ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా
విజయవాడ (ప్రజా అమరావతి);
• రేపే ఎస్ఎస్సీ ఫలితాలు ...(మే 6 వ తేదీ )
• రికార్డు సమయంలో పరీక్షలు జరిగిన 18 రోజుల్లోనే ఫలితాలు
• ఉపాధ్యాయులపై యాప్ ల భారం తగ్గిస్తున్నాం
• తక్కువ ఫలితాలు వచ్చిన విద్యా సంస్థలపై ప్రత్యేక శ్రద్ధ
• ఒకే గొడుగు కిందకు టీచర్ సర్వీసులు
• త్వరలోనే బదిలీలపై నిర్ణయం
• అవసరమైతే బదిలీలపై ప్రత్యేక కోడ్ ను తెస్తాం
• పాఠశాలలు ప్రారంభమైన 2-3 రోజుల్లోనే జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ
• ప్రతి మండల కేంద్రంలోనూ జగనన్న విద్యా కానుక - వస్తువుల ప్రదర్శన
• టీచర్లకు నిరంతర శిక్షణా కార్యక్రమాలు
• ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన మంత్రి బొత్స సత్యనారాయణ
విజయవాడ, మే 5,
పాఠశాలల్లో విద్యాబోధన పైనే ఉపాధ్యాయులు పూర్తిగా శ్రద్ధ చూపేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అటెండెన్సు, పాఠశాలల నిర్వహణ తదితర అంశాల్లో టీచర్ల ద్వారా వివిధ యాప్ లలో నమోదు చేయాల్సిన సమాచారాన్ని తగ్గిస్తున్నామని, ఇలా తగ్గించిన అంశాలను ఆయా స్థానిక గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహించాలని నిర్ణయించామని వెల్లడించారు. వేసవి సెలవులు పూర్తి అయి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం లోగా తీసుకోవాల్సిన చర్యలు, రూపొందించాల్సిన కార్యాచరణ, టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు , నాడు నేడు కార్యక్రమ పురోగతి, జగన్న విద్యా కానుక కిట్ల పంపిణీ తదితర అంశాలపై టీచర్ల యూనియన్ల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్, విద్యా శాఖ కమిషనర్ (ఇన్ ఫ్రా) కాటమనేని భాస్కర్, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తదితర ఉన్నతాధికారులతో కలిసి సుదీర్ఘంగా నిర్వహించిన ఈ సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. మెరుగైన విద్యా విధానాలపై టీచర్ల యూనియన్లతో చర్చించామన్నారు. యాప్ ల వల్ల తమ టైం అంతా దుర్వినియోగం అవుతోందన్న టీచర్ల ఆవేదనను అర్ధం చేసుకుని యాప్ ల భారాన్ని తగ్గించేలా ప్రభుత్వం తీసుకోదలచిన చర్యలపై సంఘాలు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశాయని తెలిపారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటరాక్టివ్ ప్యానెళ్లు అందుబాటులోకి రానున్నాయని, ఈ దిశలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పించి, వారిని పోటీ ప్రపంచంలో నిలిచేట్లుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి లక్ష్యాన్ని చేరుకోడానికి అందరూ కలిసి కట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి వివరించారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు, మున్సిపల్ టీచర్లకు సంబంధించిన సర్వీసు విషయాలు మొదలైన అంశాలపై సమగ్రంగా చర్చించి10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.
జగనన్న విద్యా కానుక కిట్లకు సంబంధించిన నాణ్యత విషయంలో రాజీ పడకుండా, అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, వాటిని విద్యార్ధులకు పంపిణీ చేసే ప్రక్రియలో టీచర్లకు ఇబ్బందులు ఎదురైన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి నేరుగా పాఠశాలలకే కిట్లను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాలలు ప్రారంభమైన రెండు మూడు రోజుల్లోనే ఇవన్నీ విద్యార్ధులకు అందేలా చూస్తున్నామన్నారు. అలాగే ఇలా అందించిన బూట్లు యూనిఫామ్ వంటి వాటిన్నటిని విద్యార్ధులు సమగ్రంగా వినియోగించుకునేలా టీచర్లు వారిని ప్రోత్సహించాలని సూచించినట్లు తెలిపారు.
