ఈ మాల్ కూడా డిసెంబరు 2023 నాటికి అందుబాటులోకి వస్తుంది.
రాణితోపుకి సంబంధించి నగరవనం అభివృద్ధి కార్యక్రమం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి 2023 నాటికి అవి కూడా అందుబాటులోకి వస్తాయి. మరోవైపు ఇడుపుల పాయలో వైయస్సార్ మెమొరియల్ అభివృద్ధి పనులు కూడా జూన్ 2023 నాటికి పూర్తవుతాయి. పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కలిగించేందుకు ఉరిమెల్ల సరస్సు అభివృద్ధి పనులు కూడా జూన్ 2023 నాటికి పూర్తవుతాయి. గండి ఆంజనేయ స్వామి దేవస్ధానం పునర్నిర్మించే కార్యక్రమం కూడా జూన్ 2023 నాటికి పూర్తవుతుంది. ఇక నుంచి ప్రతి మూడు నెలలకొకసారి శంకుస్ధాపనలు కాదు... ప్రారంభోత్సవాలు చేసుకుంటూ పోయే కార్యక్రమాలు జరుగుతాయి.
*ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణ దిశగా..*
ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి మంచి రోడ్లు తీసుకొచ్చే కార్యక్రమం కూడా వేగంగా జరుగుతుంది. పులివెందుల నుంచి బెంగుళూరుకి ప్రయాణం సులభతరం చేసేందుకు ఏకంగా రూ.1080 కోట్లతో ముద్దునూరు నుంచి బి.కొత్తపల్లి వరకు మరియు రూ.840 కోట్లతో బి.కొత్తపల్లి నుంచి గోరంట్ల వరకూ నాలుగు వరుసల రహదారి నిర్మాణం పనులకు సంబంధించి ల్యాండ్ అక్విజేషన్ పనులు కూడా చివరిదశకు చేరుకున్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు కూడా ప్రారంభమవుతాయి. అదే విధంగా నాలుగు వరుసలే కాకుండా ఆరు వరుసలతో బెంగుళూరు నుంచి పులివెందుల మీదుగా ఏకంగా విజయవాడకు జాతీయ రహదారి నిర్మాణం కూడా రూ.13వేల కోట్లతో సిక్స్‌లైన్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులకు సంబంధించి ల్యాండ్ అక్విజేషన్ కూడా దాదాపు చివరి దశకు వచ్చింది. ఇందులో 14 ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు పిలిచే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 10 ప్యాకేజీలకు సంబంధించిన టెండర్లను పిలిచారు. వీటితో రాబోయే రెండు సంవత్సరాలలో గణనీయమైన మార్పులు కనిపించబోతున్నాయి. ఏకంగా పులివెందులను మంచి సిటీ మాదిరిగా తీసుకెళ్లే పరిస్థితులలోకి పోగలుగుతాం. మంచి ఆదర్శ నియోజకవర్గంగా పులివెందుల అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను.
దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డకు ఇదే మాదిరిగా ఉండాలని.... మీకు ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ పేరుపేరుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.
addComments
Post a Comment