నాయీ బ్రాహ్మ‌ణుల‌కు దేశ చ‌రిత్ర‌లోనే అరుదైన గౌర‌వం ఇచ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం

 *నాయీ బ్రాహ్మ‌ణుల‌కు దేశ చ‌రిత్ర‌లోనే అరుదైన గౌర‌వం ఇచ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం


*

*ఉప ముఖ్యమంత్రి & రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ*


అమరావతి, మార్చి 16 (ప్రజా అమరావతి): నాయీ బ్రాహ్మణులకు దేశ చరిత్రలోనే అరుదైన గౌరవం జగన్ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి & దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. దేవ‌దాయ, ధర్మాదాయ శాఖ ప‌రిధిలోని ఆల‌యాల ట్ర‌స్టు బోర్డు స‌భ్యుల నియామ‌కాల్లో నాయీ బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం నుంచి ఒక‌రికి త‌ప్పనిస‌రిగా స్థానం క‌ల్పించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. గురువారం సాయంత్రం వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయంలోని తన చాంబరుకు  నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య ఆధ్వర్యంలో వచ్చిన రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘ నేతలను ఆయన సాదరంగా ఆహ్వానించారు. 


ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ అనాదిగా ఆల‌యాల వ్య‌వ‌స్థ‌లో నాయి బ్రాహ్మణులకు విడ‌దీయ‌రాని బంధం ఉందని పేర్కొన్నారు. ఆల‌యాల్లో భ‌జంత్రీలుగా, క్షుర‌కులుగా, ప్ర‌త్యేక ఉత్స‌వాల స‌మ‌యంలో స్వామివారి ప‌ల్ల‌కీ సేవ‌ల్లో నాయీ బ్రాహ్మ‌ణులు పాలుపంచుకుంటున్నార‌ని గుర్తు చేశారు. ఆల‌యాల్లో ప‌లు కార్య‌క‌లాపాల్లో సేవ‌లందించే త‌మ‌కూ పాల‌క‌వ‌ర్గాల్లో చోటు క‌ల్పించాల‌ని నాయీ బ్రాహ్మ‌ణులు చాలా ఏళ్లుగా కోరుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న పాద‌యాత్ర సంద‌ర్భంగా నాయీ బ్రాహ్మ‌ణుల‌కు ఈ అంశంపై సానుకూల హామీ ఇచ్చారన్నారు.  వైఎస్సార్‌సీపీ నిర్వ‌హించిన బీసీ గ‌ర్జ‌న స‌భ‌ల్లోనూ దీనిపై ప్ర‌త్యేకంగా చ‌ర్చ జ‌రిగిందని, ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తూ దేవ‌దాయ శాఖ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ తెచ్చి ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందన్నారు.


హైకోర్టు ఇటీవ‌ల వెలువ‌రించిన తీర్పు ప్ర‌కారం.. రూ.5 ల‌క్ష‌ల‌కు పైగా ఆదాయం వ‌చ్చే ఆల‌యాల‌కే దేవ‌దాయ శాఖ ట్ర‌స్టు బోర్డుల‌ను నియ‌మించే అవ‌కాశం ఉందని ఆయన తెలిపారు.  రాష్ట్రంలో అలాంటి ఆల‌యాలు 1,234 ఉన్నాయని, వాటిలో ఇప్ప‌టికే ప‌లు ఆల‌యాల‌కు ట్ర‌స్టు బోర్డు నియామ‌కాలు పూర్త‌యిన‌వాటిని మిన‌హాయిస్తే.. మ‌రో 610 ఆల‌యాల‌కు కొద్ది రోజుల్లో ట్ర‌స్టు బోర్డులో నాయీ బ్రాహ్మణులకు స్థానం క‌ల్పించే అవ‌కాశ‌ముందన్నారు.


అనంతరం నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధపటం యానాదయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం హ‌యాంలో తాము అవ‌మానాల‌ను ఎదుర్కోగా.. నేడు త‌మ‌కు స‌ముచిత స్థానం ద‌క్కింద‌ని పేర్కొన్నారు.  నాయీ బ్రాహ్మ‌ణుల‌కు దేశ చ‌రిత్ర‌లోనే అరుదైన గౌర‌వం అందించ‌డం ద్వారా జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌మ‌ను మ‌రో మెట్టు ఎక్కించింద‌ని నాయీ బ్రాహ్మ‌ణ సంఘాల రాష్ట్ర నేత‌లు గుంటుప‌ల్లి రామ‌దాసు పలువురు నాయీ  బ్రాహ్మణ సంఘ నాయకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.


రాష్ట్ర దేవాదాయ, ధర్మాధాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు కనీస కమిషన్ అందే విధంగా మార్గదర్శకాలను నిర్థేశిస్తూ ప్రభుత్వం జారీచేసిన  జి.ఓ.ఎంఎస్.నెం.110, తే.13.03.2023దీ ను ఉప ముఖ్యమంత్రి కొట్టుసత్యన్నారాయణ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధపటం యానాదయ్యకు అందజేస్తూ బీసీల‌కు ఇచ్చిన మ‌రో హామీని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నెర‌వేర్చారన్నారు. 

                                                                                                                                                                                     

Comments