అంబేడ్కర్ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన: ఆర్థిక మంత్రి బుగ్గన





*అంబేడ్కర్ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన: ఆర్థిక మంత్రి బుగ్గన


*


*రూ.250 కోట్లపైన ఖర్చుతో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం త్వరలోనే  ప్రారంభం*


అమరావతి, ఏప్రిల్,14 (ప్రజా అమరావతి); డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.నవతరానికి  అంబేడ్కర్ ఆశయం, స్ఫూర్తిని నింపేందుకోసం ప్రభుత్వం 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని రూ.250 కోట్లకు పైగా ఖర్చు పెట్టి త్వరలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనుందని మంత్రి స్పష్టం చేశారు.డోన్ లోని మంత్రి స్వగృహంలో అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా చిత్రపటానికి మంత్రి బుగ్గన పుష్పాంజలి ఘటించారు. 


నోబెల్ బహుమతి పొందిన ప్రొఫెసర్ అమర్త్య సేన్.. అంబేడ్కర్ ని 'ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్'గా సంబోధించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాతగానే కాక 1951లో ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాను స్థాపించిన మేధావిగా సుపరిచితులన్నారు. ఆయన నిర్దేశించిన మార్గదర్శకాలు , ఆలోచనల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడంలో అంబేడ్కర్ కీలక పాత్ర పోషించారన్నారు. సకాలంలో సరైన చర్య తీసుకుంటే.. దాని ఫలితం పది కాలాల పాటు నిలుస్తుందన్న అంబేడ్కర్ ఆలోచనలను ఆచరణలో పెడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకువెళుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన పేర్కొన్నారు.


అనంతరం  ప్యాపిలి మండలం హుసేనాపురంలోని వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణ పనులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు.



Comments