విద్యాశాఖలో ఉన్న ఐఎఎస్ అధికారులందరూ ప్రతి నెలా కనీసం రెండు పాఠశాలలను సందర్శించి, విద్యార్ధులకు మెరుగైన విద్య అందేలా చర్యలు తీసుకుంటారన్నారు.
*రేపే పదో తరగతి ఫలితాలు*
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను శనివారం ( మే 5 వ తేదీన) విడుదల చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రికార్డు సమయంలో పరీక్షలు జరిగిన 18రోజుల్లోనే ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల్లో తక్కువ ఉత్తీర్ణతా శాతం వచ్చిన విద్యా సంస్థల్లో తీసుకోవాల్సిన చర్యలపై టీచర్ల యూనియన్లను సలహాలు సూచనలివ్వమని కోరినట్లు చెప్పారు.
ట్రిపుల్ ఐ టి విద్యా సంస్థల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు ఫీజులు చెల్లించాలని వత్తిడి తెస్తున్నారంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆ విద్యార్ధులకు సంబంధించిన ఫీజుల చెల్లింపు అనేది ప్రభుత్వ బాధ్యత అని దానిని నెరవేరుస్తామన్నారు. అయితే తనకున్న సమాచారం మేరకు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది కూడా ఫీజులు చెల్లించని విద్యార్ధులనే ఫీజులు చెల్లించాలని అడిగారన్నారు. ఇటువంటి సమస్యలను అధిగమించేందుకు వచ్చే ఏడాది నుంచి మూడు, నాలుగో విడతల విద్యా దీవెన ఒకేసారి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారని వెల్లడించారు.
రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల వారు కలిసి ఉండాలన్న ప్రభుత్వ విధానానికి సంపూర్ణ మద్ధతు లభించిందన్నారు. కొంత మంది, కొన్ని వర్గాల వారే ఉండాలన్నది ప్రైవేటు వ్యవస్థల్లో సాధ్యం అవుతుంది గానీ, ప్రభుత్వ వ్యవస్థల్లో కాదన్నారు.
*జిల్లా అధికారులతో విద్యాశాఖామంత్రి వీడియో కాన్ఫరెన్స్*
అనంతరం విద్యాశాఖామంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు జిల్లా విద్యాశాఖాధికారులతో, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారు, పాఠశాల విద్య కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు, పాఠశాల విద్య కమీషనర్ (ఇన్ఫ్రా) శ్రీ కాటమనేని భాస్కర్ గారు, సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు గారు, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ డా. నిధి మీనా, ఏపీఈడబ్ల్యూ ఐడీసీ ఎండి దివన్ రెడ్డి గారు, తదితర విద్యాశాఖా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖామంత్రి మాట్లాడుతూ విద్యాశాఖలో అమలు చేస్తున్న మన బడి: నాడు –నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద తదితర పథకాల అమలు తీరు గురించి జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూన్ కల్లా మన బడి: నాడు- నేడు పనులు పూర్తి చేయాలని అన్నారు. జగనన్న విద్యాకానుకలో భాగంగా ప్రతి మండల స్టాకు పాయింట్లలో ‘జగనన్న విద్యాకానుక క్వాలిటీ వాల్’ ఏర్పాటు చేస్తున్నామని, వెండర్ల నుంచి వచ్చిన కిట్లను క్వాలిటీ వాల్ లో ఉన్న శాంపిల్ కిట్లతో నాణ్యత, తదితర అంశాలను సరిపోల్చాలన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు నమోదుశాతం పెరిగేలా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని కోరారు. ఉత్తమ బోధన దిశగా అడుగులు వేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
addComments
Post a Comment