ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన గుడివాడ వెనుకబడి ఉంది.

 *- ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన గుడివాడ వెనుకబడి ఉంది* 


 *- 20 ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు* 

 *- ఉద్యోగాల్లేక ఇబ్బందుల్లో గుడివాడ యువత* 

 *- నా వంతుగా ఉద్యోగాలిప్పించే ప్రయత్నం చేస్తున్నా* 

 *- ప్రతి ఏటా నలుగురైదుగురిని అమెరికా పంపిస్తా* 

 *- రిక్వైర్మెంట్ ఉంటే గుడివాడ యువతకు సహకరించండి*

*- అట్లాంటా సభలో ఎన్నారైలను కోరిన వెనిగండ్ల రాము* 



గుడివాడ, మే 13 (ప్రజా అమరావతి): విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు ప్రాతినిధ్యం వహించిన కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉందని, గత 20ఏళ్ళుగా ఎటువంటి అభివృద్ధికీ నోచుకోవడం లేదని వెనిగండ్ల ఫౌండేషన్ అధినేత, తెలుగుదేశం పార్టీ నేత, ఎన్నారై వెనిగండ్ల రాము ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో వెనిగండ్ల మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను వేదికగా చేసుకుని గుడివాడ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు, గత 20ఏళ్ళుగా కొనసాగుతూ వస్తున్న వెనుకబాటుతనాన్ని ఎన్నారైల సమక్షంలో ఏకరువు పెట్టారు. ముఖ్యంగా గుడివాడ యువతకు అమెరికాలో కల్పించాల్సిన ఉద్యోగావకాశాలు, ఎన్నారైల సహకారంపై వెనిగండ్ల మాట్లాడిన తీరు అందరినీ కదిలించింది. గుడివాడ నియోజకవర్గంలో వెనుకబాటుతనంపై వెనిగండ్ల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ మొదటగా గుడివాడ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారని తెలిపారు. ఎన్టీఆర్ హయాంలోనే గుడివాడలో అభివృద్ధి జరిగిందన్నారు. ఎన్టీఆర్ స్టేడియం, 100 పడకల ప్రభుత్వాసుపత్రి. ఓవర్ బ్రిడ్జి, విశాలమైన రోడ్లు వంటివి అనేకం ఎన్టీఆర్ కృషి వల్లే గుడివాడలో వచ్చాయన్నారు. దురదృష్టవశాత్తూ గత 20ఏళ్ళుగా గుడివాడలో అభివృద్ధి కన్పించకుండా పోయిందన్నారు. గుడివాడలోనే తాను కూడా పుట్టి పెరిగానని, నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. అమెరికాలో రాణించిన తనకు గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు అండగా నిలవాలని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని, నిరుపేదలను ఆదుకోవాలన్న ఆలోచన వచ్చిందన్నారు. దీంతో గత ఏడాది నుండి గుడివాడలో విస్తృతంగా సేవాకార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నానని తెలిపారు. ముఖ్యంగా గుడివాడ యువత ఉద్యోగాల్లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నా వంతుగా ఉద్యోగాలిప్పించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని చెప్పారు. ప్రతి ఏటా గుడివాడ నుండి నలుగురైదుగురిని ఉద్యోగాల కోసం అమెరికా పంపించేందుకు నిర్ణయించానని తెలిపారు. రిక్వైర్మెంట్ ఉంటే గుడివాడ యువతకు సహకరించాలని కోరారు. ఏళ్ళ తరబడి వెనుకబడి ఉన్న గుడివాడ నియోజకవర్గాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని వెనిగండ్ల పిలుపునిచ్చారు.

Comments