ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు క్రమం తప్పకుండా రక్త పరీక్షలు నిర్వహించాలి

 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు క్రమం తప్పకుండా రక్త పరీక్షలు నిర్వహించాలి 



పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు


నరసరావుపేట, ఫిబ్రవరి 01, (ప్రజా అమరావతి) : జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలలో చదువుతున్న 19 సంవత్సరాల లోపు విద్యార్థిని లకు ప్రతినెల క్రమం తప్పకుండా రక్త పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ శివశంకర్ లోతేటి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక లింగం గుంట్ల వద్ద ఉన్న శంకర్భారతిపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల లో వివిధ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న రెసిడెన్షియల్ పాఠశాల అధికారులతో(hwo, aswo) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారుగా 12 వేల మంది రక్తహీనత ఉన్న పిల్లలను గుర్తించడం జరిగిందని వారిపై దృష్టి పెట్టి రక్తహీనతను తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రక్తహీనత స్థాయిని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రక్తహీనత తీక్షణంగా ఉన్న వారికి సంవత్సరం పాటు రోజు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు  వాడడంతో పాటు డాక్టర్ పర్యవేక్షణలో బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ జరగాలని అదేవిధంగా మోడరేట్ మరియు మైల్డ్ గా రక్తహీనత ఉన్నవారికి రోజు ఒకటి చొప్పున ఐరన్ పోలిక్ యాసిడ్ టాబ్లెట్లు వాడాలని ఆయన సూచించారు. తద్వారా 19 సంవత్సరాల వయసులోపు ఆడపిల్లలలో రక్తహీనత నివారించాలన్నారు. క్రమం తప్పకుండా రక్త పరీక్షలు నిర్వహించి వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినప్పుడు ఆయా రిజిస్టర్ను పరిశీలించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయా రెసిడెన్షియల్ పాఠశాలలో అందిస్తున్న పౌష్టికాహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధన మేరకు మెనూ ప్రకారం భోజన వసతి కల్పిస్తున్నారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్చి నెలలో రానున్న పదవ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను ఇప్పటినుంచే సన్నద్ధం చేయాలని, పదవ తరగతి పరీక్షలను కఠినంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. పదవ తరగతిలో ప్రతిభగల విద్యార్థులను గుర్తించి భవిత కార్యక్రమం ద్వారా వారికి పై చదువులు చదువుకునే విధంగా అవగాహన కల్పించడంతోపాటు తగు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం ఎక్కడైనా ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లయితే ఉపాధ్యాయుల నియామకానికై ప్రతిపాదన లు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో పరిశుభ్రంగా ఉంచడంతోపాటు క్రమ పద్ధతిలో నిర్వహించుకోవాలని విద్యార్థులలో పరిశుభ్రత పై అవగాహన పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటప్పయ్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఓబుల నాయుడు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి శోభారాణి, గురుకుల పాఠశాల జిల్లా కోఆర్డినేటర్ శాంతి, విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారిణి సువార్త, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అధికారిని వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయస్థాయి ప్రతిభ అన్వేషణ పరీక్ష పై మోడల్ టెస్ట్ పేపర్ ను విడుదల చేశారు.



Comments