ఆదివారంలోపు స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తాం.

 *ఆదివారంలోపు స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తాం*



*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 11 (ప్రజా అమరావతి):


వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద జిల్లాలో రీసర్వే చేపట్టిన గ్రామాల్లో వచ్చే ఆదివారంలోపు స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పేర్కొన్నారు.


గురువారం విజయవాడ సిసిఎల్ఏ కార్యాలయం నుండి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం, భూ హక్కు పత్రాలు, భూ రక్షా స్టోన్స్, గ్రౌండ్ టూ థింగ్ ప్రక్రియ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ టిఎస్. చేతన్, తదితరులు పాల్గొన్నారు.*


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద జిల్లాలో 26 గ్రామాలకు సంబంధించి 27,146 స్టోన్స్ రావడం జరిగిందని, అందులో ఇప్పటివరకు 22,714 స్టోన్స్ పాతే ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందని, మరో 4,432 స్టోన్స్ నాటాల్సి ఉందన్నారు. వచ్చే ఆదివారంలోపు రోజుకు 1,200 చొప్పున స్టోన్స్ నాటే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. బుధవారం రోజు 1,142 స్టోన్స్ నాటడం జరిగిందని తెలిపారు. భూ హక్కు పత్రాలకు సంబంధించి జిల్లాలోని 26 గ్రామాల్లో 6,620 భూ హక్కు పత్రాలు రాగా, అందులో 93 శాతం భూ హక్కు పత్రాలను రైతులకు పంపిణీ చేయడం జరిగిందని, మిగిలిన భూ హక్కు పత్రాలు త్వరితగతిన పంపిణీ చేయడం పూర్తి చేస్తామన్నారు. రీ సర్వే చేపట్టిన గ్రామాల్లో గ్రౌండ్ టు థింగ్ ప్రక్రియను వేగవంతంగా చేపట్టేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ షేక్షావలి, తదితరులు పాల్గొన్నారు.



Comments