*- చంద్రబాబు ద్వారానే అంబేద్కర్ రాజ్యాంగం అమలు సాధ్యం*
*- టీడీపీ సీనియర్ నేత వెనిగండ్ల రాము*
*- గుడివాడలో ఘనంగా అంబేద్కర్ జయంతి*
*- కేక్ ను వెనిగండ్లకు తినిపించిన చంద్రబాబు*
గుడివాడ, ఏప్రిల్ 14 (ప్రజా అమరావతి): భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకే సాధ్యమవుతుందని టీడీపీ సీనియర్ నేత వెనిగండ్ల రాము అన్నారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడలోని వీకేజర్, వీఎన్బీ అండ్ ఏజేకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆవరణలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు చంద్రబాబు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ముఖ్యనేతలు కొనకళ్ళ నారాయణ, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జి, శిష్ట్లా లోహిత్ తదితరులు హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు చంద్రబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబ్కేదర్ జయంతి కేక్ ను కట్ చేసి వెనిగండ్లకు చంద్రబాబు తినిపించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య అధ్యక్షతన జరిగిన సభలో వెనిగండ్ల రాము మాట్లాడారు. చంద్రబాబు సమక్షంలో మాట్లాడేందుకు వెనిగండ్ల రాగా పెద్దఎత్తున కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. కొద్ది నిమిషాల పాటు కార్యకర్తల హర్షద్వానాలు మిన్నంటాయి. పెద్దలను గౌరవించడం మన సాంప్రదాయమంటూ వారందరినీ వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కార్యకర్తలంతా ఆనందోత్సాహాలతో పెద్దగా అరుస్తుందడంతో అతి కష్టం మీద వెనిగండ్ల వారందరినీ అదుపు చేశారు. అనంతరం వెనిగండ్ల రాము తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దురదృష్టవశాత్తూ అమలు కావడం లేదన్నారు. వచ్చే ఏడాది చంద్రబాబు నాయకత్వంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రానుందని చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని చంద్రబాబు అమలు చేస్తారని తెలిపారు. అంతకు ముందు పాస్టర్లతో జరిగిన సమావేశంలోనూ చంద్రబాబుతో కలిసి వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెనిగండ్ల మాట్లాడుతూ గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పాస్టర్లకు చేసిందేమీ లేదన్నారు. కానీ పాస్టర్లకు అన్నీ ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. జగన్మోహనరెడ్డి చేసే మోసాలను ఇప్పటికైనా గుర్తించాలన్నారు. చంద్రబాబు సభలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ప్రజల్లో వచ్చిన మార్పునకు ఇదే సంకేతమన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అందాల్సిన నిధులను దారి మళ్ళిస్తున్నారన్నారు. పిల్లల భవిష్యత్తును అన్నివిధాలా నాశనం చేశారన్నారు. తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సమయం వచ్చినపుడు అన్నింటికీ సమాధానం చెబుతామన్నారు. దళితుల అభ్యున్నతికి చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. గుడివాడ టీడీపీలో అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని, ఎటువంటి సమన్వయ లోపం లేకపోవడం వల్లే చంద్రబాబు పర్యటన విజయవంతమైందని వెనిగండ్ల రాము చెప్పారు.
addComments
Post a Comment