తాడేపల్లి (ప్రజా అమరావతి);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ APNRTS రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత, అభివృద్దే ధ్యేయంగా సంవత్సరంలో 365 రోజులు 24/7 పనిచేస్తుంది. వివిధ దేశాలలో ఇబ్బందులకు గురైన సందర్భాల్లో రాష్ట్రవాసులకు APNRTS అండగా నిలుస్తున్న విషయం విదితమే.
ఈ నేపథ్యంలో, అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో మరణించిన ఏలూరు జిల్లాకు చెందిన శ్రీ వీర సాయేష్ దురదృష్టకర మృతి గురించి APNRTS సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే, వార్డ్ సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్ల ద్వారా సాయేష్ కుటుంబసభ్యుల వివరాలను కనుగొంది. వారు అందించిన ఫోన్ నంబర్లకు APNRTS 24/7 హెల్ప్ లైన్ టీమ్ ఫోన్ చేసి సంబంధిత వివరాలన్నింటినీ సేకరించింది. USA నుండి సాయేష్ భౌతికకాయాన్నిరాష్ట్రప్రభుత్వం ద్వారా స్వదేశానికి రప్పించేందుకు వీలుగా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాతో మాట్లాడటానికి పాస్‌పోర్ట్ కాపీ మరియు ఇతర పత్రాలను అడగడం జరిగింది.
అయితే, సాయేష్ కుటుంబ సభ్యులు... మృతదేహాన్ని భారతదేశం తీసుకురావడానికి తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ద్వారా సహాయం అందుతోందని తెలియజేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం కావాలంటే APNRTS ద్వారా తీసుకుంటామని అన్నారు.
APNRTS బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ... గమ్యస్థాన విమానాశ్రయం నుండి సాయేష్ పార్థివదేహాన్ని వారి కుటుంబానికి చేర్చడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. సాయేష్ భౌతికకాయం ఒహియో రాష్ట్రంలో స్థానిక లాంఛనాలు పూర్తయిన తర్వాత రెండు రోజుల్లో భారతదేశం చేరుకునే అవకాశం ఉందని APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి తెలిపారు.
addComments
Post a Comment