ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాలు పంపిణీ.

 *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*

*పాఠశాల విద్యాశాఖ - సమగ్ర శిక్షా*


విజయవాడ (ప్రజా అమరావతి);

*ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాలు పంపిణీ*

- సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు .

పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ద్వారా ప్రత్యేక అవసరాల గల పిల్లలకు అలవెన్సులు, ఉపకరణాలు, ఫిజియోథెరపీ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని, సాధారణ పిల్లలతో సమానంగా ప్రత్యేక అవసరాలు పిల్లలను చూడాలని, ఇలాంటి పిల్లలు తమ పనులు తామే సొంతంగా చేసుకునేలా శిక్షణ ఇవ్వాలని, ప్రత్యేక ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు  అన్నారు. 

సోమవారం పటమట కేబీసీ బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్టీఆర్ జిల్లాలో 17 మండలాల భవిత కేంద్రాల్లోని 564 మంది పిల్లలకు ఉపకరణాలు అందజేత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  దాదాపు  రూ. 25 లక్షల విలువగల ఈ ఉపకరణాలు స్వర్ణ టోల్ వే ప్లాజా (నందిగామ) సంస్థ అందజేయడం అభినందనీయమని, గత మూడేళ్లుగా దివ్యాంగ పిల్లలకు తమవంతు సాయం అందిస్తున్నారని  ఆ సంస్థ ప్రతినిధులు ఎం.హరిపాండురంగస్వామి, ఎం.జయప్రకాష్, సేఫ్టీ ఆఫీసర్ టి.శ్రీనివాసరావులను కొనియాడారు. 

*2025 నాటికి పూర్తి సమ్మిళిత విద్య*

ఈ సందర్భంగా సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు  మాట్లాడుతూ.. ఇలాంటి పిల్లల అభివృద్ధికి  ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల సాయం కూడా అందించాలని కోరారు. ప్రత్యేక అవసరాల గల పిల్లలను సర్వేలో నాలుగైదు అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోగా రాష్ట్రంలో 92,326 మంది విద్యార్థులను గుర్తించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యలో ఎన్సీఈఆర్టీ 21 అంశాలతో రూపొందించిన ‘ప్రశస్త్’ యాప్ ద్వారా సర్వే చేస్తే మరో లక్షమంది పిల్లలు ఉండవచ్చని, సర్వే త్వరలో మొదలుపెడతామని అన్నారు.  మీ పరిధిలో ఉన్న దివ్యాంగ పిల్లలను గుర్తించి స్థానిక ప్రధానోపాధ్యాయులకు సమాచారం ఇవ్వాలని తల్లిదండ్రులను కోరారు.

పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ద్వారా 2025 నాటికి పూర్తి సమ్మిళిత విద్య అందించడానికి ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా చదువుకొని, రాయగల పిల్లలకు ట్యాబ్ లు ఇచ్చి ప్రత్యేక సాప్ట్ వేర్ ద్వారా వీరికి బోధించడం జరుగుతుందన్నారు. ఇటీవల అనంతపురం జిల్లాలోని ఆర్‌డిటి (రూరల్ డెవలెప్మెంట్ ట్రస్ట్) ఇన్‌క్లూజివ్ హైస్కూల్‌కు చెందిన ఆరుగురు దివ్యాంగ (దృష్టిలోపం గల) విద్యార్థినులు డిజిటల్ విధానంలో పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించారన్న విషయం తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరానికి మరింత ఎక్కువమంది విద్యార్థులతో స్రైబ్స్ (సహాయకులు) లేకుండానే పరీక్షలకు హాజరయ్యేలా తర్ఫీదునిస్తాం. సమ్మిళిత విద్యలో అన్ని అంశాలను పిల్లలకు నేర్పాలనే సదుద్దేశంతో రూరల్ డెవలెప్మెంట్ ట్రస్ట్, చక్షుమతి ఎన్జీవో సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవలసి ఉందని, తద్వారా ప్రత్యేక ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామన్నారు.   మన బడి: నాడు-నేడు పనుల్లో కూడా దివ్యాంగ పిల్లలకు అనుకూలంగా ఉండేలా ర్యాంపులు వంటివాటి నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేశామని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ డీఈవో శ్రీమతి సీవీ రేణుక , సమగ్ర శిక్షా ఏపీసీ జి.మహేశ్వరరావు , రాష్ట్ర ఐఈ విభాగం కో ఆర్డినేటర్ శ్రీమతి ఎన్ కె అన్నపూర్ణ , జిల్లా ఐఈ కో ఆర్డినేటర్ వెంకటేశ్వరరావు 


తదితరులు పాల్గొన్నారు.


Comments