పేదలు పథకాలకు దూరం కాకూడదు.



*పేదలు పథకాలకు దూరం కాకూడదు


*


పార్వతీపురం, మే 6 (ప్రజా అమరావతి):  పేదవారు ప్రభుత్వం పథకాలకు దూరం కాకుండా చూడాలని జిల్లా ప్రత్యేక అధికారి ఎం. రవిచంద్ర తెలిపారు. జిల్లా పర్యటనకు శనివారం విచ్చేసిన ప్రత్యేక అధికారి కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ పధకాలపై జిల్లా కలెక్టరు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్యం, మహళా శిశు సంక్షేమం,  పంచాయతీరాజ్, స్పందన, జగనన్నకు చెబుతాం, మొబైల్ టవర్స్, వ్యవసాయం, ఉద్యానవనశాఖ, నాడు-నేడు,రీసర్వే పధకాలపై సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో జిల్లా ప్రత్యేక అధికారి ఎం. రవిచంద్ర మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలుకు, అభివృద్దికి కావలసిన సహకారం గూర్చి తెలియజేస్తే రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు. ఆధార్ కార్డు, బ్యాంకు అక్కౌంటు లేకపోవడం వలన చాలామంది పేదవారు ప్రభుత్వ పధకాలను పొందలేకపోతున్నారని, కావున ప్రతి ఒక్కరికి బ్యాంకు అక్కౌంటు, ఆధార్ నంబరు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎవరికైనా ప్రభుత్వ పథకాలు అందకపోతే అందుకు గల కారణాలను తెలుసుకోవాలని, వారికి పధకాలు అందించాలన్నారు.  గర్బిణీ స్త్రీలు, పిల్లలలో రక్తహీనత లేకుండా చేయుటకు వారికి వైద్య సేవలు, పౌష్టికాహారం అందించుటకు  వైద్య ఆరోగ్య శాఖ, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, వారి వద్దగల డేటాను పంచుకొని సరిచూసుకోవాలని తెలిపారు. సదరు డేటా ప్రకారం ఏ ఒక్కరు మిగిలిపోకుండా  పిల్లలందరికీ టీకాలు, పౌష్టికాహారం అందించాలన్నారు. ప్రభుత్వ శాఖలు తమవద్ద గల గణాంకాలను యితర శాఖలతో సరిచూసుకోవాలని తెలిపారు.  జిల్లాకు  మంజూరైన  వెల్ నెస్ సెంటర్లను పూర్తిగా నిర్మించాలని, వాటి నిర్మాణంలో గల యిబ్బందులు, ఆర్దిక వనరులపై నివేదిక అందించాలని తెలిపారు.  గ్రామీణ, మన్య ప్రాంతాలలో ప్రజలు వైద్య సహాయం కొరకు పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రులపై అధారపడతారని కావున వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని తెలిపారు. 


జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ జిల్లా ప్రగతిని  పవర్ పాయింటు ప్రజెంటేషను ద్వారా తెలియజేసారు. హౌసింగు కు సంబంధించి జిల్లాకు 24743 ఇళ్లులు మంజూరుకాగా నలబైశాతం ఇళ్లు పూర్తిచేసి రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచినట్లు జిల్లా కలెక్టరు తెలిపారు. ఇళ్లు కట్టుకొనుటకు ప్రభుత్వం నుండి  సహాయం అందిస్తున్నామని,  స్వయం సహాయక సంఘాల సభ్యులకు  అదనపు రుణం అందిస్తున్నట్లు తెలిపారు.  మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా  తక్కువ బరువుగల పిల్లలు, రక్తహీనత గల గర్బిణీ స్త్రీలు అందరికి  పౌష్ఠిక ఆహారం అందించబడుతుందన్నారు.  జిల్లాకు 196 వెల్ నెస్ సెంటర్లు మంజూరుకాగా మారుమూల ప్రాంతాలలో గల గ్రామాలలో 96 గ్రౌండింగు చేయవలసి ఉన్నదన్నారు.  స్పందన  కార్యక్రమంలో అర్జీదారులతో అధికారులు నేరుగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని,  పిర్యాదులలో 75శాతం రెవిన్యూశాఖకు సంబంధించి వస్తున్నాయని, అందువలన  మండల స్థాయిలో రెవిన్యూ డివిజనల్ అధికారులు ప్రత్యేక రెవిన్యూ స్పందన కార్యక్రమం నిర్వహించి మండల స్థాయిలోనే సమస్యలను పరిష్కరించడం వలన, కలెక్టరు కార్యాలయం నకు వచ్చే అర్జీలు తగ్గాయని తెలిపారు. త్వరలో  ప్రారంభం కానున్న జగనన్నకు చెబుదాం  ప్రత్యేక స్పందన కార్యక్రమం ప్రారంభించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు  తెలిపారు.  జిల్లాలో  పూర్తిస్థాయిలో మొబైల్ నెట్ వర్కు అందుబాటులోనికి తీసుకువచ్చుటకు 1312 ఏజేన్సీ గ్రామాల ప్రజలకు  ఉపయోగపడే విధంగా 191 సెల్ టవర్లు నిర్మిస్తున్నామని,  అక్టోబరు నాటికి నిర్మాణం పూర్తయి పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోనికి వస్తాయని జిల్లా కలెక్టరు తెలిపారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు, ధాన్యం సేకరణ సేమలు అందిస్తున్నామని, కస్టమ్ హైర్ సెంటర్లు ద్వారా రైతులకు  యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపధకన అందించుటకు    ఏర్పాట్లు  చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అకాల వర్షాలకు   213 హెక్టార్ల మొక్కజొన్న, నువ్వుల పంట  మరియు 291 హెక్టార్ల  అరటి పంటలు దెబ్బతిన్నాయని నష్టపరిహారం కొరకు ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు కలెక్టరు తెలిపారు. 


ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టరు సి. విష్ణుచరణ్, జిల్లారెవిన్యూ అధికారి జె. వెంకటరావు, రెవిన్యూ డివిజినల్ అధికారి కె. హేమలత, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కృష్ణాజి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు   ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments